రాహుల్ వెనుక హీరోయిన్ రమ్య! కాంగ్రెస్ సోషల్ మీడియా అంతా ఆమె చేతుల్లోనే..
ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వెనుక కూడా ఒక స్త్రీ ఉంది. ఆమె ఆయన తల్లి సోనియా గాంధీ కాదు.. కన్నడ హీరోయిన్ రమ్య.
న్యూ ఢిల్లీ: ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది. ఇందుకు కొంతమంది మగవాళ్ల విజయగాథలే ఉదాహరణ. ఇప్పుడీ విషయం ఎందుకు చెప్పుకుంటున్నామంటే.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వెనుక కూడా ఒక స్త్రీ ఉంది. ఆమె.. ఆయన తల్లి సోనియా గాంధీ కాదు.. కన్నడ హీరోయిన్ రమ్య!
సోషల్ మీడియాలో ఆఫీస్ ఆఫ్ రాహుల్ గాంధీ, ఐఎన్సీ ఇండియాకు ఫోలోవర్స్ పెరగడం వెనక హీరోయిన్ రమ్య హస్తమే ఉందంటున్నారు. పైగా ఆమె రాహుల్ గాంధీ క్లోజ్ ఫ్రెండ్ కూడా. అందుకే రమ్యకు కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు అప్పగించారు రాహుల్.

కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్ లేడీ.. రమ్య
ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి ఆదరణ పెరిగిందంటే అందుకు ప్రధాన కారణం.. ప్రముఖ కన్నడ నటి, మాజీ ఎంపీ రమ్య. దక్షిణ భారతంలో హీరోయిన్ రమ్య అంటే తెలియని వారుండరంటే అందులో అతిశయోక్తి లేదు. కన్నడ, తెలుగు, మళయాలం, తమిళ సినిమాల్లో నటించారామె. 2012లో రమ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. తరువాత కర్ణాకటలోని మాండ్య నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ట్విట్టర్‌లో రమ్యకు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడం ఆమెకు బాగా కలిసొచ్చింది. ఈమె చేసే ట్వీట్లు అందరినీ ఆలోచింపజేస్తుంటాయి. కాంగ్రెస్ పార్టీలో చేరి ఫైర్ బ్రాండ్ లేడీగా పేరు తెచ్చుకున్నారు. రాహుల్ దృష్టిని ఆకర్షించారు. దీంతో రాహుల్ గాంధీ ఆమెను ఏరి కోరి కీలక పదవిలో నియమించారు.

సోషల్ మీడియా క్వీన్...
రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితురాలైన రమ్య.. ఇప్పుడు కాంగ్రెస్ డిజిటల్ కమ్యూనికేషన్స్‌కి అధినేత్రి. రాహుల్ ఆఫీస్ సహా.. సోషల్ మీడియా, ఐటీ బాధ్యతలన్నీ ఆమెకే అప్పగించారు. రమ్య అసలు పేరు.. దివ్య స్పందన. సినిమాల్లో నటించడం మొదలెట్టాక.. రమ్యగా పేరు మార్చుకున్నారు. సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌గా ఈమె రాకముందు.. కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ , ఫేస్ బుక్ పేజీలకు పెద్దగా ఆదరణ ఉండేది కాదు. ఈమె వచ్చిన తరువాత పార్టీ సోషల్ మీడియాను పరుగులెత్తించారు. గుజరాత్‌లో బీజేపీని టార్గెట్ చేయడానికి కాంగ్రెస్ ట్విట్టర్, ఫేస్‌బుక్ పేజీలు ఇప్పుడు భలే ఉపయోగపడుతున్నాయి.

మూడు నెలల్లోనే మొత్తం మార్చేశారు...
సమాచారమే ఏ పార్టీకైనా బలం అని నమ్ముతారు రమ్య. దీన్ని బాగా వంటపట్టించుకున్న ఆమె... మూడు నెలలుగా కాంగ్రెస్ డిజిటల్ మీడియా విభాగంలో నియామకాల జోరు పెంచారు. 2019 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకున్నారు. రమ్య సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు చేపట్టకముందు డిజిటల్ వార్ రూమ్‌లో కేవలం ముగ్గురే అమ్మాయిలు పనిచేసేవారు. రమ్య వచ్చాక ఆఫీస్ మొత్తం స్టాఫ్‌లో 85 శాతం మహిళా ఉద్యోగులే ఉన్నారు.

కాంగ్రెస్ కు బాగా పెరిగిన ఫాలోవర్స్...
రాహుల్ గాంధీ తనపై ఉంచిన నమ్మకాన్ని రమ్య వమ్ము చేయలేదు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ ఫాలోవర్స్ సంఖ్యను బాగా పెంచారు. 2009లో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌కు మాత్రమే ట్విట్టర్ అకౌంట్ ఉండేది. ఆయనకు ఆరు వేల మంది ఫాలోవర్స్ ఉండేవారు. ఇప్పుడు థరూర్‌కి 60 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇదే అత్యధికం. రాహుల్ గాంధీకి 41 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. సోషల్ మీడియా బేస్‌ను పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు రమ్య అండ్ టీమ్. వీడియో గ్రాఫర్లు, కంటెంట్ రైటర్స్, డాటా రీసెర్చ్ టీమ్ నిరంతర ప్రయోగాలు చేస్తోంది. అందుకే వీటిలో రాహుల్ గాంధీ ఉపన్యాసాలు, ఫోటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు ఆందోళన జరిపినా.. హైలెట్ చేస్తున్నారు. ఇటీవలె రమ్య చేపట్టిన ‘నో యువర్ లెగసీ' క్యాంపెయిన్‌కు సోషల్ మీడియాలో మంది స్పందన వచ్చింది.

కేసులు పెట్టినా ఖాతరు చేయలేదు...
రమ్య ఫోకస్ అంతా డేటాపైనే. ఆర్ఎస్ఎస్‌ను, బీజేపీని చీల్చి చెండాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి వచ్చే లైక్స్‌పై కూడా దృష్టిపెట్టారీమె. ఇందుకోసం విదేశాల నుంచి కూడా నిపుణులను రప్పించారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఏదోరకంగా ఇరకాటంలో పడేస్తుంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేసులు పెట్టినా రమ్య ఏమాత్రం ఖాతరుచేయలేదు. డేరింగ్ అండ్ డ్యాషింగ్ నాయకురాలుగా పేరు తెచ్చుకున్నారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చంది కాంగ్రెస్ పోరాటం వల్లే తప్ప.. బీజేపీ ఆర్ఎస్ఎస్ వల్ల కాదంటూ కుండబద్దలు కొడతారామె. అంతేకాదు, ఆర్ఎస్ఎస్, బీజేపీ ఆంగ్లేయులతో కుమ్మక్కయ్యాయని కూడా అంటారు. గతంలో పాకిస్తాన్‌లో పర్యటించిన రమ్య.. పాకిస్తాన్ నరకం కాదని, అక్కడను తనని బాగా చూసుకున్నారని కూడా వ్యాఖ్యానించారు. ఆమె వ్యాఖ్యలు అప్పట్లో వివాదాస్పదం కూడా అయ్యాయి. ఇలా ఏదో ఒకటి చేసి మొత్తానికి వార్తల్లో ఉండే వ్యక్తి రమ్య.












Click it and Unblock the Notifications