దేశంలో ఓ రోజు మీడియానే ఉండదు-బీబీసీపై ఐటీ రైడ్స్ పై మమతా బెనర్జీ ఫైర్..
ఢిల్లీ, ముంబైల్లోని బీబీసీ కార్యాలయాలపై ఐటీ అధికారుల సర్వేను పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా తప్పుబట్టారు. ఇలాగైతే దేశంలో ఒక రోజు మీడియా అనేదే లేకుండా పోతుందన్నారు.
ఢిల్లీ, ముంబైల్లో బీబీబీ ఆఫీసులపై ఐటీ అధికారులు సర్వే పేరుతో చేస్తున్న హంగామాపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఫైర్ అయ్యారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే కేంద్రం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు ఆమె ఆరోపించారు. ఇది దేశంలో మీడియా స్వేచ్ఛకు భంగం కలిగిస్తోందన్నారు. బీబీసీ ఆఫీసులపై ఐటీ సర్వేలు దురదృష్టకరమని వ్యాఖ్యానించిన మమత.. ఇలాగైతే ఓ రోజు దేశంలో మీడియా అనేదే లేకుండా పోతుందన్నారు.
లాభాల మళ్లింపు ఆరోపణలతో ఐటీ అధికారులు నిన్న ఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లో సర్వే చేపట్టారు. ఉద్యోగుల సెల్ ఫోన్లు, కంప్యూటర్లు వాడకుండా అడ్డుకున్నారు. ఈ సర్వే ఇవాళ కూడా కొనసాగుతోంది. దీంతో ఐటీ అధికారుల సర్వేకు సహకరించమని ఉద్యోగులకు బీబీసీ యాజమాన్యం మెయిల్స్ పంపింది. అలాగే బ్రాడ్ కాస్టింగ్ మినహా మిగతా ఉద్యోగుల్ని వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పని చేయమని సూచించింది. బీబీసీ కార్యాలయాలపై ఐటీ సర్వేను బ్రిటన్ కూడా నిశితంగా గమనిస్తున్నట్లు ప్రకటించింది.

2002 నాటి గుజరాత్ అల్లర్లలో ప్రధాని మోడీ పాత్రపై బీబీసీ డాక్యుమెంటరీ సంచలనం రేపింది. దీంతో సోషల్ మీడియాలో వీటి లింకులు కనిపించకుండా నిషేధించిన కేంద్రం.. దాని ప్రదర్శనను కూడా పలు చోట్ల అడ్డుకుంది. ఈ నేపథ్యంలో బీబీసీ కార్యాలయాలపై ఐటీ దాడులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బీబీసీపై నిషేధం విధించాలంటూ అధికార బీజేపీ నేతలు డిమాండ్లు చేస్తున్న నేపథ్యంలో కేంద్రం తీసుకుంటున్న చర్యలు చర్చనీయాంశమవుతున్నాయి. కేంద్రం చర్యల్ని విపక్షాలన్నీ మూకుమ్మడిగా తప్పుబడుతున్నాయి.












Click it and Unblock the Notifications