మహిళలకు స్టాలిన్ సర్కార్ గుడ్ న్యూస్- ఇక నెలకు వెయ్యి రూపాయలు..
తమిళనాడులో మహిళలకు స్టాలిన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న పథకాలకు తోడు మహిళలకు ఊరటనిచ్చే మరో కీలక పథకాన్ని ప్రారంభించేందుకు స్టాలిన్ సర్కార్ సిద్దమైంది. డీఎంకే సిద్ధాంతమైన సామాజిక న్యాయాన్ని చేతల్లో అమలు చేస్తూ ఇంటికి దీపమైన మహిళలకు కనీస ఆదాయాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించబోతోంది. అదీ పార్టీ వ్యవస్ధాపకుడు అన్నాదురై జయంతి అయిన సెప్టెంబర్ 15న ఈ పథకాన్ని ప్రారంభిస్తోంది.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డిఎంకె వ్యవస్థాపకుడు సిఎన్ అన్నాదురై జయంతి రోజైన సెప్టెంబర్ 15న సీఎం ఎంకే స్టాలిన్ కలైంజర్ మగళిర్ ఉరిమై తొగై (మహిళల ప్రాథమిక ఆదాయం) పేరుతో ఓ పథకాన్ని ప్రారంభించబోతున్నారు. దీని ద్వారా రాష్ట్రంలో అర్హులైన 1.06 కోట్ల మంది మహిళలకు నెలకు వెయ్యి రూపాయలు లభించబోతున్నాయి. స్టయిఫండ్ రూపంలో దీన్ని వారికి చెల్లించేందుకు స్టాలిన్ సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది.

తమిళనాడు ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఈ పథకం పేదరికాన్ని నిర్మూలించడానికి, లింగ సమానత్వాన్ని పెంచడానికి ఓ సాధనం అవుతుందని భావిస్తున్నారు. అన్నాదురై జన్మస్థలం కాంచీపురంలో జరిగిన ఈ ప్రయోగం సామాజిక న్యాయం పట్ల డీఎంకేకు ఉన్న చారిత్రక నిబద్ధతను నొక్కి చెప్పడానికి ఓ సందర్భమని చెప్తున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు, బీజేపీ హిందుత్వ దూకుడు వేళ తమిళనాడు సర్కార్ ఈ పథకం ప్రవేశపెడుతుండటం విశేషం.
ఈ పథకంపై తాజాగా సీఎం ఎంకే స్టాలిన్ వివరాలు వెల్లడించారు. పథకం అమలును ప్రభుత్వం నిశితంగా ప్లాన్ చేసిందని, ప్రారంభించిన తేదీ నుండి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నిధులు జమ అవుతాయని చెప్పారు. సులభంగా విత్‌డ్రా చేసుకునేందుకు కార్డులు అందరికీ చేరేలోపు తక్షణ నగదు ఉపసంహరణ కోసం మధ్యంతర నిబంధనతో లబ్ధిదారులకు ఏటీఎం కార్డ్‌లు కూడా జారీ చేయాలని నిర్ణయించినట్లు స్టాలిన్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications