వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'మియా' మ్యూజియం: అస్సాంలోని 'ముస్లిం' మ్యూజియంపై వివాదం ఏంటి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
అస్సాంలోని ఒక చిన్న ఇంట్లో ఏర్పాటు చేసిన మ్యూజియం వివాదానికి దారితీసింది

మొహితాన్ బీబీ తన కొడుకు జైలు నుంచి తిరిగి వచ్చే రోజు కోసం ఎదురుచూస్తున్నారు. ఆమె కొడుకు మొహర్ అలీని నెల క్రితం అరెస్ట్ చేశారు.

అస్సాంలోని గోల్‌పారా జిల్లాలో ఒక కుగ్రామానికి చెందిన మొహర్ ఆలీ, తన ఇంట్లోనే ఒక చిన్న మ్యూజియం ఏర్పాటుచేశారు. ఆ మ్యూజియంను 'మియా'లక' అంటే అస్సాంలోని బెంగాలీ మాట్లాడే ముస్లింలకు అంకితం చేశానని ఆయన చెప్పారు.

ఈ మ్యూజియం తెరిచిన తరువాత మొహర్ అలీని అరెస్ట్ చేశారు.

ఒక స్థానిక రాజకీయ పార్టీకి నాయకుడైన మొహర్ అలీ సుమారు రూ. 7,000 ఖర్చుపెట్టి ఈ మ్యూజియం ఏర్పాటు చేశారు. ఇందులో ప్రధానంగా వ్యవసాయ పనిముట్లు, దుస్తులను ప్రదర్శనకు పెట్టారు.

అయితే, మ్యూజియం తెరిచిన రెండు రోజుల తరువాత, స్థానిక అధికారులు దాన్ని మూసివేశారు. మొహర్ అలీ ఇంటికి సీలువేశారు.

మొహర్ అలీకి ప్రభుత్వ పథకం కింద ఆ ఇల్లు లభించింది. దాన్ని వాణిజ్య ప్రయోజనాల కోసం తప్పుగా వాడుతున్నారని చెబుతూ, అధుకారులు ఇంటికి సీలు వేశారు.

మొహర్ అలీని, మ్యూజియం ఏర్పాటుచేయడంలో ఆయనకు సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

అయితే, వాళ్లను మ్యూజియం తెరిచినందుకు అరెస్ట్ చేయలేదని, వారికి రెండు తీవ్రవాద బృందాలతో సంబంధం ఉందన్న ఆరోపణలపై నిర్బంధంలోకి తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు.

ఈ ముగ్గురిపై ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ చట్టం కింద బెయిల్ కూడా రాదు. అయితే, తమపై వచ్చిన ఆరోపణలు అవాస్తవని మొహర్ అలీ, ఆయన మిత్రులు చెబుతున్నారు.

వీళ్ల అరెస్ట్ పట్ల అస్సాంలోని బెంగాలీ ముస్లిం కమ్యూనిటీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

తన కొడుకు "అసలేం నేరం చేశాడు?" అని అలీ తల్లి కంటతడి పెడుతూ ప్రశ్నిస్తున్నారు.

మొహర్ అలీ తల్లి మొహితాన్ బీబీ

'ఇదంతా బీజేపీ కుట్ర'

అస్సాంలో బెంగాలీ ముస్లిం కమ్యూనిటీని వెనక్కి నెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో ఈ అరెస్టులు భాగమని విమర్శకులు అంటున్నారు.

అస్సాం ఒక సంక్లిష్టమైన, బహుళ జాతి రాష్ట్రం. అక్కడ భాష ప్రాతిపదికన గుర్తింపు, పౌరసత్వంపై తరచూ రాజకీయ వివాదాలు రాజుకుంటూ ఉంటాయి.

అస్సాం జనాభాలో బెంగాలీలు, అస్సామీస్ మాట్లాడే హిందువులు, ఆదివాసులు, ముస్లింలు ఉన్నారు. ఈ రాష్ట్రంలో దశాబ్దాలుగా బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చే వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయి.

అస్సాంలో 2016లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత, హిందువులు, ఆదివాసుల ఓట్లను పోగుచేసుకోవడానికి ముస్లిం వ్యతిరేక విధానాలను అమలుచేస్తోందని విమర్శకులు ఆరోపిస్తున్నారు.

ప్రస్తుత ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ సహా పలువురు రాజకీయనాయకులు ముస్లింలను లక్ష్యంగా చేసుకుని అనేక ప్రసంగాలు చేశారు.

2021లో బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత, అక్రమ ఆక్రమణల పేరుతో వేలాదిమందిని బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయించింది. ఇందులో ఎక్కువ ప్రభావితమైనవారు బెంగాలీ మాట్లాడే ముస్లింలు.

ఈ ఏడాది ప్రారంభంలో ప్రభుత్వం, అయిదు ముస్లిం కమ్యూనిటీలను "స్థానిక అస్సామీస్" కమ్యూనిటీలుగా వర్గీకరించేందుకు ఆమోదించింది. దీంతో, ఇతర వర్గాలు మరింత వెనకబడిపోతాయన్న భయం నెలకొంది.

"బెంగాలీ మూలాలున్న ముస్లింలు రాజకీయాలకు సులువైన లక్ష్యాలుగా మారిపోయారు. మియా జనాభా అసామీస్ సమాజంలో భాగం కాదని, వాళ్లు శత్రువులని చూపించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ" అని డాక్టర్ హఫీజ్ అహ్మద్ అన్నారు. డాక్టర్ అహ్మద్ మియా కమ్యూనిటీ కోసం పనిచేస్తున్నారు.

అయితే, సీనియర్ బీజేపీ లీడర్ విజయ్ కుమార్ గుప్తా ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. కొందరు కావాలనే అస్సాం సమాజంలో వర్గాల మధ్య వివాదాలు సృష్టిస్తున్నారని అన్నారు.

"మ్యూజియం అంటే సాంస్కృతిక సంపదను, వారసత్వాన్ని భద్రపరచాలి. కానీ, ఇక్కడ అలాంటిదేమీ జరగట్లేదు" అని మొహర్ అలి ఏర్పాటుచేసిన మ్యూజియం గురించి ఆయన వ్యాఖ్యానించారు.

అస్సాంలో 90 లక్షలకు పైగా బెంగాలీ మాట్లాడే ముస్లింలు ఉన్నారు

మియాలు ఎవరు?

దక్షిణాసియాలో ముస్లిం పురుషులను గౌరవప్రదంగా 'మియా' అని పిలుస్తారు.

కానీ, అస్సాంలో ఈ పదాన్ని అవమానకరమైనదిగా పరిగణిస్తారు. తూర్పు బెంగాల్ నుంచి బంగ్లాదేశ్‌కు వలస వెళ్లిన ముస్లిం రైతులను కించపరిచే రీతిలో మియా అని పిలుస్తారు.

బంగ్లాదేశ్‌తో అస్సాంకు సుమారు 900 కిమీ పొడవైన సరిహద్దు ఉంది. వలసదారుల్లో చాలా మంది బ్రహ్మపుత్రా నది లోతట్టు ప్రాంతాలలోని చిన్న చిన్న లంకల్లో స్థిరపడ్డారు. వీరితో పాటు ఆ లంకల్లో ఇతర కమ్యూనిటీ ప్రజలు కూడా నివసిస్తున్నారు.

లంకలలో నివాసముంటున్నవారు చాలావరకు పేద రైతులు, రోజు కూలీలు. వీరికి నది నీళ్లే జీవనాధారం.

వీళ్లు చాలా వివక్షను ఎదుర్కొంటారు. వీరిని "చొరబాటుదారులు"గా చిత్రీకరిస్తారు. అస్సామీస్ మాట్లాడే జనాభా, ఆదివాసుల ఉద్యోగాలు, భూమి, సంస్కృతిని లాగేసుకుంటున్నరన్న అపవాదు మోస్తారు.

అయితే, కాలక్రమేణా బెంగాలీ ముస్లింలు తమ చరిత్రను గొప్పగా చెప్పుకోవడం ప్రారంభించారు. మియా అనే పదాన్ని ఒక ప్రత్యేక గుర్తింపుగా పరిగణించడం మొదలుపెట్టారు.

గోల్‌పారాలో మొహర్ అలీ 'మియా' మ్యూజియంను ఒక చిన్న గదిలో ఏర్పాటుచేశారు. ఇందులో కొన్ని సంప్రదాయ వ్యవసాయ పనిముట్లు, వెదురుతో చేసిన చేపల వల, అస్సాం సంప్రదాయ చేనేత వస్త్రం 'గముసా'ను ప్రదర్శనకు పెట్టారు. ఇవన్నీ కూడా "మియా వర్గం సంస్కృతిలో భాగమని" అలీ చెప్పారు.

అయితే, అలీ సమాజంలో చీలికలు తెస్తున్నారని, మ్యూజియంలో ఉంచిన వస్తువులు అస్సామీస్ సంస్కృతికి చిహ్నాలని, బెంగాలీ మాట్లాడే ముస్లింల చిహ్నాలు కాదని కొందరు బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

"మియా అనే పేరుతో అసలు ఒక కమ్యూనిటీ ఉందా?" అని ముఖ్యమంత్రి హిమంత శర్మ మ్యూజియంకు సీలు వేసే ముందు వ్యాఖ్యానించారు.

మొహర్ అలీ ఏర్పాటుచేసిన మియా మ్యూజియం

'మాకు మ్యూజియంలు వద్దు, ఉద్యోగాలు, రోడ్లు, విద్యుత్ కావాలి'

2020లో మియా మ్యూజియంను ఒక ప్రముఖ సాంస్కృతిక కేంద్రంలో ఏర్పాటు ఏర్పాటుచేయాలని మాజీ కాంగ్రెస్ నాయకుడు షెర్మాన్ అలీ అహ్మద్ యోచించారు. ఆయన అస్సాంలోని బెంగాలీ ముస్లింల హక్కుల కోసం తరచూ గొంతెత్తుతుంటారు. కానీ, షెర్మాన్ అలీ ఆలోచనను హిమంతా శర్మ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది.

అంతకుముందు 2019లో "మియా కవిత్వం" పేరుతో కొందరు కవులు మియా కమ్యూనిటీ యాసలో కవిత్వం రాసినందుకు చిక్కుల్లోపడ్డారు. వారిలో పదిమందిపై కేసులు కూడా మోపారు. మతం పేరుతో వర్గాల మధ్య విరోధం రేకెత్తిస్తున్నారన్న ఆరోపణలతో కేసులు పెట్టారు.

కాగా, ప్రభుత్వం ఇచ్చిన గృహంలో మ్యూజియం తెరవడం సరైన పని కాదని షెర్మాన్ అలీ అహ్మద్ బీబీసీతో అన్నారు. కానీ, అందుకు వారికి వేసిన శిక్ష మాత్రం చాలా ఎక్కువ అని ఆయన అభిప్రాయపడ్డారు.

"అలీ పెద్ద నేరమేం చేయలేదు. కానీ, ప్రభుత్వం వారి కమ్యూనిటీని భయపెట్టడ నికి అలీపై, ఆయన సన్నిహితులపై చాలా కఠినమైన చర్యలు తీసుకుంది" అని షెర్మాన్ అలీ అన్నారు.

అస్సాంలో ఉన్న సంక్లిష్టతను, భయాలను ఆసరాగా చేసుకుని ప్రభుత్వం ప్రయోజనం పొందాలని చూస్తోందని డాక్టర్ హఫీజ్ అహ్మద్ అన్నారు.

మరోవైపు, మొహర్ అలీ గ్రామస్థులు ఈ అరెస్టులతో ఉలిక్కిపడ్డారు. దీని గురించి పెదవి విప్పి మాట్లాడేందుకు భయపడుతున్నారు.

ఈ మ్యూజియం వద్దు, ఈ వివాదాలు వద్దు అని మరికొందరు అంటున్నారు.

"మాకు మ్యూజియంలు వద్దు. ఉద్యోగాలు కావాలి, రోడ్లు, విద్యుత్ కావాలి" అని షహీద్ అలీ అనే స్థానికుడు చెప్పారు.

మ్యూజియం పెద్ద ప్రభావం చూపేది కాకపోయినా, మియా కమ్యూనిటీకి తమ సంస్కృతిని పరిరక్షించుకునే హక్కు ఉందని డాక్టర్ అహ్మద్ అన్నారు.

"ఎన్నో ఏళ్ల అణచివేత తరువాత, మియా ముస్లింలు ఇప్పుడిప్పుడే తమ గుర్తింపును చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు.

"సంస్కృతి లేకుండా సమాజం ఎలా ఉంటుంది?" అని ఆయన ప్రశ్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

English summary
'Miya' Museum: What is the controversy over the 'Muslim' museum in Assam?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X