అమ్మ కంటే మీడియాకే ఎక్కువ జబ్బు చేసింది!
చెన్నై : పరిస్థితి చూస్తోంటే.. మీడియాకు, ముఖ్యంగా జర్నలిజానికి ఉండాల్సిన విలువలు రాను రాను కుచించుకుపోతున్నట్టే కనిపిస్తోంది. తమిళనాడు సీఎం జయలలిత అనారోగ్యం వ్యవహారంలో తాజాగా మీడియా వ్యవహరిస్తోన్న తీరు ఇదే ఆలోచనను తలపునకు తెస్తోంది. జయలలిత అనారోగ్యం వార్తలను ప్రసారం/ప్రచురితం చేసే విషయంలో.. ప్రతిపక్ష అధినేత కరుణానిధి వాయిస్ నే మీడియా తన వాయిస్ చేసుకుందనేది ప్రస్తుతం మీడియాపై వస్తోన్న ప్రధాన ఆరోపణ.
నిజనిజాలను వాస్తవాలను అంచనా వేసుకోకుండా.. కేవలం కరుణానిధి 'అమ్మకేమైంది?' అని ప్రశ్నించగానే.. దావానంలా అమ్మ అనారోగ్యంపై గందరగోళం సృష్టించేలా వార్తల ప్రచారం జరిగింది. జయలలిత ఆరోగ్య విషయాలపై హెల్త్ బులెటిన్ విడుదల కాకపోవడమన్నది తమ పార్టీ రాజకీయాలకు అంత మంచిది కాదని అన్నాడీఎంకే భావించి ఉండవచ్చు. అంతమాత్రానా మీడియాకు దాన్ని చేధించడం పెద్ద కష్టం కూడా కాదేమో!

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. అని ట్యాగు లైన్లు పెట్టి రాసే మీడియా ఈ విషయంలో మాత్రం ఆ విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని ఎందుకు రాబట్టలేకపోయిందో తెలియదు. అందుకే అమ్మ ఆరోగ్యం విషయంలో నిజనిజాలను తెలుసుకోవడంలో మీడియా విఫలమైందనే వాదనలు వినిపిస్తున్నాయి. నిజానికి అమ్మ ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను రాబట్టడం మీడియాకు అంత కష్ట సాధ్యమైన పని కూడా కాకపోవచ్చు. వివరాలు వెల్లడించిన వారి గురించి గోప్యత పాటిస్తూనే.. నిజాన్ని చేరవేసే ప్రయత్నం చేసుండాల్సింది అనేది ఇప్పుడు అందరి నోటా వినిపిస్తోన్న మాట.
ఈ విషయంలో మీడియా విఫలమైంది కాబట్టే.. ఓ న్యాయవాది ఈ విషయంలో కలగజేసుకుని జయలలిత ఆరోగ్య వివరాలను వెల్లడించాలని కోర్టుకెక్కారనే వాళ్లు కూడా లేకపోలేదు. ఏదేమైనా ఇప్పుడా న్యాయవాది చలవ వల్లనే జయలలిత హెల్త్ బులెటిన్లు విడుదలవుతున్నాయన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ఈ వ్యవహారంలో అమ్మ కంటే మీడియాకే ఎక్కువ జబ్బు చేసిందన్న అపవాదు మాత్రం బలంగా వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications