సీఈసీ అబద్ధాల కోరు..! 58లక్షల ఓట్లు తీసేస్తారా? మమతా బెనర్జీ ఫైర్..!
పశ్చిమ బెంగాల్లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ పేరుతో ఏకంగా 58 లక్షల ఓట్లను తొలగించడంపై సీఎం మమతా బెనర్జీ (mamata banerjee) తీవ్రంగా మండిపడ్డారు. దీనిపై తాడోపేడో తేల్చుకునేందుకు నేరుగా ఢిల్లీ చేరుకున్న ఆమె.. సీఈసీ జ్ఞానేష్ కుమార్ ను కలిశారు. ఎస్ఐఆర్ పై తమ అభ్యంతరాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కానీ ఆయన ఇవేవీ పట్టించుకోకపోవడంతో మమత బయటికి వచ్చి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు కళ్యాణ్ బెనర్జీ, అభిషేక్ బెనర్జీతో కలిసి మమత ఇవాళ సీఈసీ జ్ఞానేష్ కుమార్ తో భేటీ అయ్యారు. ఇందులో బెంగాల్లో చిన్న చిన్న తప్పిదాల సాకుతో ఏకంగా 58 లక్షల ఓట్లను ఎలా తీసేస్తారని ప్రశ్నించారు. బీజేపీ చేతుల్లో పావుగా మారి తమ పార్టీపై కక్షసాధింపులకు దిగుతున్నారని విమర్శించారు. సీఈసీ జ్ఞానేష్ ఓ గర్విష్టి అని, అబద్దాల కోరు అని అనంతరం మమతా బెనర్జీ ఆరోపించారు. ఇవాళ సీఈసీతో భేటీ తర్వాత మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఇది చాలా బాధాకరమని, తాను ఢిల్లీ రాజకీయాల్లో చాలా కాలంగా ఉన్నానని, ఏడుసార్లు ఎంపీగా, నాలుగు సార్లు కేంద్రమంత్రిగా కూడా పనిచేశానని తెలిపారు.

కానీ ఇంత గర్విష్టి, ఇంత అబద్ధాల కోరు ఎన్నికల కమిషనర్ ను తాను ఎప్పుడూ చూడలేదని ఆమె వ్యాఖ్యానించారు. ఎవరికీ ఓ కుర్చీ కూడా శాశ్వతం కాదని, అయినా తాను కుర్చీకి గౌరవం ఇస్తున్నట్లు ఆయనతో తాను చెప్పినట్లు మమత తెలిపారు. ఒకరోజూ మీరూ దాన్ని వదిలిపోవాల్సిందేనని అని చెప్పానన్నారు. బెంగాల్ ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని సీఈసీని ప్రశ్నించారు. ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పండగ లాంటివని, కానీ మీరు 58 లక్షల ఓట్లను తొలగించారని, దానిపై అభ్యంతరాలు చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వలేదని ఆరోపించారు.












Click it and Unblock the Notifications