కన్నడం మాట్లాడలేదని మణిపూర్ విద్యార్థిపై దాడి

తాజా దాడిలో మణిపురి గిరిజన తెగ విద్యార్థి సంఘం అధ్యక్షుడు టి. మైఖేల్ లామ్జాతంగ్ వోకివ్ తల, వీపులపై గాయాలయ్యాయి. అయితే మైఖేల్ ఆరోగ్య పరిస్థితిపై అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు అంటున్నారు. ఈ ఘటనలో మైఖేల్‌తో పాటు ఉన్న మరో ఇద్దరు కూడా స్వల్పంగా గాయపడ్డారు.
కన్నడ భాషలో మాట్లాడాలని బలవంతం చేశారని, రాష్ట్రేతరులుగా కర్ణాటకలో పండించిన ఆహారాన్ని తినడం నేర్చుకున్న మీరు కన్నడ భాషలో మాట్లాడాలని, ఇది చైనా కాదని, భారతదేశం అంటూ తమపై దాడి చేశారని బాధితులు ఫిర్యాదులో చెప్పారు.
మైఖేల్ మంగళవారం రాత్రి మిత్రులతో కలిసి డిన్నర్‌కు రెస్టారెంట్‌కు వెళ్లిన సమయంలో దాడి జరిగింది. ఆహారం కోసం ఎదురు చూస్తూ మైఖైల్ బృందం ఇంగ్లీషులో మాట్లాడుకుంటోంది. పక్క బల్లపై కూర్చున్నవారు వారి ఇంగ్లీష్ సంభాషణకు అభ్యంతరం చెప్పారు.
జాతి వివక్షతోనే తమపై దాడి చేశారని మైఖేల్ అన్నాడు. స్థానిక యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారిపై కేసులు నమోదు చేశారు. ముగ్గురిని అరెస్టు చేసినట్లు, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు పోలీసు కమిషనర్ (శాంతిభద్రతలు) ఆలోక్ కుమార్ ఓ వార్తాసంస్థతో చెప్పారు. కర్ణాటకలో 2012లో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 2 లక్షల 40 వేల మంది ప్రజలు ఉన్నట్లు అంచనా.












Click it and Unblock the Notifications