లెటర్ల పర్వం: కేజ్రీకి జంగ్ షాక్, మరింతగా ముదిరిన వివాదం
న్యూఢిల్లీ: ఢిల్లీలో రాజకీయం రసవత్తరంగా మారింది. అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య తలెత్తిన వివాదం మరింత ముదిరింది. సీఎస్‌గా శకుంతల గామ్లిన్ నియామకంతో మొదలైన వివాదం బుధవారం తారస్థాయికి చేరింది. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం నాలుగు రోజులుగా చేపట్టిన అన్ని నిమాయకాలు, బదిలీలను రద్దు చేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ బుధవారం ప్రకటించారు.
అంతేకాదు ఢిల్లీ ప్రభుత్వంలో అధికారుల నియమాకం, బదిలీలకు సంబంధించి పూర్తి అధికారం తనకే ఉందని జంగ్ ప్రకటించారు. అలాగే ఎన్‌సిటి ఆఫ్ ఢిల్లీ యాక్ట్‌కు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అధికారాలను జంగ్ ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. కేజ్రీవాల్ ప్రభుత్వం రాజ్యాంగానికి లోబడి నడుచుకోవల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.
గవర్నర్ తీరుతో షాక్‌కు గురైన సీఎం కేజ్రీవాల్ అటు రాష్టప్రతికి, ఇటు కేంద్రానికి లేఖలు రాశారు. తమతో సంప్రదించకుండా అధికారుల నియామకం చేస్తున్నారని కేజ్రీవాల్ తన లేఖలో ఆరోపించారు. సీఎం, లెఫ్టినెంట్ గవర్నర్ ఇద్దరూ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ వద్దకు గామ్లిన్ నియామకాన్ని తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది.

కాగా బుధవారం ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోడీకి ఓ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం స్వేచ్ఛగా పనిచేయకుండా లెఫ్టినెంట్ గవర్నర్ ఆటంకాలు కల్పిస్తున్నారని ఆ లేఖలో ఆరోపించారు. కేంద్రం ప్రమేయంతోనే ఇదంతా జరుగుతోందని ఆయన అన్నారు. ప్రజల నుంచి ఎన్నికైన ప్రభుత్వాన్ని కాదని లెఫ్టినెంట్ గవర్నర్ నియామకాలు, బదిలీలు చేస్తున్నారని కేజ్రీవాల్ విమర్శించారు.
సీఎం, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య తలెత్తిన వివాదంపై రాజ్‌నాథ్
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మధ్య తలెత్తిన వివాదంపై కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. ‘లెఫ్టినెంట్ గవర్నర్, సీఎం ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుండే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. వారిద్దరు కచ్చితంగా దీనికి ప్రయత్నిస్తారని నేను విశ్వసిస్తున్నాను' అని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. రాష్టప్రతితో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన రాజ్‌నాథ్ సింగ్ ‘విషయాన్ని రాష్టప్రతికి వివరించానే తప్ప దానిపై ఎలాంటి చర్చ జరగలేదు' అని అన్నారు.
మాకు వ్యతిరేకంగా అందరూ ఒక్కటవుతున్నారు: అరవింద్ కేజ్రీవాల్
ఆప్‌కు వ్యతిరేకంగా అందరూ ఏకమై పనిచేసినా ప్రజల మద్దతు ఉన్నంతవరకూ ఏమీ జరగదని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఢిల్లీలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన అరవింద్ కేజ్రీవాల్ ‘మాకు వ్యతిరేకంగా అందరూ ఒక్కటవుతున్నారు. ప్రజల మద్దతు ఉన్నంతవరకూ మమల్ని ఏమీ చేయలేరు' అని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications