"కడుపులో తన్నారు, బయటకు గెంటేశారు.."! మమత షాకింగ్ ఆరోపణలు..!
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భవానీపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 15 వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ఇవాళ సంచలన ఆరోపణలు చేశారు. నిన్న సాయంత్రం ఓట్ల లెక్కింపు చివరి దశలో చోటు చేసుకున్న పరిణామాలపై స్పందిస్తూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ కేంద్రంలోనే తనపై దాడి జరిగిందని మమత ఆరోపించారు. కడుపులో, వెనుక తన్నారని, పోలింగ్ కేంద్రం నుంచి గెంటేశారని తెలిపారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియ సమయంలో హింస, బెదిరింపులు జరిగాయని సీఎం మమత ఆరోపించారు.మొదటి విడత లెక్కింపు తర్వాత, బీజేపీకి 195-200 ఓట్లు వస్తున్నాయని చెప్పడం మొదలుపెట్టారని, వారు తుది ఫలితం కోసం వేచి ఉండలేదన్నారు. ఆ తర్వాత, బీజేపీ వారు పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ప్రజలను, కౌంటింగ్ ఏజెంట్లను కొట్టడం ప్రారంభించారన్నారు. తమ పార్టీ కౌంటింగ్ ఏజెంట్లను బలవంతంగా బయటకు పంపించారని, పరిస్థితి ఉద్రిక్తంగా మారే సమయానికి తాను సుమారు 30,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నానని బెనర్జీ పేర్కొన్నారు.

అప్పుడు బీజేపీ అభ్యర్థి 200 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది, 200 మంది బయటి గూండాలతో కలిసి లోపలికి వెళ్లారని, వారు తమ వాళ్లను కొట్టారని మమత తెలిపారు. మహిళలను కూడా వదల్లేదన్నారు. అన్ని ఫారాలను లాక్కున్నారన్నారు. తన సొంత అనుభవాన్ని వివరిస్తూ.. తనను కూడా ఆపి దాడి చేశారని మమత ఆరోపించారు. వారు తన కారును ఆపారని, కానీ తాను వేరే మార్గంలో వెళ్లానన్నారు. తాను లోపలికి ప్రవేశించగానే, లోపలికి వెళ్లడానికి అనుమతించరని సీఆర్పీఎఫ్ చెప్పారన్నారు. తాను అభ్యర్థిని అని చెప్పానని, వారు తన కడుపులో, వెనుక తన్ని, బలవంతంగా లాగి దాడి చేశారన్నారు. ఆ సమయంలో సీసీటీవీ ఆఫ్‌లో ఉందన్నారు.
వారు తనతోనే దురుసుగా ప్రవర్తించారు కాబట్టి ఇతర అభ్యర్థులు, కార్యకర్తలు ఎంత హింసకు గురయ్యారో ఊహించగలనన్నారు. తాము తిరిగి పుంజుకుంటామని, ఎదురుతిరుగుతామని, పులిలా వారితో పోరాడతామని మమత చెప్పుకొచ్చారు. బీజేపీ దురాగతాలను ఇకపై సహించనని, తాను వీధుల్లో ఉన్నానని, వీధుల్లోనే ఉంటానని మమత తెలిపారు. ఫలితాల తర్వాత సోనియా, రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, ఉద్ధవ్ థాకరే, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, హేమంత్ సోరెన్ తనకు ఫోన్ చేశారని, ఇండియా కూటమిలోని మిత్రపక్షాలన్నీ తనకు అండగా ఉంటామని చెప్పారన్నారు.














Click it and Unblock the Notifications