కాలేజీ నుండే, అడుగుజాడల్లో కాదు.. వ్యూహకర్తగా: 'ఇసిస్' మెహిదీ
బెంగళూరు: సిరియాకు చెందిన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఇసిస్) ట్విట్టర్ ఖాతాను నిర్వహిస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న మెహిదీ మసూద్ బిశ్వాస్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పోలీసులు అతనిని విచారిస్తున్నారు. అతనిని ఆదివారం కోర్టు ముందు హాజరు పర్చగా, ఐదు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించారు.
'ఇస్లామిక్ రాజ్య' తీవ్రవాది అయిన మెహదీ ఒకరి అడుగుజాడల్లో నడవకుండా... ఇందులో తనకంటూ ప్రత్యేకత ఏర్పరుచుకోవాలని భావించాడట. వ్యూహకర్తగా తనను నిరూపించుకోవాలని భావించాడు. అతను కళాశాలలో చదివే సమయం నుండే క్రమంగా ఉగ్రవాద కార్యకలాపాల వైపు మొగ్గడం ప్రారంభించాడు. అతను నిత్యం సిరియా, పాలస్తీనా, లెబనాన్, జోర్డాన్, ఇజ్రాయెల్, టర్కీకి చెందిన మత గ్రంథాలు చదివేవాడు. అయితే, ఈ దేశాలకు అతను వెళ్లలేదు.
భారత దేశం కోసం పోరాడకుండా ఇస్లామిక్ స్టేట్ వైపుకు ఎందుకు మొగ్గు చూపావని ప్రశ్నిస్తే.. భారత దేశంలో జిహాద్ కోసం సిద్ధమైన నిజమైన ముస్లీంలు లేరని అతను అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది.
రాత్రుళ్లు పని చేసేవాడు

మెహదీ.. ఇసిస్ సంస్థకు దక్షఇణ భారత దేశంలో కమాండెంట్‌గా పని చేస్తున్నాడని, షమివిట్నెస్ పేరుతో ట్విట్టర్ ఖాతాను నిర్వహిస్తూ ఆంగ్లం, హిందీ భాషలు తెలిసిన యువకులను తీవ్రవాదం వైపు మళ్లేలా ప్రోత్సహిస్తున్నట్లు గుర్తించామని, మెహదీ పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, టర్కీ సిరియా, లెబనాన్, ఇజ్రాయెల్, గాజా స్ట్రిప్ తదితర ప్రాంతాల్లో తీవ్రవాదులు నిర్వహిస్తోన్న కార్యకలాపాలపై మెహదీ ఆసక్తి కలిగి ఉన్నాడని చెప్పారు.
మెహదీ ఉర్దూ, అరబిక్‌లో ఉన్న తీవ్రవాద సాహిత్యాన్ని ఆంగ్లంలోకి అనువదించి తన ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాల్లో పొందుపరిచేవాడని, రాత్రుళ్లు క్రియాశీలకంగా పని చేసేవాడని, ట్విట్టర్ ఖాతాను ఎక్కడి నుండి నిర్వహిస్తున్న విషయాన్ని గోప్యంగా ఉంచాడని, నిందితుడు షమీవిట్నెస్ అనే ట్విట్టర్ ఖాతాతో పాటుగా, ఈఐఎస్ అల్టాడార్ అనే ఖాతాను తెరిచాడని, ఇసిస్ పేరుతో ఫేస్ బుక్ పుట ఉన్నట్లు గుర్తించినట్లు పోలీసులు చెప్పారు.
ట్వీట్లను ఎక్కువగా స్మార్ట్ ఫోన్ సహాయంతో నిర్వహించేవాడని తెలిపారు. బ్రిటన్‌కు చెందిన చానల్-4 షమీవిట్నెస్ వివరాలు గుర్తించి ప్రకటించిన వెంటనే ట్విట్టర్ ఖాతాను నిలిపివేశాడని అధికారులు తెలిపారు. కేంద్ర ఐబీ బృందాల సహకారంతో నిందితుని నివాస వివరాల్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నామని, విచారణ చేస్తున్నామని తెలిపారు.
నా కుమారుడికి సంబంధాల్లేవు
తన కొడుకు మెహదీకి ఇసిస్‌తో సంబంధాలు లేవని తండ్రి ఎం బిశ్వాస్ చెబుతున్నారు. ఆయన కోల్‌కతాలో శనివారం మాట్లాడారు. దీని గురించి శుర్వారం రాత్రి ఓ విలేకరి తనను అడిగారని, తన కుమారుడితో మాట్లాడానని, ఎలా జరిగింతో అర్థం కావడం లేదని చెప్పాడని, తన ఇంటర్నెట్ ఖాతా హ్యాక్ అయినట్లు చెప్పాడని వివరించాడు.












Click it and Unblock the Notifications