షాకింగ్ : నిద్రలో పామును పరాపరా నమిలేశాడు
ఇండోర్ : కుంభకర్ణుడి నిద్ర గురించి అందరికీ తెలిసే ఉంటుంది. భూగోళం బద్దలయి పోతున్నా సరే.. ప్రశాంతంగా నిద్రపోయేవాళ్లన్నమాట. కొంతమందిలో ఈ విపరీత ధోరణి ఎంతలా ఉంటుందంటే.. ఆఖరికి మొహం మీద తేళ్లు, జెర్రులు పాకినా ఇసుమంత కూడా చలనం లేనంతగా.
ఇండోర్ లో రఘువంశీ (28) అనే వ్యక్తి విషయంలోను ఇదే జరిగింది. స్థానికంగా ఓ పెట్రోల్ బంక్ లో పనిచేసే రఘువంశీ.. బాగా అలసిపోయి ఇంటికొచ్చి గాఢ నిద్రలోకి జారుకున్నాడు. ఎప్పుడూ నోరు తెరిచి భారీగా గురుకపెడుతూ నిద్రపోతుంటాడు. ఇదే క్రమంలో గత గురువారం నాడు రఘువంశీ గాఢ నిద్రలో ఉండగా.. పైన ఉంచిన ఓ డబ్బా పై నుంచి పాకుతున్న పాము అదుపు తప్పి వంశీ మొహంపై పడింది. ఆ తర్వాత అతని నోటికి దగ్గరగా పాక్కుంటూ వెళ్లింది.

అప్పటికే నోరు తెరిచి నిద్రపోతున్న వంశీ.. ఆ పాము తలను చటుక్కున రెండు ముక్కలుగా కొరికేసి పరపరా నమిలేశాడు. విచిత్రమేంటంటే ఇంత జరిగినా.. వంశీ మాత్రం తన నిద్రలో నుంచి బయటకు రాలేదు. ఓవైపు రక్తం మడుగులో పాము కొన ఊపిరితో కొట్టుకుంటుంటే.. అతను మాత్రం హాయిగా నిద్రపోయాడు. కాసేపటికి వంశీ రూమ్ లోకి వచ్చిన అతని తల్లి.. వంశీ నోటికంటుకున్న రక్తం చూసి షాక్ తిన్నది.
ఏంటా అని కిందకు చూస్తే.. ఫ్లోర్ మీద తల లేని పాము కొన ఊపిరితో కొట్టుకుంటుంది. విషయం అర్థమై.. వెంటనే అతన్ని ఓ పీర్ బాబా దగ్గరకు తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. అక్కడ పీర్ బాబా ఇచ్చిన ఓ పౌడర్ ను తీసుకోవడం వల్ల వాంతులు చేసుకున్న వంశీ.. పాము తలను బయటకు కక్కేశాడు.
అనంతరం సదరు బాబా సలహా మేరకు వంశీని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. విషయం తెలుసుకున్న డాక్టర్లు ఆశ్చర్యానికి లోనయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్న వంశీ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.












Click it and Unblock the Notifications