ఎక్కడిదాకా వెళ్తానో చూస్తారా: బిజెపికి మమత వార్నింగ్
కోల్‌కతా/లక్నో: పశ్చిమ బెంగాల్లో బిజెపి కార్యకర్తల పైన దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ రెండు బృందాల నాయకులను బెంగాల్‌కు పంపించింది. దీనిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ నిప్పులు గక్కారు. తాను కూడా బిజెపి పాలిత ప్రాంతాల్లో అలాంటి సంఘటనలు జరుగుతున్నాయేమో తెలుసుకునేందుకు తమ ఎంపీల బృందాన్ని పంపుతానని హెచ్చరించారు.
ఇక ఇప్పటి నుంచి బిజెపి పాలిత రాష్ట్రాల్లో అలాంటి దాడులేమైనా జరుగుతున్నాయో తెలుసుకునేందుకు తృణమూల్ పార్టీ తరఫున తాను కేంద్ర బృందాన్ని పంపుతానని, కుక్కకాటుకు చెప్పు దెబ్బ అన్నట్లు వారేం చేస్తున్నారో అదే తాను చేస్తానని, అల్లర్లను రేకెత్తించడానికి ఆ పార్టీ సిపిఎం గూండాలతో చేతులు కలిపిందనుకుంటున్నానని, ఒకవేళ అదే నిజమైతే ప్రజాస్వామ్య ప్రభుత్వంలో దానిని సహించలేమన్నారు.
తాను తమ పార్టీ 46 ఎంపీలనూ ఢిల్లీకి పంపుతానన్నారు. నేనెక్కడి దాకా వెళ్తానో చూడాలనుందా? అని బిజెపిని హెచ్చరించారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి ఆ పార్టీ కాంగ్రెస్ లాగానే వ్యవహరిస్తోందన్నారు.

మమత వ్యాఖ్యలపై స్పందించిన బిజెపి జాతీయ ప్రతినిధి సిద్ధార్థ్ నాథ్ సింగ్ స్పందించారు. రాష్ట్రంలో తమ పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులకు మమతదే బాధ్యతని, దానిపై కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు. ఇది స్వతంత్ర దేశమని, ఆమె ఏదనుకుంటే అది చేసుకోవచ్చన్నారు.
బిజెపి ఎంపీపై కాల్పులు
ఉత్తర ప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యురాలు నిరంజన్ జ్యోతి పైన నలుగురు వ్యక్తులు ఆదివారం కాల్పులు జరిపారు. ఆమె సురక్షితంగా బయటపడ్డారు. ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. పాతకక్షలే దీనికి కారణమని భావిస్తున్నారు. కాల్పుల్లో తన గన్ మెన్ రాహుల్ గాయపడినట్లు ఎంపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు భాను పటేల్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.












Click it and Unblock the Notifications