బిడ్డలను చంపి శవాల పక్కన నిద్రపోయాడు
చెన్నై: మద్యం మత్తులో ఉన్న ఓ కిరాతకుడు ముగ్గురు కుమార్తెలకు విషం తాగించి హత్య చేశాడు. మత్తు దిగిన తరువాత తాను బిడ్డలను చంపానని గుర్తుకు రావడంతో కిరోసిన్ పోసుకుని నిప్పంటించున్నాడు.
తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలోని తరువై అమ్మనకోయిల్ లో రాజశేఖరన్ (29), మేఘల (26) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ముత్తులక్ష్మి అలియాస్ సిబి(8), కావ్య(6), ఆరతి(3) అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
రాజశేఖరన్ భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు. ప్రతి రోజు కూలి డబ్బుతో పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెళ్లి భార్య మేఘలతో గొడవపడేవాడు. బుధవారం రాత్రి అదేవిధంగా పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెళ్లాడు.

తరువాత భార్య మేఘలతో గొడవ పెట్టుకున్నాడు. చివరికి భార్య గొంతునులిమి హత్య చెయ్యడానికి ప్రయత్నించాడు. మేఘల తప్పించుకుని సమీపంలోని పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య మీద కోపంతో నిద్రపోతున్న ముగ్గురు పిల్లలను నిద్రలేపాడు.
కూల్ డ్రింక్ లో విషం కలిపి బలవంతంగా తన ముగ్గురు పిల్లలకు తాగించాడు. విషం తాగిన పిల్లలు ఒకరి తరువాత ఒకరు మరణించారు. మద్యం మత్తులో ఉన్న రాజశేఖరన్ పిల్లల శవాల మధ్యలో నిద్రపోయాడు.
గురువారం మత్తు దిగడంతో రాజశేఖరన్ నిద్రలేచాడు. తరువాత ముగ్గురు పిల్లలను నిద్రలేవాలని చెప్పాడు. చివరికి పిల్లలు మరణించారని, రాత్రి తానే విషం ఇచ్చానని తెలుసుకుని బ్లేడ్ తీసుకుని చేతులు కోసుకున్నాడు.
చివరికి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలు తట్టుకోలేక కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి అతనిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. పుట్టింటి నుంచి ఇంటికి వచ్చిన మేఘల ముగ్గురు పిల్లలు చనిపోయారని తెలుసుకుని ఆర్తనాదాలు చేసింది.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురు అమ్మాయిల మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. రాజశేఖరన్ పూర్తిగా కాలిపోయి మృత్యువుతో పోరాడుతున్నాడని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications