మైనింగ్ కింగ్ శేఖర్ రెడ్డి అరెస్టు: జ్యుడిషీయల్ కస్టడీలోకి తీసుకున్న ఈడీ
శేఖర్ రెడ్డి మరియు అతని వ్యాపార భాగస్వామి శ్రీనివాసులుపై ఈడీ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసింది.
చెన్నై: టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, మైనింగ్ కింగ్ శేఖర్ రెడ్డిని ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్) అదుపులోకి తీసుకుంది. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా.. న్యాయమూర్తి అనుమతి మేరకు మార్చి 28వరకు శేఖర్ రెడ్డిని ఈడీ జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకోనుంది.
సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేసిన కొద్దిరోజులకే ఈడీ ఆయన్ను అరెస్టు చేయడం గమనార్హం.
నోట్ల రద్దు తర్వాత రూ.34కోట్లు శేఖర్ రెడ్డి ఇంట్లో పట్టుబడిన కేసుకు సంబంధించి ఈడీ ఆయన్ను విచారించనుంది. లెక్కాపత్రం లేని పాత కరెన్సీని కొందరు అధికారుల సాయంతో వివిధ బ్యాంకుల్లో మార్చినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి.
పెద్దనోట్ల రద్దు ప్రకటించిన 24రోజుల్లోనే ఆయన ఈ వ్యవహారాన్ని చక్కబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.దీనికి సంబంధించి తొలుత సీబీఐ విచారణ సాగించగా.. ఇప్పుడదే కేసు ఈడీ చేతుల్లోకి వెళ్లింది.

కాగా, అంతకుముందు శేఖర్ రెడ్డి మరియు అతని వ్యాపార భాగస్వామి శ్రీనివాసులుపై ఈడీ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసింది. నోట్ల రద్దు తర్వాత అంత భారీ మొత్తంలో కొత్త నోట్లతో కూడిన నగదు వీరి వద్దకు ఎలా చేరిందన్న విషయంపై ఈడీ దర్యాప్తు కొనసాగించనుంది.












Click it and Unblock the Notifications