ఢిల్లీ సీబీఐ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం... బయటకు పరుగులు తీసిన అధికారులు...
ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ భవనాల సముదాయం(సీజీవో)లో ఉన్న సీబీఐ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గురువారం(జులై 8) ఉదయం 11.36గం. సమయంలో సీబీఐ కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. అధికారులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా హుటాహుటిన ఆరు ఫైరింజన్లు అక్కడికి చేరుకున్నాయి. కొద్దిసేపటికి మంటలు అదుపులోకి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు.
ఘటనపై అగ్నిమాపక సిబ్బంది మాట్లాడుతూ... 'ఏసీ ప్లాంట్ రూమ్‌లో మంటలు చెలరేగినట్లు మాకు సమాచారం అందింది. వెంటనే ఆరు ఫైరింజన్లతో అక్కడికి చేరుకుని 20-30నిమిషాల్లో మంటలను అదుపు చేశాం. ఆ గదిలో ఎలక్ట్రిక్ కేబుల్ నుంచి లేదా ట్రాన్స్‌ఫార్మర్ ద్వారా మంటలు చెలరేగి గది మొత్తం వ్యాపించి ఉండవచ్చు.' అని చెప్పుకొచ్చారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే అధికారులు,సిబ్బంది కార్యాలయం నుంచి బయటకు పరుగులు తీశారు.

కొంతకాలంగా ఢిల్లీలో వరుస అగ్నిప్రమాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఐదు రోజుల క్రితం వాయువ్య ఢిల్లీలోని బుద్ధ విహార్ ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో అగ్నిమాపక సిబ్బంది సహా నలుగురు గాయపడ్డారు. గత నెలలో ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆపరేషన్ థియేటర్ పక్కనే ఉన్న ఎమర్జెన్సీ వార్డులో మంటలు చెలరేగాయి. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
గత నెలలో ఢిల్లీలోని లజ్‌పత్ నగర్ మార్కెట్‌లోనూ భారీ అగ్నిప్రమాదం జరిగింది. బట్టల దుకాణంలో చెలరేగిన మంటలు క్షణాల్లో పక్క దుకాణాలకు వ్యాపించాయి. దాదాపు 30 ఫైరింజన్ల సాయంతో కొన్ని గంటల పాటు శ్రమిస్తే మంటలు అదుపులోకి వచ్చాయి.












Click it and Unblock the Notifications