ఆ అదృష్టం రెండోసారి వరిస్తుందా?
న్యూఢిల్లీ: దేశ రాజధాని ప్రథమ పౌరుడి ఎన్నికలో చోటు చేసుకున్న హైడ్రామాకు బ్రేకులు పడట్లేదు. అది ఇంకా కొనసాగుతూనే ఉంది. మేయర్ ఎన్నికలో నెలకొన్న ప్రతిష్ఠంభన నేపథ్యంలో- ఇవ్వాళ మరోసారి కౌన్సిల్ సమావేశం కానుంది. దీన్ని అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గతంలో పలుమార్లు ఢిల్లీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలో కౌన్సిలర్లు పరస్పరం ఘర్షణకు దిగిన సందర్భాలు ఉన్న నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
గత ఏడాది నవంబర్‌లో జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ తిరుగులేని విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో 15 సంవత్సరాల తరువాత బీజేపీ పరిపాలనకు ఆమ్ ఆద్మీ పార్టీ తెరదించింది. మొత్తం 250 వార్డులు ఉన్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 134 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు జెండా ఎగురవేశారు.

బీజేపీ 104 డివిజన్లకే పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ తొమ్మిది స్థానాలతో సరిపెట్టుకుంది. మేయర్, డిప్యూటీ మేయర్‌లను ఎన్నుకోవాల్సి ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు షెల్లీ ఒబెరాయ్‌ను తమ మేయర్ అభ్యర్థిగా ప్రకటించింది. బీజేపీ నుంచి శిఖా రాయ్ రేసులో నిలిచారు. గ్రేటర్ కైలాష్ డివిజన్ నుంచి ఆమె ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్ రేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఆలె మహ్మద్ ఇక్బాల్, బీజేపీకి చెందిన సోనీ పాండే పోటీ పడుతున్నారు.
ప్రస్తుతం వారిద్దరే ఢిల్లీ మేయర్, డిప్యూటీ మేయర్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 22వ తేదీన ఢిల్లీ మేయర్‌గా షెల్లీ ఓబెరాయ్, డిప్యూటీ మేయర్‌గా ఆలె మహ్మద్ గెలుపొందారు. తమ పదవుల్లో కొనసాగుతున్నారు. ప్రతి ఆర్థిక సంవత్సరం ఆరంభంలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కోసం కొత్తగా మేయర్, డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఎంసీడీ యాక్ట్ ప్రకారం.. ఇది ఆనవాయితీగా వస్తోంది.
ఇప్పుడు కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా మేయర్, డిప్యూటీ మేయర్‌ను కౌన్సిలర్లు ఎన్నుకోనున్నారు. ఇప్పుడు గెలిచిన వాళ్లు వచ్చే ఆర్థిక సంవత్సరం వరకూ తమ పదవుల్లో కొనసాగుతారు. అప్పుడు మళ్లీ వాళ్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఈ ఎన్నిక జరుగుతుంది. ఈ ఎన్నికను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా 250 మంది కౌన్సిలర్లు, 14 ఎమ్మెల్యేలు, 10 మంది ఎంపీలతో ఎలక్టోరల్ కాలేజ్ ఏర్పాటైంది.












Click it and Unblock the Notifications