రగులుతున్న పీవోకే: పాక్ సైన్యం కాల్పుల్లో ఆరుగురు పౌరులు దుర్మరణం!
పాక్ ఆక్రమిత కాశ్మీర్(POK)లో మరోసారి రక్తపాతం చెలరేగింది. రావల్కోట్‌లో నిరసనకారులపై పాకిస్థానీ భద్రతా దళాలు కాల్పులు జరపడంతో ఆరుగురు మరణించారు.మంగళవారం రావల్కోట్‌లోని కొత్త బస్ టెర్మినల్ సమీపంలో హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. బలోచ్ సుధోంతిలో కూడా భద్రతా దళాలకు, పౌరులకు మధ్య ఘర్షణలు జరిగాయి. బలోచ్ సుధోంతి, రావల్కోట్‌లలో జాహిద్, జాఫర్, అర్సలాన్ అక్బర్, వాజిద్ మరణించినట్లు సమాచారం. రావల్కోట్, దాని పరిసర ప్రాంతాలలో జరిగిన ఈ తాజా హింసాకాండ ఉద్రిక్తతలను మరింత పెంచింది. పీఓకేలోని చాలా ప్రాంతాలలో ప్రజలు ఇప్పటికే పాకిస్థాన్ ప్రభుత్వానికి, సైన్యానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. పీఓకేలోని అనేక నగరాలు హింసాకాండ కోరల్లో చిక్కుకున్నాయి, ముఖ్యంగా రావల్కోట్‌లో నిరసనలు కొనసాగుతుండగా.. స్థానికులు సైన్యాన్ని సవాలు చేస్తున్నారు.
పీవోకేలో పెరుగుతున్న ఆగ్రహం
పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ప్రజల ఆగ్రహం పెరిగిపోతోంది. పాకిస్థాన్ సైన్యానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నెల రోజులుగా జరుగుతున్న నిరసనలు విస్తృతరూపం దాల్చుతున్నాయి. ఈ నిరసనలకు నాయకత్వం వహిస్తున్న నాయకులు షెహబాజ్ షరీఫ్, అసిమ్ మునీర్‌లకు నేరుగా సవాలు విసురుతున్నారు . దీనికి భయపడిన పాకిస్థాన్ ప్రభుత్వం ప్రజలపై కాల్పులు జరుపుతోంది. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) ఆధ్వర్యంలో సుమారు నెల రోజులుగా నిరసనలు జరుగుతున్నాయి. ఈ నిరసనలను అణచివేసేందుకు పాకిస్థాన్ భద్రతా దళాలు చేస్తున్న ప్రయత్నం ఉద్రిక్తతను మరింత పెంచింది. పాకిస్థాన్ సైన్యం, రేంజర్స్ చర్యల వల్ల ప్రజల ఆగ్రహం పెరిగిపోతోంది.

పరిస్థితి మరింత దిగజారే అవకాశం
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో ద్రవ్యోల్బణం, శరణార్థుల కోసం కేటాయించిన 12 అసెంబ్లీ సీట్లపై గత నెలలో నిరసనలు ప్రారంభమయ్యాయి. నిరసనకారులపై పాకిస్తాన్ సైన్యం జరిపిన అణచివేత పరిస్థితిని మరింత దిగజార్చింది. పాకిస్తాన్ సైన్యం, ప్రభుత్వం చేస్తున్న అణచివేతకు వ్యతిరేకంగా జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) నేతృత్వంలోని ఈ ఉద్యమం పెద్ద ఎత్తున విస్తరించింది. జులై 27న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందే తమ 38-సూత్రాల ఆర్థిక, రాజ్యాంగ డిమాండ్లను నెరవేర్చాలని పీవోకేలోని నిరసనకారులు అల్టిమేటం జారీ చేశారు. ఈలోగా భారీ ఆయుధాలతో కూడిన వేలాది అదనపు కేంద్ర భద్రతా దళాలను మోహరించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో పరిస్థితి మరింత దిగజారుతోంది.
పాకిస్థాన్ ప్రభుత్వంపై భారత్ ప్రశ్నలు
మంగళవారం ఓ ప్రకటనలో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో (PoK) జరుగుతున్న నిరసనలు వ్యవస్థాగత దోపిడీ ఫలితమేనని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. పాకిస్థాన్ బలవంతపు ఆక్రమణలో ఉన్న ప్రాంతాలలో దశాబ్దాలుగా కొనసాగుతున్న వ్యవస్థీకృత దోపిడీ, ప్రాథమిక హక్కుల నిరాకరణ, పరిపాలనా అణచివేత ఫలితమే పీవోకేలో జరుగుతున్న నిరసనలని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. నిత్యావసర వస్తువుల సరఫరాను నిలిపివేయడం, పోలీసుల క్రూరత్వం, ఇంటర్నెట్ షట్‌డౌన్‌లపై విదేశాంగ మంత్రిత్వ శాఖ పాకిస్తాన్‌ను తీవ్రంగా విమర్శించింది. ప్రజల న్యాయమైన సమస్యలను పరిష్కరించడానికి బదులుగా, పాకిస్తాన్ ప్రభుత్వం అత్యంత క్రూరమైన పోలీసు చర్యలకు పాల్పడిందని ఆయన అన్నారు. నిస్సహాయ మహిళలు, పిల్లలపై హింస, ఆహారం, మందుల సరఫరాను అడ్డుకోవడం, నిరాయుధ పౌరులపై కాల్పులు జరపడం వంటివి ఇందులో ఉన్నాయని, దీని ఫలితంగా విషాదకరమైన మరణాలు సంభవిస్తున్నాయని ఆయన వెల్లడించారు.














Click it and Unblock the Notifications