వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తల్లి కంటే ముందు 25 ఏళ్లకే మెనోపాజ్, పిల్లలు పుట్టే అవకాశమూ లేదు.. ఎందుకిలా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఎమ్మా డెలానీ

టీనేజీ లేదా 20ల వయసులో ఉన్నప్పుడే మెనోపాజ్ వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి.

అసలు తమ జీవితం ఇలా మారుతుందని ఎమ్మా, సోయ్-మ్యాట్, ఎల్‌స్పెత్ ఏ రోజూ అనుకోలేదు.

వయసు పైబడిన తర్వాత వచ్చే మెనోపాజ్ చిన్న వయసులోనే రావడంతో వీరి జీవితాలు చాలా ప్రభావితం అయ్యాయి.

ఆగస్టు 2013లో ఒక రోజు ఉదయం ఎమ్మా డెలానీ వైద్య రిపోర్టులను పరిశీలించిన అనంతరం 25 ఏళ్ల వయసులోనే ఆమెకు మెనోపాజ్ వచ్చిందని వైద్యులు ధ్రువీకరించారు.

ఆ మాట విన్న తర్వాత, హాస్పిటల్ చైర్‌లో ఎమ్మా కుప్పకూలారు.

ఒక్కసారిగా ఆమె జీవితం కళ్లముందు కనిపించింది. కొన్ని సంవత్సరాల క్రితం ఒక మాత్ర వేసుకున్న తర్వాత ఆమెకు మళ్లీ పీరియడ్స్ రాలేదు. ఇకపై రాకపోవచ్చు కూడా.

ఆమెకు సహజంగా గర్భం వచ్చే అవకాశాలు కూడా దాదాపుగా లేనట్లే.

''అసలు ఎలా స్పందించాలో తెలియలేదు. నాకు ఇక పిల్లలు పుట్టే అవకాశం లేదని వైద్యులు చెప్పారు’’అని ఆమె వివరించారు.

ప్రైమరీ ఒవేరియన్ ఇన్‌సఫీసియెన్సీ (పీఓఐ)గా పిలిచే రుగ్మతతో బాధపడుతున్న అతికొద్ది మంది మహిళల్లో ఎమ్మా కూడా ఒకరు.

40 ఏళ్లలోపే మెనోపాజ్ వస్తే పీఓఐ నిర్ధరిస్తారు. చాలా కేసుల్లో ఇలా ఎందుకు వస్తోందో చెప్పడం కష్టం.

సోయ్-మ్యాట్

ప్రతి 100 మందిలో ఒకరికి..

బ్రిటన్‌లో ప్రతి 100 మందిలో ఒకరికి పీఓఐ వస్తోంది. అయితే, వాస్తవానికి బాధితుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని గురించి ఎక్కువగా చర్చ జరగడంలేదని వారు చెబుతున్నారు.

''చిన్న వయసులో మెనోపాజ్‌పై పెద్దగా చర్చ జరగడం లేదు’’అని మెనోపాజ్ కేర్‌లో నిపుణురాలు డాక్టర్ నిఘత్ ఆరిఫ్ చెప్పారు.

''ఈ రుగ్మత పేరు చెప్పగానే సాధారణంగా వయసు పైబడిన, తెల్ల జుట్టు ఉండే మహిళలే అందరికీ గుర్తుకువస్తారు. కానీ, అలా ఆలోచించడం సరికాదు’’అని ఆమె వివరించారు.

ఎమ్మా లాంటి కొందరి మహిళల్లో వీరి అండాశాలు ఎందుకు పనిచేయడంలేదో సరిగ్గా తెలియదు. కానీ, కొన్ని రోగ నిరోధక శక్తి రుగ్మతలు, క్రోమోజోమ్ సమస్యలు, గర్భాశయం లేదా అండాశయానికి సర్జరీల వల్ల కూడా పీవోఐ వస్తుంది.

ఈ వ్యాధి సోకిందని నిర్ధారణ అయిన తర్వాత సదరు మహిళలు మానసికంగానూ తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటారు. డాక్టర్ ఈ విషయాన్ని చెప్పిన తర్వాత, తన కారులో ఒంటరిగా ఎమ్మా దాదాపు గంటసేపు ఏడ్చారు.

నిజానికి ఎమ్మాకు మెనోపాజ్ గురించి పెద్దగా ఏమీ తెలియదు. మాంచెస్టర్‌లో తను పనిచేసే హెయిర్ సెలూన్‌లో కొందరు వయసు పైబడిన మహిళలు దీని గురించి మాట్లాడుకున్నప్పుడే ఆమె కొన్ని విషయాలు తెలుసుకున్నారు.

అయితే, తనకు మెనోపాజ్ వచ్చిందని తెలుసుకున్న తర్వాత, ఇద్దరు పిల్లలను కనాలనే తన కలను ఎవరో తన నుంచి లాగేసుకున్నట్లు ఆమెకు అనిపించింది.

ఆ తర్వాత కొన్ని నెలలపాటు హార్మోన్ రీప్లెస్‌మెంట్ థెరపీ (హెచ్ఆర్‌టీ)ని ఎమ్మా ఆశ్రయించారు. ఎందుకంటే ఆమె అండాశయం పనిచేయడం లేదని, రుతుచక్రంలో కీలక పాత్ర పోషించే ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్‌లను ఆమె శరీరం సరిపడా స్థాయిలో ఉత్పత్తి చేయడంలేదని వైద్యులు నిర్ధారించారు. దీని వల్ల ఆమె ఆరోగ్యం ఏళ్లుగా ప్రభావితం అవుతోంది.

సోయ్-మ్యాట్

కొన్నిసార్లు మెదడు ఒక్కసారిగా స్తంభించిపోయినట్లుగా అనిపించడం తన వ్యక్తిత్వంలో భాగం కాదని ఆమెకు ఇప్పుడే అర్థమైంది.

శరీరంలో వేడి ఆవిర్లకు హెయిర్ డ్రైయర్లతో ఎక్కువసేపు పనిచేయడంతో సంబంధంలేదని ఆమె తెలుసుకున్నారు.

రాత్రిపూట నిద్ర పట్టకపోవడం వెనుక కారణమేమిటో కూడా ఆమెకు అర్థమైంది.

నిజానికి ఈ విషయంపై అప్పట్లో 40 వయసులో నుండే ఆమె తల్లికి కూడా అవగాహన లేదు. ఎందుకంటే ఆమెకు ఇంకా మెనోపాజ్ రాలేదు.

మరోవైపు ఎమ్మా స్నేహితులు కూడా జీవితంలో స్థిరపడుతున్నారు. వీరిలో కొందరికి పిల్లలు కూడా పుట్టారు. ''అసలు నన్ను ఎవరూ అర్థం చేసుకోనట్లుగా అనిపించేది’’అని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.

దీంతో తాను చేసే పనిపైనే ఎమ్మా ఎక్కువ దృష్టి సారించేవారు. ఆమె ఈ వ్యాధి గురించి ఎవరితోనూ మాట్లాడటం మానేశారు. సాయంత్రం పూట నైట్‌అవుట్లు, డేట్లకు ఆమె ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టారు.

''సెక్స్, ఆల్కహాల్‌తో నా శరీరాన్ని మరింత వేదనకు గురిచేసేదాన్ని. అసలు దీని గురించి నా మనసు మాట్లాడాలని అనుకుంటోంది అనే విషయాన్నే నేను పక్కనపెట్టేశాను’’ అని ఆమె వివరించారు.

ఎల్‌స్పెత్

మరికొందరి విషయంలో ఇతర తీవ్రమైన సమస్యలకు చికిత్స తీసుకున్నప్పుడు పీఓఐ వారికి నిర్ధరణ అవుతోంది.

లండన్‌కు చెందిన గ్రాఫిక్స్ డిజైన్ స్టూడెంట్ సోయ్ మ్యాట్ నోయి క్యాన్సర్ చికిత్స తీసుకుంటుంగా అనుకోకుండా ఆమెకు మెనోపాజ్ వచ్చింది. ఆమె వయసు 23 ఏళ్లు మాత్రమే. ఈ ఏడాది మొదట్లో ఆమెకు పెద్దపేగు క్యాన్సర్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు.

తన కటి ప్రాంతంలో రేడియేషన్ వల్ల ఆమె అండాశయం దెబ్బతింది. అసలు తర్వాత ఏం జరగబోతోందో ఆమె ఊహించుకోలేదు కూడా.

''వైద్యులు కేవలం తన క్యాన్సర్ చికిత్సపైనే దృష్టిసారించేవారు. అసలు మెనోపాజ్ ఇలా వచ్చే అవకాశం ఉంటుందని నాకు ఎవరూ చెప్పలేదు’’అని ఆమె వివరించారు.

ఆందోళన, నీరసం లాంటి లక్షణాలు ఆమెలో మొదట కనిపించాయి. ఇవి క్రమంగా తీవ్రమయ్యాయి. సోయ్ పుట్టి పెరిగిన వాతావరణంలో మెనోపాజ్ గురించి ఎవరూ పెద్దగా మాట్లాడుకునేవారు కాదు. కాబట్టి ఈ విషయంపై ఆమెకు పెద్దగా అవగాహన లేదు.

యూనివర్సిటీలో ఆమె స్నేహితులు గర్భనిరోధకాల గురించి మాట్లాడుకునేవారు, మెనోపాజ్ గురించి వారికి కూడా ఏమీ తెలియదు.

''నా శరీరంలో జరిగేవన్నీ, వృద్ధుల్లో కనిపించే పరిణామాలుగా భావించేదాన్ని. ఒక్కసారిగా నా జీవితాన్ని వృద్ధాప్యంలోకి తీసుకెళ్లినట్లు అనిపించేది’’అని సోయ్ వివరించారు.

మానసిక ఆరోగ్యం గురించి థెరపిస్టుతో సోయ్ మాట్లాడేవారు. అయితే, ఆ చర్చల్లో మెనోపాజ్ లక్షణాల గురించి పెద్దగా మాట్లాడుకునేవారు కాదు. ఆమె తన ప్రశ్నలకు సమాధానాలను గూగుల్‌లో వెతకడం మొదలుపెట్టారు.

హార్మోన్ థెరపీ అనేది కొంత మంది క్యాన్సర్ బాధిత మహిళలకు సరిపోదు. అయితే, సోయ్ విషయంలో మాత్రం దీన్ని సురక్షితంగా పనిచేసింది. నెమ్మదిగా లక్షణాలు కూడా తగ్గడాన్ని ఆమె గుర్తించారు.

ప్రస్తుతం హెచ్ఆర్‌టీని తీసుకుంటూనే ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం, వాకింగ్ చేయడం లాంటి చర్యలు పాటిస్తున్నారు. ముందే ఈ చికిత్స తీసుకోవాలని సూచిస్తే పరిస్థితి మెరుగ్గా ఉండేదని ఆమె చెప్పారు.

ఎమ్మా డెలానీ

ఇలాంటి లక్షణాలతో బాధపడుతున్న మహిళల మెసేజ్‌లతో డాక్టర్ నిఘత్ ఆరిఫ్ సోషల్ మీడియా ఇన్‌బాక్స్‌లు నిండిపోతుంటాయి. వైద్యులు దీనిపై అవగాహన పెంచుకోవాలని, ప్రజల్లో అపోహలు తొలగించాలని ఆమె కోరుతున్నారు.

''మీ చుట్టు పక్కల ఉండే మహిళలతో మాట్లాడండి. మీ అమ్మ, అమ్మమ్మ, పెద్దమ్మ, స్నేహితులు ఇలా ఎవరితోనైనా మాట్లాడొచ్చు. సిగ్గు పడటానికి ఇక్కడ ఏమీ లేదు’’అని బాధితులకు ఆమె సూచిస్తున్నారు.

లక్షణాలపై అవగాహన పెరగడంతో పీఓఐ గురించి మాట్లాడే మహిళల సంఖ్య పెరుగుతోందని, అయితే, ఇప్పటికీ కొంతమందిలో ఈ వ్యాధి నిర్ధారణ కావడానికి చాలా ఆలస్యం అవుతోందని ఆమె వివరించారు. మనం దీన్ని మొదట్లోనే పట్టించుకోకపోతే, ఎముకలు, గుండె, ఇతర ఆరోగ్య సమస్యలు చుట్టు ముట్టే అవకాశముందని చెప్పారు.

''కొంతమంది బాధితుల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. వారు బహుశా పిల్లలను కనాలని అనుకోవచ్చు. కానీ, వారి నుంచి ఆ అవకాశాన్ని పీఓఐ దూరం చేస్తుంది’’అని ఆమె వివరించారు.

''సెక్స్ చేసేటప్పుడు విపరీతమైన నొప్పి, కోరికలు లేకపోవడం లాంటి లక్షణాలపై అసలు చాలా మంది మాట్లాడటానికి ఇష్టపడరు’’అని ఆమె చెప్పారు.

23 ఏళ్ల ఎల్‌స్పెత్ విల్సన్‌లో ఈ లక్షణాలు చాలా ఎక్కువగా కనిపించాయి. తనకు 15 ఏళ్ల వయసున్నప్పుడు సెక్స్ చేయడంలో చాలా అసౌకర్యం అనిపించేది.

''ఎవరితోనైనా రిలేషన్‌షిప్‌లో ఉండటం చాలా కష్టంగా అనిపించేది. మీరు ప్రేమిస్తున్నారని శరీరంతో చూపించాలని వారు కోరుకుంటారు. కానీ, కొన్నింటికి మీ శరీరం సహకరించదు. కొన్నిసార్లు చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది’’ అని ఆమె చెప్పారు.

''అసలు ఇలాంటి సమస్య కూడా ఉంటుందని డాక్టర్లు చెప్పకపోవడంతోనే ఎక్కువ చిరాకుగా అనిపించేది’’అని ఆమె వివరించారు.

యూనివర్సిటీలో చదువు పూర్తయిన తర్వాత, న్యూకాజిల్‌లో మార్కెట్ రీసెర్చెర్‌గా ఆమె తొలి ఉద్యోగాన్ని మొదలుపెట్టారు.

అయితే, ఉద్యోగ సంస్థ తనకు చాలా మద్దతు ఇస్తోందని, లేదంటే ఈ రుగ్మతతో నెట్టుకు రావడం మరింత కష్టమయ్యేదని ఆమె వివరించారు.

''ఒక్కోసారి నా మెదడు స్తంభించిపోయినట్లుగా అనిపిస్తోంది. ముఖ్యంగా కీలకమైన పరిస్థితుల్లో అలా అవుతుంది’’అని ఆమె చెప్పారు.

ఇలాంటి రుగ్మతతో బాధపడే ఇతర మహిళలున్న వాట్సాప్ గ్రూప్‌లో చేరడంతో తనకు కొంత ఉపశమనం లభిస్తోంది. ఈ గ్రూపులో తమ లక్షణాల గురించి వీరు మాట్లాడుకుంటారు.

''అక్కడ మనం ప్రశ్నలు అడగొచ్చు. మన బాధను చెప్పుకోవచ్చు. దేనికీ సిగ్గు పడాల్సిన అవసరం లేదు. మనసు తేలికగా అనిపిస్తుంది’’అని ఎల్సా చెప్పారు.

క్యాన్సర్ తర్వాత మెనోపాజ్ వచ్చిన మహిళల ఆన్‌లైన్ గ్రూపులో సోయ్‌కు కూడా ఇలాంటి సాంత్వనే దొరికింది. ఎమ్మా విషయంలోనూ ఇలానే జరిగింది.

ఏళ్లపాటు వేదనను అనుభవించిన తర్వాత, నేడు ఎమ్మా అనుభవాలను మెరుగ్గా ఈ గ్రూపులోని సభ్యులతో పంచుకుంటారు. మరోవైపు కౌన్సెలర్‌కు కూడా ఆమె మెరుగ్గా తన లక్షణాలను వివరిస్తున్నారు.

''ఎలాంటి వ్యాధి సోకినప్పటికీ, మనము మనలానే ఉండాలి, మన జీవితాన్ని ఆస్వాదించాలి. ఇదే నేను నేర్చుకున్న పాఠం’’అని ఆమె చెప్పారు.

కొన్ని సంవత్సరాల క్రితం తనను మెరుగ్గా అర్థం చేసుకునే పార్ట్‌నర్‌ను ఆమె కలిశారు. ఇప్పుడు వారిద్దరూ కలిసే జీవిస్తున్నారు.

ప్రస్తుతం ఆమె వయసు 34 ఏళ్లు. భవిష్యత్‌లో పిల్లలను పెంచుకోవాలని ఆమె భావిస్తున్నారు.

''మేక్ మెనోపాజ్ మ్యాటర్’’ నినాదం రాసివున్న టీషర్టును కూడా వేసుకొని అప్పుడప్పుడు ఆమె సెలూన్‌కు వెళ్తున్నారు.

చాలా చిన్న వయసులోనే మెనోపాజ్ వచ్చిందని క్లయింట్లు ఆమెకు ధైర్యం చెబుతుంటారు. ''అయితే, తమ జీవితాంతం తెలుసుకున్న దానికంటే, 30 నిమిషాలు నాతో మాట్లాడటం వల్ల మెనోపాజ్ గురించి ఎక్కువ తెలుసుకున్నామని అంటారు’’అని ఆమె వివరించారు.

''ఆ మాటలు విన్నప్పుడు చాలా గర్వంగా అనిపిస్తుంది. దీనిపై నేను ప్రజలకు అవగాహన కల్పించగలుగుతున్నాను’’అని ఆమె చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Menopause at 25 years before mother, there is no chance of having children.. Why?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X