మమతా బెనర్జీ ఓ ఊసరవెల్లి, ప్రధాని పదవే లక్ష్యంగా.: కాంగ్రెస్ చీఫ్ తీవ్ర విమర్శలు
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మమతా బెనర్జీ ఓ ఊసరవెల్లి అని, ఆమె ప్రధానమంత్రి పదవే లక్ష్యంగా కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
Recommended Video


మమతను నమ్మొద్దు..
అంతేగాక, మమతా బెనర్జీ ‘ట్రోజన్ హార్స్' వైరస్ లాంటి వారని, ఆమె ఐకమత్యంగా ఉన్న ప్రతిపక్షాలను విడదీస్తున్నారని.. ఆమెను ఎవ్వరూ నమ్మవద్దని ఇతర పార్టీల నేతలను కోరారు. ఇటీవల మమతా బెనర్జీ యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీలను కలిసిన విషయం తెలిసిందే.

మమతకు ప్రధాని కావాలనే ఆశ
ఈ నేపథ్యంలో.. మమత ఓ వైపు బెంగాల్‌లో కాంగ్రెస్ లేకుండా చెయ్యాలని ప్రయత్నిస్తున్నారని, మరో వైపు లోక్‌సభలో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరుతున్నారని రంజన్ మండిపడ్డారు. మమతకు ప్రధాని కావాలనే ఆశ ఉందని, ఆమెకు ‘దేవెగౌడ-సిడ్రోమ్, గుజ్రాల్ సిండ్రోమ్' ఉన్నాయని విమర్శించారు.

రాజకీయమే నేరమా?
బెంగాల్‌లో రాజకీయమే పెద్ద నేరంగా మారిందని రంజన్ చౌదరి ఆరోపించారు. బెంగాల్‌లో ఎలాగైనా వీలైనన్ని సీట్లు కొల్లగొట్టాలని చూస్తున్నారని, అలా అయితే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని పదవి పొందొచ్చని, అందుకు ప్రతిపక్షాల మద్దతు కావాలని భావిస్తున్నారని అన్నారు.

ఓ ఊసరవెల్లి.. ఊహకందని.. నియంత
మమతా బెనర్జీ ఎప్పటికప్పుడు రంగు మార్చే ఊసరవెల్లి లాంటివారని, నమ్మదగిన వ్యక్తి కాదని, ఊహకు కూడా అందని రాజకీయవేత్త అని.. అందుకే కాంగ్రెస్ తోపాటు ఇతర పార్టీ నేతలు ఆమెను నమ్మవద్దని రంజన్ కోరారు. మమతా బెనర్జీ ఓ నియంత అని మండిపడ్డారు. బెంగాల్‌లో కాంగ్రెస్ నేతలను ఎన్నికల్లోనే నిలబడకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారని, తమ నేతలను జైళ్లలో పెడుతున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications