భార్యతో అక్రమ సంబంధం, మరదలి ట్రాప్: వ్యక్తి హత్య
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో వైవాహికేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాలను బలి తీసుకుంది. సేలం జిల్లాలో తన భార్యతో అక్రమ సంబంధం పట్టుకోవడమే కాకుండా, తన భార్య చెల్లెలిని కూడా ట్రాప్ చేసి వివాహం చేసుకున్న ఓ వ్యక్తిని మరో వ్యక్తి దారుణంగా హత్య చేశాడు.
ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి - సేలం జిల్లా తీవట్టిపట్టి సమీపంలోని కోణంపట్టి అనే గ్రామానికి చెందిన మారిముత్తు (28) లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు భార్య సరస్వతి (25), గౌతమ్ (8), నిషా (5) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, మారిముత్తు ఇంటి పక్కనే నివసిస్తున్న శ్రీనివాసన్ (30) కూడా లారీ డ్రైవర్‌గానే పని చేస్తున్నాడు.
దీంతో మారిముత్తు ఇంటికి వస్తూపోతూ సరస్వతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మారిముత్తు తన భార్యతో పాటు శ్రీనివాసన్‌ను మందలించాడు. ఈ పరిస్థితుల్లో సరస్వతి చెల్లెలు చెల్లకణ్ణితో పరిచయం ఏర్పరచుకుని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మారిముత్తు మరింత ఆగ్రహంతో రగిలిపోయారు.

అయితే, మారిముత్తు భార్య సరస్వతి, ఈమె తల్లి మాగేష్‌లు కలిసి చెల్లికణ్ణిని శ్రీనివాసన్‌కు ఇచ్చి రెండు నెలల క్రితం వివాహం చేశారు. పెళ్లి అయిన తర్వాత కూడా శ్రీనివాసన్, సరస్వతిల మధ్య అక్రమ సంబంధం కొనసాగుతూ వచ్చినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో కోణంపట్టి గ్రామంలో మారియమ్మన్ ఆలయ వేడుకలు గత వారం రోజులుగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు కొత్త దంపతులతో పాటు సరస్వతి, మారిముత్తు, వీరిద్దరి పిల్లలను అత్త మాగేష్ ఇంటికి ఆహ్వానించింది. అయితే, మారిముత్తు మాత్రం అత్తగారి ఇంటికి వెళ్లలేదు.
ఈ పరిస్థితుల్లో బుధవారం రాత్రి 11 గంటల సమయంలో అత్త ఇంటికి వచ్చిన మారిముత్తు పెద్ద కత్తితో శ్రీనివాసన్‌పై దాడి చేయడంతో అతను ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. మారిముత్తు గురువారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications