లాక్ డౌన్ 3.0 గైడ్ లైన్స్: పనిప్రదేశాలు,శుభకార్యాలు,అంత్యక్రియల్లో ఈ నిబంధనలు తప్పనిసరి..
కరోనా లాక్ డౌన్‌ను మే 4వ తేదీ నుంచి మరో రెండు వారాల పాటు పొడగించిన కేంద్ర ప్రభుత్వం.. జోన్ల వారీగా సడలింపులనిచ్చింది. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్-2005 ప్రకారం లాక్ డౌన్‌ను పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రీన్ జోన్లలో మద్యం దుకాణాలు,పాన్ షాపులకు కూడా అనుమతిచ్చింది. అలాగే ఆరెంజ్,గ్రీన్ జోన్ల పరిధి అంతర్ జిల్లా ప్రయాణాలకు అనుమతులిచ్చింది. అదే సమయంలో నిబంధనలు పాటించాల్సిందేనని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాల్లో పేర్కొంది.

మాస్కులు తప్పనిసరి.. ఉమ్మి వేస్తే కఠిన చర్యలు..
ప్రజలు ఇంటి నుంచి బయటకెళ్లిన ప్రతీసారి మాస్కులు ధరించాల్సిందేనని మార్గదర్శకాల్లో పేర్కొంది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేస్తే కఠిన చర్యలు తప్పవు. బహిరంగ ప్రదేశాల్లో,పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో సోషల్ డిస్టెన్స్ తప్పనిసరి. బహిరంగ ప్రదేశాల్లో పొగాకు ఉత్పత్తుల వినియోగానికి అనుమతి లేదని చెప్పింది. మద్యం షాపులు,పాన్ షాపుల వద్ద కనీసం ఆరడగుల సోషల్ డిస్టెన్స్ తప్పనిసరి అని పేర్కొంది. ఒకసారి కేవలం ఐదుమందిని మాత్రమే షాపు వద్దకు అనుమతించేలా చర్యలు తీసుకోవాలని చెప్పింది.

ఏ ఆఫీస్ అయినా ఐదుగురికి మించి అనుమతి లేదు..
ఏ సంస్థ లేదా కార్యాలయంలో ఐదుగురికి మించి వ్యక్తులు ఉండకూడదని స్పష్టం చేసింది. పని ప్రదేశాల్లో ఉద్యోగులు మాస్కులు ధరించడం తప్పనిసరి చేసింది.కాబట్టి ఆఫీస్ యాజమాన్యాలు సరిపోయేన్ని మాస్కులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. పని ప్రదేశాల్లో సోషల్ డిస్టెన్స్ తప్పనిసరి అని పేర్కొంది. ఎక్కువమందిని ఒకే షిఫ్టులో కాకుండా.. తక్కువమందితో షిఫ్టులు నిర్వహించేలా చూసుకోవాలని చెప్పింది. పని ప్రదేశాల్లో ఎంట్రీ&ఎగ్జిట్ వద్ద థర్మల్ స్క్రీనింగ్,శానిటైజర్స్ ఏర్పాటు చేయాలని చెప్పింది. వీటిని యాజమాన్యమే సమకూర్చుకోవాలని.. తరుచూ పని ప్రదేశాలను శానిటైజ్ చేస్తూ ఉండాలని సూచించింది. ప్రభుత్వ,ప్రైవేట్ ఉద్యోగులు తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్‌ను ఉపయోగించాలని ఆదేశించింది.

అంత్యక్రియలు,పెళ్లిళ్లకు ఎంతమంది వరకు వెళ్లవచ్చంటే..
ఏ జోన్లలో అయినా సరే.. 65 ఏళ్లు పైబడ్డ వృద్దులు,గర్భిణి మహిళలు,పదేళ్ల లోపు చిన్నారులు ఇళ్లకే పరిమితం కావాలని.. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది.వివాహ సంబంధిత శుభకార్యాలకు 50 మందికి మించి హాజరుకావద్దని,అక్కడ కూడా సోషల్ డిస్టెన్స్ తప్పనిసరి అని పేర్కొంది. అలాగే అంత్యక్రియలు వంటి కార్యక్రమాలకు 20మందికి మించి హాజరుకావద్దని సూచించింది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 35వేలు దాటిన నేపథ్యంలో కేంద్రం లాక్ డౌన్ పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 733 జిల్లాలను ఆరెంజ్,గ్రీన్,రెడ్ జోన్లుగా విభజించి.. వాటికి అనుగుణంగా మార్గదర్శకాలు విడుదల చేసింది.