• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంజులా ప్రదీప్: దళిత మహిళల హక్కుల కై పోరాడుతున్న ఉద్యమకారిణి

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

"నా దగ్గర తుపాకీ ఉందిగానీ పేల్చడానికి గుళ్లు లేవని ఆమెను కలిశాకే అర్థమైంది"

దళిత మహిళా యాక్టివిస్ట్ భావనా నర్కర్ తన గురువు, మెంటర్ మంజులా ప్రదీప్ గురించి చెప్పిన మాటలివి.

అత్యాచార బాధితులకు ముఖ్యంగా దళిత మహిళలకు న్యాయం చేకూర్చే దిశలో సహాయపడేలా ఎంతోమందికి శిక్షణ ఇస్తుంటారు 52 ఏళ్ల మంజుల. అలా ఆమె దగ్గర శిక్షణ పొందుతున్నవారిలో 28 ఏళ్ల భావన కూడా ఒకరు.

చారిత్రకంగా దళితులు సమాజంలో వివక్షను అనుభవిస్తూనే ఉన్నారు. చట్టపరంగా వీరికి రక్షణ కల్పించినప్పటికీ, సంఘంలో పక్షపాతం, హింస ఎదుర్కొంటూనే ఉన్నారు.

ముఖ్యంగా, భారతదేశ మహిళా జనాభాలో 16 శాతం ఉన్న దళిత మహిళలు అదనంగా లైంగిక హింసను కూడా ఎదుర్కొంటూ ఉంటారు.

దళితులను శిక్షించాలన్నా, అవమానించాలన్నా అత్యాచారం అనేది అగ్రవర్ణాల చేతిలో అయుధంగా తయారైంది.

గత ముప్పై యేళ్లుగా దళిత మహిళల హక్కుల కోసం పోరాడుతున్న మంజుల ఈ ఏడాది 'నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వుమెన్ లీడర్స్' సంస్థను కొందరు వ్యక్తలతో కలిసి స్థాపించారు.

"దళిత సమాజం నుంచే మహిళా నాయకులు రావాలి. అలాంటి వారిని తయారుచేయాలన్నదే నా చిరకాల స్వపం. కోవిడ్ మహమ్మారి సమయంలో లైంగిక హింస కేసులను పరిశీలిస్తున్నప్పుడే, దీని కోసం ప్రత్యేకంగా ఓ సంస్థను స్థాపించాల్సిన అవసరం ఉందని గ్రహించాను’’ అన్నారు మంజుల.

''లైంగిక హింసకు గురైన మహిళలు గౌరవంగా, హుందాగా జీవనం కొనసాగించడానికి సహాయపడే నాయకులు అవసరం. మా సంస్థ ద్వారా వారిని తయారుచేయాలన్నదే మా సంకల్పం" అన్నారామె.

భావనా నర్కర్ గుజరాత్‌లోని ఓ చిన్న పట్టణంలో నివసిస్తారు. అక్కడి పేద దళిత మహిళలకు చదువు, ఉద్యోగ అవకాశాలు సుదూర స్వప్నాలు. భారతదేశంలో దాదాపు దళిత మహిళందరి పరిస్థితీ ఇదే.

"లైంగిక హింసకు గురైనప్పుడు స్త్రీలు తీవ్ర ఆవేదనకు లోనవుతారు. కోపం, బాధ..తమకు న్యాయం జరగాలని కోరుకుంటారు. కానీ, జరిగిన అన్యాయానికి గొంతెత్తి చెప్పేందుకు జంకుతారు. సొంత కుటుంబానికి కూడా చెప్పుకోలేరు. ఎందుకంటే, మన హక్కులేంటో మనకు తెలీవు. చట్టాల్లో ఏముందో తెలీదు" అని నర్కర్ అంటారు.

2020 జనవరిలో మంజులా ప్రదీప్ ఒక దళిత మహిళల సమావేశంలో ప్రసంగిస్తున్నప్పుడు భావన విన్నారు. దాంతో, తన జీవితం పూర్తిగా మారిపోయిందని, న్యాయం అందుబాటులో ఉంటుందన్న నమ్మకం కలిగిందని ఆమె చెప్పారు.

సమాజంలో దళితులు నిత్యం వివక్షకు గురవుతున్నారు.

బాధితులకు చట్టాలపై అవగాహన

మంజులకు గట్టి సంకల్పం, తీవ్ర ఆంకాంక్ష, వ్యవస్థాపరమైన అడ్డంకులను అధిగమించేందుకు పటిష్టమైన పరిష్కార మార్గాలు ఉన్నాయి.

గ్రామీణ మహిళలకు ప్రాథమిక స్థాయిలో చట్టాల గురించి అవగాహన కల్పించడం, న్యాయ పరిజ్ఞానాన్ని అందించడం అవసరమని ఆమె అంటారు.

"వారిని నేను ప్రాథమిక స్థాయి లాయర్లు (బేర్‌ఫుట్ లాయర్లు) అంటాను. అత్యాచార బాధితులకు న్యాయం జరిగేలా చూసేందుకు, సమాజం వేసే నిందలతో పోరాడే ధైర్యాన్ని నింపడంలో వారి సహాయం కీలకం.

నేర ప్రవృత్తికి సంబంధించిన న్యాయ వ్యవస్థ మొత్తం దళిత మహిళలకు వ్యతిరేకంగా పక్షపాతం వహిస్తోంది. కోర్టుల్లో బాధితులను అవమానాలపాలు చేసేలా ప్రశ్నిస్తుంటారు. ఉదాహరణకు, 'ఉన్నత వర్గాల పురుషులు ఆమెనే ఎందుకు రేప్ చేస్తారు? ఆమె అంటరాని మహిళ కదా. ఆమే స్వయంగా వారిని ఆహ్వానించి ఉంటుంది'.. ఇలాంటి మాటలు మాట్లాడతారు" అని మంజుల వివరించారు.

తనకు అందిన శిక్షణతో, వ్యవస్థను ఎదుర్కోవడానికి, బెదిరింపులు, ఎదురుదెబ్బలను తట్టుకుని నిలబడడానికి తగిన సామర్థ్యం చేకూరిందని, ఇది తనకు ఎంతో బలాన్ని చేకూర్చిందని, సాధికారత దక్కినట్టు అనిపిస్తోందని భావన అన్నారు.

ప్రస్తుతం ఆమె ఒక స్థానిక దళిత హక్కుల సంస్థలో చేరారు. ఆ ప్రాంతంలో లైంగిక హింస బాధితులకు సహాయం చేసేందుకు ముందుంటారు.

2014, 2019 మధ్య దళిత మహిళలపై అత్యాచార కేసులు 50% పెరిగినట్లు ప్రభుత్వ డేటా చెబుతోంది.

అయితే, దళిత మహిళలపై జరిగే అత్యాచారాలు చాలావరకు వెలుగులోకి రావని అధ్యయనాలు చెబుతున్నాయి.

కుటుంబం నుంచి మద్దతు లేకపోవడం, అగ్రవర్ణాలకు చెందిన పురుషులపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు విముఖత చూపడం ప్రధాన కారణాలు.

అందుకే మంజుల ఆ దిశలో శిక్షణ ఇస్తుంటారు. అత్యాచార బాధితులకు ధైర్యాన్ని అందించడం, వివరంగా పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిన అవసరాన్ని గుర్తించేలా చేయడం ఆమె ఇచ్చే శిక్షణలో భాగాలు.

చిన్నతంలో తాను కూడా లైంగిక వేధింపులకు గురయ్యానని, ఎంతో ఒంటరితనం అనుభవించానని.. ఆ బాధలోంచే ఈ ఆలోచన పుట్టుకొచ్చిందని మంజుల చెప్పారు.

మంజులకు నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడు, ఇరుగుపొరుగులో నలుగురు వ్యక్తులు ఆమెపై లైంగిక హింసకు పాల్పడ్డారు.

గత ఏడాది దళిత యువతి అత్యాచారం, హత్య సంచలనం సృష్టించింది.

ఆమె కూడా ఒక బాధితురాలు

"ఆ రోజు నేను పసుపు రంగు ఫ్రాక్ ధరించినట్లు నాకు గుర్తుంది'' అని ఆమె అన్నారు.

''వారి ముఖాలు, వారు ఏం చేశారో నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ అత్యాచారం నన్ను మార్చింది, అవమాన పీడితురాలిగా, భయస్తురాలిగా మార్చింది. కొత్త వారిని చూస్తే భయపడేదాన్ని. ఎవరైనా ఇంటికి వస్తే కనిపించకుండా దాక్కునేదాన్ని" అని చెప్పారామె.

ఆమె తనపై జరిగిన దాడిని రహస్యంగా ఉంచారు. తల్లిదండ్రులతో చెప్పడం ప్రమాదకరమని ఆమె భావించారు.

ఆమె తల్లికి 14 ఏళ్ల వయసులోనే 17 ఏళ్ల వ్యక్తితో పెళ్లి చేశారు. తండ్రి కూడా సంతోషంగా లేరు. ఆయనకు ఒక కొడుకు కావాలి.

"మా నాన్న అమ్మను నిత్యం ఈసడించుకునేవారు. నన్ను తిడుతుండేవారు. ఆయన నన్ను ఎవరికీ పనికిరాని దానిగా, ఎవరి ప్రేమను పొందకూడని వ్యక్తిగా భావించేవారు" అని ఆమె వెల్లడించారు.

ఆమె తండ్రి ఇప్పుడు జీవించి లేరు. ఆయన ఉత్తర్‌ప్రదేశ్‌లో పుట్టారు. కానీ ఉపాధి కోసం గుజరాత్‌కు వెళ్లారు.

అక్కడ తన పేరు చివర కులం పేరును వదులుకోవడం ద్వారా తన దళిత గుర్తింపును దాచారు. తన భార్యా, కూతుళ్ల పేర్లకు చివరలో తన పేరు ప్రదీప్‌ అని తగిలించారు.

అయితే, తన కులం ఏదన్న రహస్యం ఎక్కువ కాలం దాగలేదని మంజుల వెల్లడించారు. వదోదర వంటి పెద్ద నగరాలలో కూడా వివిధ రూపాలలో తనపై వివక్ష కొనసాగిందని ఆమె గుర్తు చేసుకున్నారు.

"నాకు తొమ్మిదేళ్ల వయసులో, మా టీచర్ విద్యార్థులను వారి పరిశుభ్రత ఆధారంగా ర్యాంక్ ఇచ్చారు. క్లాసులో శుభ్రంగా ఉండే పిల్లలలో ఒకదాన్నైనా, దళితులు శుభ్రంగా ఉండరన్న కారణంగా నాకు ఆఖరి ర్యాంక్ ఇచ్చారు. నేను తీవ్ర అవమానానికి గురయ్యాను" అని చెప్పారామె.

సమాజాన్ని చూసిన తర్వాత...

స్కూల్ చదువుల తర్వాత ఆమె సోషల్ వర్క్, న్యాయశాస్త్రాలు చదువుకోవాలనుకున్నారు. గ్రామీణ ప్రాంతాలను సందర్శించడం వల్ల దళితుల తరఫున పోరాడాలన్న స్పృహ ఆమెలో కలిగింది.

1992లో ఆమె సహోద్యోగి ఒకరు అగ్రవర్ణానికి చెందిన చేతిలో హత్యకు గురైనప్పుడు ఆమె దళిత హక్కుల కోసం పోరాడే 'నవసర్జన్’ అనే స్వచ్ఛంద సంస్థలో చేరారు. ఆ సంస్థలో చేరిన తొలి మహిళ ఆమె. ఒక దశాబ్దం తరువాత ఆమె ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఎన్నికలలో విజయం సాధించారు.

"ఒక దళిత మహిళ ఆ స్థాయికి ఎదగడం చాలా అరుదు. సంస్థను నడిపించడానికి నేను నలుగురు పురుషులను ఓడించి ఎన్నికల్లో గెలిచాను" అని ఆమె గర్వంగా చెప్పారు.

ఆమె ఇప్పుడు దేశంలో అత్యంత కీలకమైన సమస్యగా మారిన అత్యాచార బాధితులపై దృష్టి పెట్టారు. 50 మందికి పైగా దళిత అత్యాచార బాధితులు చేసిన న్యాయ పోరాటంలో వారికి ఆమె సహాయపడ్డారు. ఈ కేసుల్లో అనేకమందికి శిక్షలు పడ్డాయి.

అవసరమైన సమాచారం, శిక్షణ ఇస్తే దళిత మహిళలు సమాజంలో గౌరవనీయమైన వ్యక్తులుగా నాయకులుగా మారతారని తన కృషి ద్వారా ఆమెకు అర్ధమైంది.

" వారికి ఇంకో మంజుల అవసరం రాకూడదు'' అన్నారామె.

" నా నీడన కాకుండా, ఈ మహిళలు సొంత గుర్తింపును పెంచుకోవాలని, అభివృద్ధి పథంలో నడవాలని కోరుకుంటున్నాను" అన్నారామె.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
Manjula Pradeep: An activist for the rights of Dalit women
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X