కొత్త మంత్రులకు టీకి పిలిచిన ప్రధాని మోడీ: తొలి రోజు నుంచే..మార్కులు
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ప్రారంభమైంది. రాష్ట్రపతి భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిరాడంబరంగా ఆరంభమైంది. ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మంత్రివర్గ సహచరులు, వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మొత్తంగా 43 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. సుమారు రెండున్నర గంటలకు పైగా ఈ కార్యక్రమం కొనసాగే అవకాశం ఉంది.
కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి అమలు చేస్తోన్న ప్రొటోకాల్స్ నిబంధనల మధ్య దీన్ని కొనసాగిస్తోన్నారు. మహారాష్ట్రకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు నారాయణ్ రాణెతో ప్రమాణ స్వీకారం ఆరంభమైంది. శర్బానంద సొనొవాల్, డాక్టర్ వీరేంద్ర కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. వారి తరువాత జ్యోతిరాదిత్య సింధియా, రామచంద్ర ప్రసాద్ సింగ్, అశ్విని వైష్ణవ్ ప్రమాణం చేశారు. కాగా- కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి ప్రధాని విందు ఇవ్వబోతోన్నారు. గురువారం ఉదయం లోక్ కల్యాణ్ మార్గ్‌లోని తన అధికారిక నివాసంలో హై టీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మోడీ వారికి దిశా నిర్దేశం చేయనున్నారు.

వారికి కేటాయించిన పోర్ట్‌ఫోలియోలు, వాటి ప్రాధాన్యతల గురించి కూలంకషంగా చర్చించనున్నారు. ప్రజలతో ఎలా మమేకం కావాలనే విషయంపై తన అనుభవాలను పంచుకుంటారు ప్రధాని. వచ్చే ఏడాది అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని.. అటు ప్రభుత్వానికి, ఇటు పార్టీకి చెడ్డపేరు తీసుకుని రాకుండా ఉండేలా దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. ఉద్వాసనకు గురైన మంత్రులు ఎందుకు పదవులను కోల్పోవాల్సి వచ్చిందనే విషయాన్ని కూడా ప్రధాని నిర్మొహమాటంగా ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ప్రజా సంక్షేమం, పార్టీ శ్రేయస్సును ప్రధానంగా తీసుకునే ప్రజల్లో చొచ్చుకెళ్లాల్సిన విషయాన్ని ప్రధాని వారికి వివరిస్తారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications