మనీష్ సిసోడియాకు దక్కని ఊరట-మరో రెండ్రోజులు కస్టడీ-బెయిల్ పై 10న విచారణ
ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ అరెస్టు చేసిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఇవాళ ఊరట దక్కలేదు. తనకు బెయిల్ ఇవ్వాలని ఆయన పెట్టుకున్న విజ్ఢప్తిని రౌస్ అవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. అలాగే ఆయన సీబీఐ కస్టడీని కూడా రెండు రోజులు పొడిగించింది.
లిక్కర్ స్కాంలో అవినీతి ఆరోపణలపై అరెస్టైన మనీష్ సిసోడియాను తొలుత ఢిల్లీ కోర్టు మూడు రోజుల కస్టడీకి ఇచ్చింది. అది పూర్తి కావడంతో తిరిగి ఆయన్ను కోర్టులో హాజరుపరిచారు. బెయిల్ కోసం మనీష్ సిసోడియా పెట్టుకున్న అభ్యర్ధన నేపథ్యంలో ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరిపింది. అయితే సీబీఐ ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని కోరింది. ఇప్పటివరకూ ఆయన విచారణలో తమకు సహకరించలేదని, దీంతో మరో మూడు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరింది.

సీబీఐ అభ్యర్ధనపై విచారణ జరిపిన రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి మనీష్ సిసోడియాను రెండు రోజుల పాటు సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు ఇచ్చారు. అంటే మార్చి 6 వరకూ ఆయన సీబీఐ కస్టడీలో ఉంటారు. అలాగే మార్చి 10న మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై విచారణ జరుపుతామని వెల్లడించారు.
అంటే మరో వారం రోజుల పాటు మనీష్ సిసోడియా జైల్లో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణలో భాగంగా సీబీఐ అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు సిసోడియా సమాధానాలు ఇవ్వడం లేదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications