దేశ వ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ !!!
దేశవ్యాప్తంగా ఈ-ఫార్మసీలు, ఇన్‌స్టంట్ మెడిసిన్ డెలివరీ యాప్‌ల కార్యకలాపాలపై వివాదం మరింత ముదురుతోంది. ఆన్‌లైన్ ద్వారా మందుల విక్రయం పెరుగుతున్న నేపథ్యంలో.. సంప్రదాయ మెడికల్ షాపుల యజమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అఖిల భారత కెమిస్టులు, డ్రగ్గిస్టుల సంఘం (AIOCD/AIACD) మే 20న దేశవ్యాప్త బంద్‌కు పిలుపునివ్వడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఈ-ఫార్మసీలు సరైన నియంత్రణ లేకుండా మందులను విక్రయిస్తున్నాయని, నకిలీ ప్రిస్క్రిప్షన్లు, తప్పుడు ఔషధాల సరఫరా, భారీ డిస్కౌంట్లతో అనైతిక పోటీని ప్రోత్సహిస్తున్నాయని కెమిస్టుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా జీఎస్‌ఆర్ 220(ఇ), 817(ఇ) వంటి ప్రభుత్వ నోటిఫికేషన్లలోని లోపాలను కొంతమంది ఆన్‌లైన్ ఫార్మసీలు తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నాయని పేర్కొంటున్నాయి.

ఏఐఏసీడీ జనరల్ సెక్రటరీ రాజీవ్ సింఘాల్ మాట్లాడుతూ.. "కొన్ని ఈ-ఫార్మసీలు నకిలీ మందులు, నకిలీ ప్రిస్క్రిప్షన్ల ఆధారంగా ఔషధాలను సరఫరా చేస్తున్నాయి. ఇది ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు," అని హెచ్చరించారు. 20 శాతం నుంచి 50 శాతం వరకు భారీ డిస్కౌంట్లు ఇవ్వడం వల్ల చిన్న మెడికల్ షాపులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానికంగా దశాబ్దాలుగా సేవలందిస్తున్న చిన్న మెడికల్ షాపులు ఇప్పుడు కార్పొరేట్ ఆధారిత ఈ-ఫార్మసీల పోటీని తట్టుకోలేక నష్టాల్లో కూరుకుపోతున్నాయని సంఘ ప్రతినిధులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు రాత్రింబవళ్లు సేవలందించే చిన్న కెమిస్టుల జీవనోపాధి ప్రమాదంలో పడిందని పేర్కొంటున్నారు.
ఈ-ఫార్మసీల వల్ల మరో ప్రధాన ప్రమాదం యాంటీబయాటిక్స్ నియంత్రణ లేకుండా విక్రయించబడటం. ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందులు కొనుగోలు చేసే పరిస్థితి పెరగడం వల్ల యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (AMR) వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకసారి బ్యాక్టీరియా మందులకు ప్రతిరోధకత పెంచుకుంటే భవిష్యత్తులో సాధారణ చికిత్సలు కూడా పనిచేయకపోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇటీవల ఏఐ ఆధారిత టెక్నాలజీలను ఉపయోగించి నకిలీ ప్రిస్క్రిప్షన్లు సృష్టిస్తున్నారనే ఆరోపణలు కూడా తీవ్ర చర్చకు దారితీశాయి. సరైన వైద్యుల సలహా లేకుండా మందులు విక్రయించడం ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తుందని కెమిస్టుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ కూడా దేశవ్యాప్త బంద్‌కు మద్దతు ప్రకటించింది.
అయితే ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండేందుకు కొన్ని ఫార్మసీలకు ఈ బంద్ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఆసుపత్రులకు అనుబంధంగా పనిచేసే మెడికల్ షాపులు, ప్రభుత్వ ఆసుపత్రి ఔషధ కేంద్రాలు, 24 గంటల ఫార్మసీలు, జన్ ఔషధి కేంద్రాలు, అత్యవసర మెడిసిన్ దుకాణాలు సాధారణంగా పనిచేస్తాయని సంఘం స్పష్టం చేసింది.
ఈ బంద్ ప్రభావం వల్ల మందుల సరఫరా వ్యవస్థ, స్థానిక మార్కెట్లు, రోగులు కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులు ముందుగానే అవసరమైన మందులు కొనుగోలు చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications