రెండు దశల్లో మణిపూర్ ఎన్నికలు- బీజేపీ అధికారం కొనసాగేనా : ధీటుగా కాంగ్రెస్..!!
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ ఇప్పుడు రెండు జాతీయ పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఎన్నికల సంఘం మణిపూర్ లో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. 60 సీట్లు ఉన్న మణిపూర్ అసెంబ్లీకి మార్చి 19 తో గడువు ముగియనుంది. ఆ లోగా కొత్త ప్రభుత్వం కొలువు తీరాల్సి ఉంది. మణిపూర్ లో రెండు దశల్లో ఫిబ్రవరి 27, మార్చి 3వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న కౌంటింగ్ జరగనుంది. 2017 ఎన్నికల్లో ఫలితాల తరువాత చోటు చేసుకున్న పరిణాలతో తొలి సారిగా ఇక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది.
కాంగ్రెస్ ఆ ఎన్నికల్లో 28 సీట్లు గెలుచుకుంది. ఆ తరువాత ఎనిమిది మంది పార్టీ ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు. బీజేపీ 21 సీట్లలో గెలుపొందింది. దీంతో..నేషనల్ పీపుల్స్ పార్టీ, నాగా పీపుల్స్ ఫ్రంట్, లోక్ జనశక్తి పార్టీ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎన్ బీరేన్ సింగ్ ముఖ్యమంత్రి అయ్యారు. బీజేపీ నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో ఎన్పీపీ కీలక పార్టీగా మారింది. ఇద్దరు మంత్రులు, ఇక డిప్యూటీ సీఎం ఆ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, ఈ సారి ఎన్నికల్లో ఎన్ పీపీ ఇప్పటికే 30 మంది అభ్యర్ధులను ఖరారు చేసింది.

దీని ద్వారా సొంతంగా బరిలో దిగే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. 2017 ఎన్నికల్లో ఈ పార్టీ 9 సీట్ల నుంచే పోటీ చేసింది. ఇక, ఇదే సమయంలో మణిపూర్ కాంగ్రెస్ సైతం గతంలో చోటు చేసుకున్న అనుభవాలతో ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్ నాయకత్వంలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేసారు. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటంతో రెండు ప్రధాన జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీల మద్దతుతో అధికారం దక్కించుకొనే ప్రయత్నాలు చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications