మే 4న మీ లెక్కలన్నీ తేలుస్తాం! బెంగాల్‌లో కమల వికాశమే: మోదీ
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సాగుతుండగానే ప్రధాని నరేంద్ర మోదీ మథురాపూర్ వేదికగా టీఎంసీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. బెంగాల్‌లో సాగుతున్న అటవీ పాలనకు, అరాచక సిండికేట్‌కు ముగింపు తేదీ ఖరారైందని, మే 4వ తేదీతో మమత సర్కార్ శకం ముగియబోతోందని ధీమా వ్యక్తం చేశారు. మార్పు సునామీ బెంగాల్ గడ్డను తాకిందని, మొదటి దశ పోలింగ్‌లో మహిళలు, యువత చూపిస్తున్న ఉత్సాహమే దీనికి నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు.
టీఎంసీ పాలనలో జరిగిన అన్యాయాలు, దోపిడీలపై ప్రధాని ఘాటుగా స్పందించారు. "గడిచిన 15 ఏళ్లలో టీఎంసీ సిండికేట్ చేసిన ప్రతి తప్పుకు మే 4 తర్వాత జవాబుదారీతనం ఉంటుంది. అరాచకాలు చేసిన ప్రతి గూండాకు శిక్ష తప్పదు. బెంగాల్‌లో లంచం లేనిదే ఏ పనీ జరగని పరిస్థితిని మేం మారుస్తాం" అని హెచ్చరించారు. సరిగ్గా పది రోజుల్లో ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక, బెంగాల్ అంతటా కమలం వికసించడం ఖాయమని మోదీ జోస్యం చెప్పారు.

సందేశ్‌ఖాలీని బెంగాల్ తల్లులు మర్చిపోలేరు!
టీఎంసీ ప్రభుత్వం మహిళా వ్యతిరేక ధోరణిని అవలంబిస్తోందని మోదీ ఆరోపించారు. ఆర్.జి. కార్ ఆస్పత్రి ఘటన, సందేశ్‌ఖాలీ దురాగతాలను ప్రస్తావిస్తూ.. మహిళలపై అత్యాచారాలు చేసిన గూండాలకు టీఎంసీ రక్షణ కల్పిస్తోందని విమర్శించారు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును టీఎంసీ వ్యతిరేకించిన విషయాన్ని గుర్తు చేస్తూ, బెంగాల్ ఆడబిడ్డల హక్కులను కాలరాస్తున్న పార్టీకి ఓటుతోనే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
మత్స్యకారులకు అండగా.. బ్లూ ఎకానమీ లక్ష్యంగా!
బెంగాల్ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేందుకు 'బ్లూ ఎకానమీ'ని ప్రోత్సహిస్తామని మోదీ హామీ ఇచ్చారు. "ఇక్కడి మత్స్యకారులు కేవలం స్థానిక మార్కెట్లకే పరిమితం కాకూడదు. వారి ఉత్పత్తులను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేలా బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుంది. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా వారికి ఆర్థిక వెన్నుదన్నుగా నిలుస్తాం. బెంగాల్‌ను దేశంలోనే అతిపెద్ద చేపల ఎగుమతి కేంద్రంగా మారుస్తాం" అని ప్రకటించారు. మథురాపూర్‌లోని భంగా మేళా కళాకారులకు డిజిటల్ నైపుణ్యాలు అందించి, దాన్ని ఒక అంతర్జాతీయ మార్కెట్‌గా తీర్చిదిద్దుతామన్నారు.
రికార్డు స్థాయిలో పోలింగ్.. భయం వీడిన వేళ!
మొదటి విడత పోలింగ్‌లో మధ్యాహ్నం 3:30 గంటలకే 77 శాతానికి పైగా ఓటింగ్ నమోదు కావడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. భారీ పోలింగ్ శాతం అంటే ప్రజల్లో భయం పోయిందని, మార్పుపై విశ్వాసం పెరిగిందని మోదీ విశ్లేషించారు. అసంవేదనారహిత ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించి వేయాలని, ముఖ్యంగా మొదటిసారి ఓటు వేసే యువత బీజేపీకి అండగా నిలవాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications