కైలాష్ మానస సరోవర్ యాత్రకు చైనా పర్మిట్స్ అవసరం: కేంద్రం తాజా గైడ్ లైన్స్
కైలాస మానస సరోవర యాత్రకు సిద్ధమవుతున్నవారికి కేంద్ర ప్రభుత్వం తాజా సూచనలు జారీ చేసింది. విదేశాల్లో చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందుల పాలు కాకుండా ఉండేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ట్రావెల్ అడ్వైజరీ ఇచ్చింది. కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రైవేట్ టూర్ ఆపరేటర్ల ద్వారా వెళ్లే యాత్రీకులు చైనాతో పాటు ప్రయాణ మార్గంలో అవసరమైన అన్ని రకాల వీసాలు, అధికారిక ఎంట్రీ అనుమతి పత్రాలు పొందాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఆ తర్వాతే బయలుదేరి వెళ్లాలని కేంద్రం తేల్చి చెప్పింది.
నేపాల్ రాజధాని ఖాట్మండులో చైనా ఎంట్రీ పర్మిట్లు, చెల్లుబాటయ్యే వీసాలు లేకపోవడం వల్ల సుమారు 52 మంది భారతీయ యాత్రికులు నిలిచిపోయిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అత్యవసరంగా ఈ నిర్ణయం తీసుకుంది. యాత్రకు సంబంధించిన అన్ని రకాల అధికారిక పత్రాలు పూర్తిగా చేతికి వచ్చే వరకు ప్రయాణాన్ని ప్రారంభించవద్దని, అలా అనుమతి పత్రాలు లేకుండా బయలుదేరితే చట్టపరమైన సమస్యలు ఎదురవుతాయని హెచ్చరించింది.

దీనిపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీలను ఆశ్రయించే యాత్రీకులు అత్యంత అప్రమత్తతతో వ్యవహరించాలని కోరింది. తాము ఎంచుకున్న ట్రావెల్ ఏజెంట్లు, టూర్ ఆపరేటర్లకు అధికారిక గుర్తింపు, రిజిస్ట్రేషన్ ఉందో లేదో ముందుగా సరిచూసుకోవాలని సూచించింది. తగిన ప్రయాణ ఏర్పాట్లు, భద్రత లేకపోవడం వల్ల విదేశాల్లో ఎదురయ్యే ఆర్థిక నష్టాలు, మానసిక ఇబ్బందుల నుంచి రక్షణ పొందడానికి డిజిగ్నేటెడ్ టూర్ ఆపరేటర్లను మాత్రమే వినియోగించుకోవాలని స్పష్టం చేసింది.
ఈ ఏడాది కైలాస మానస సరోవర యాత్రను చేపట్టిన భక్తుల మొదటి బ్యాచ్ ఈ నెల 20న భారత్-చైనా సరిహద్దులోని నాథూలా పాస్ మీదుగా చైనా సరిహద్దుల్లోకి ప్రవేశించింది. ప్రభుత్వ సహాయక కమిటీల ద్వారా యాత్రలు సాఫీగా సాగుతున్నప్పటికీ, ప్రైవేటు ఆపరేటర్ల నిర్లక్ష్యం వల్ల సాధారణ పౌరులు సరిహద్దుల వద్ద నిలిచిపోయి ఇబ్బందులు పడవలసి వస్తోందని విదేశాంగ శాఖ పేర్కొంది.
నేపాల్‌లో ఇరుక్కుపోయిన 52 మంది భారతీయ యాత్రికుల దుస్థితిపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్) ఎంపీ సుప్రియా సూలే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఖాట్మండులో చిక్కుకుపోయిన ఈ భక్తులకు మానవతా దృక్పథంతో తక్షణ రక్షణ, వసతి సౌకర్యాలు, అవసరమైన దౌత్య సహాయం అందించాలని ఆమె విదేశాంగ మంత్రి జైశంకర్‌కు విజ్ఞప్తి చేశారు. వారిని స్వదేశానికి తరలించేలా ఖాట్మండు, బీజింగ్ లోని భారత రాయబార కార్యాలయాలను ఆదేశించాలని అన్నారు.












Click it and Unblock the Notifications