జమామసీద్ ఇమామ్‌పై కిరోసిన్‌తో దాడి, లైటర్ దొరికింది
న్యూఢిల్లీ: షహీ ఇమామ్ బుఖారీ పైన కమాలుద్దీన్ అనే 32 ఏళ్ల యువకుడు కిరోసిన్ సీసా విసిరాడు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం జమా మసీదు వద్ద జరిగింది. జమా మసీదులో నమాజు చేసేందుకు బుఖారీ హాజరవుతున్న సమయంలో నిందితుడు అతని పైకి సీసా విసిరాడు.
బుఖారీ పైన కొన్ని కిరోసిన్ చుక్కలు పడ్డాయి. అయితే, ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. ఈ ఘటనలో బుఖారీకి ఏమీ కాలేదని, నిందితుడు పశ్చిమ బెంగాల్లోని 24 పరగణాల జిల్లాకు చెందిన వాడని స్థానిక పోలీసులు ఆదివారం తెలిపారు. బుఖారీ పైకి యువకుడు కిరోసిన్ డబ్బా విసిరేశాడని, ఆ తర్వాత లైటర్ తీసే సమయంలో అడ్డుకున్నారని ఇమామ్ కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇమామ్ బుఖారీ సోదరుడు తారిక్ బుఖారీ మాట్లాడుతూ.. దాడికి ఎందుకు పాల్పడ్డారనే విషయం తెలియదని చెప్పారు. బుఖారీకి సెక్యూరిటీ తక్కువగా ఉన్న విషయాన్ని నిందితుడు గుర్తించాడని చెప్పారు. అందుకే అతనిని తుదముట్టించాలనుకున్నాడని అభిప్రాయపడ్డారు.

బుఖారీకి ఉన్న సెక్యూరిటీ ఎప్పటికీ ఆందోళన కలిగించే అంశమే అన్నారు. నమాజ్ చేసే సమయంలో సెక్యూరిటీ ఉండదని, అతను ప్రజలతో కలిసి నమాజ్ చేస్తారని, దానిని యువకుడు గమనించాడని అభిప్రాయపడ్డారు. దాడికి పాల్పడిన యువకుడు జమా మసీదుకు నమాజుకు వచ్చే వాడు కాదని, అలాగే అతను ఈ పరిసర ప్రాంతాల్లోను ఎప్పుడు కనిపించలేదన్నారు. కాగా, పోలీసులు అతనిని పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వాడిగా గుర్తించారు.
ఇమామ్ తనయుడు షబాన్ బుఖారి మాట్లాడుతూ.. నిందితుడిని సెక్యూరిటీ పర్సన్స్ వెంటనే అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. అతని వద్ద లైటర్ దొరికిందన్నారు. ఈ ఘటన జరగ్గానే ఇమామ్‌ను సురక్షిత ప్రాంతానికి తీసుకు వెళ్లారని తెలిపారు.
లా అండ్ ఆర్డర్ స్పెషల్ కమిషనర్ దీపక్ మిశ్రా మాట్లాడుతూ.. నిందితుడిని తాము అరెస్టు చేశామని చెప్పారు. అతను ఎందుకు అలా చేశాడో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. దీని పైన విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో ఇమామ్‌కు ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు.












Click it and Unblock the Notifications