కేంద్ర మంత్రులకు మోదీ మార్క్ షాక్!
కేంద్ర కేబినెట్‌లో మార్పులు, చేర్పులు జరుగుతాయనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే 2014 నుంచి మోదీ ప్రభుత్వంలో జరిగిన మార్పుల ప్రకారం ఓ స్పష్టమైన విధానం కనిపిస్తుంది. హోం, ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాల వంటి కీలక వ్యూహాత్మక శాఖలు చాలా స్థిరంగా కొనసాగగా.. ప్రజలతో నేరుగా ముడిపడి ఉన్న సామాజిక రంగాలు, ఇతర శాఖల్లో మాత్రం తరచూ మంత్రులు మారుతూ రావడం గమనార్హం. ప్రధాని నరేంద్ర మోదీ మినహాయిస్తే.. 2014 నుంచి రక్షణ వ్యవహారాల శాఖలో కొనసాగుతున్న మంత్రి రాజనాథ్ సింగ్‌తో పాటు రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రిగా నితిన్ గడ్కరీ స్థిరంగా కొనసాగుతున్నారు.
కీలక శాఖల్లో సుదీర్ఘ ఇన్నింగ్స్
మోదీ కేబినెట్‌లో అమిత్ షా ఎక్కువ కాలం పనిచేసిన హోం మంత్రిగా రికార్డు సృష్టించగా.. ఎస్.జైశంకర్ స్వతంత్ర విదేశాంగ మంత్రిగా ఎక్కువ కాలం బాధ్యతలు నిర్వహించిన నాయకుడిగా నిలిచారు. ప్రధానిగా ఉంటూ విదేశాంగ మంత్రిత్వ శాఖను చూసుకున్న జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత జైశంకర్‌దే ఇక్కడ సుదీర్ఘ కాలం కావడం విశేషం. ఇక ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ వరుసగా 8 బడ్జెట్‌లను ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించారు. రాజ్‌నాథ్ సింగ్ దేశంలోనే రెండో అత్యంత సుదీర్ఘ కాలం పనిచేసిన రక్షణ మంత్రిగా నిలిచారు. మోదీ మొదటి విడత సర్కారులో అరుణ్ జైట్లీ అనారోగ్యం, మనోహర్ పారికర్ గోవా సీఎంగా తిరిగి వెళ్లడం వంటి కారణాల వల్ల మాత్రమే ఆర్థిక, రక్షణ శాఖల్లో మార్పుల చేయాల్సి వచ్చింది.

సమాచార, ప్రసార శాఖలు అత్యధిక మార్పులు
2014 నుంచి మోదీ ప్రభుత్వం 5 సార్లు కేబినెట్ మార్పులు చేపట్టింది. ఇందులో చివరి పెద్ద మార్పు జులై 2021లో జరగగా.. ఆ తర్వాత 2023లో కేవలం ఒకసారి మాత్రమే కొన్ని శాఖలను మార్చారు. అయితే సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలో అత్యధికంగా మార్పులు జరిగాయి. 2014 నుంచి ఇప్పటివరకు ఆ శాఖకు ఏకంగా ఏడుగురు మంత్రులు మారారు. ప్రకాశ్ జవదేకర్, అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, స్మృతి ఇరానీ, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, అనురాగ్ ఠాకూర్‌ల తర్వాత ప్రస్తుతం అశ్విన్ వైష్ణవ్ ఈ బాధ్యతలు చూస్తున్నారు. గత రెండు ఎన్డీయే ప్రభుత్వాల కాలం ఈ శాఖలో ఏ ఒక్క మంత్రి కూడా తమ పూర్తి పదవీ కాలాన్ని పూర్తి చేయలేకపోయడం విశేషం.
గ్రామీణాభివృద్ధి, న్యాయ శాఖల పరిస్థితి ఇదే..
గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలో ఇప్పటివరకు 5 సార్లు మార్పులు జరిగాయి. 2014లో గోపినాథ్ ముండే ఆకస్మిక మరణంతో ప్రారంభమైన ఈ మార్పుల పరంపరలో నితిన్ గడ్కరీ, బీరేంద్ర సింగ్, నరేంద్ర సింగ్ తోమర్, గిరిరాజ్ సింగ్.. ప్రస్తుతం శివరాజ్ సింగ్ చౌహాన్ వరకు కొనసాగింది. వీరిలో గిరిరాజ్ సింగ్ మాత్రమే 2019 నుంచి 2024 వరకు పూర్తికాలం ఈ శాఖలో కొనసాగారు. అదేవిధంగా చట్టం, న్యాయ మంత్రిత్వ శాఖ కూడా 4 సార్లు చేతులు మారింది. రవిశంకర్ ప్రసాద్, సదానంద గౌడ, కిరణ్ రిజిజు మీదుగా ప్రస్తుతం అర్జున్ రామ్ మేఘ్వాల్ వద్దకు చేరింది. ఇందులో రవిశంకర్ ప్రసాద్ రెండు విడతల్లో కలిపి దాదాపు ఐదేళ్లు పనిచేసినప్పటికీ.. ఏ ఒక్క మంత్రి కూడా ఒకే ప్రభుత్వంలో పూర్తి ఐదేళ్ల కాలం కొనసాగలేదు. పర్యావరణ శాఖలోనూ అనిల్ మాధవ్ దవే మరణం వంటి కారణాలతో కలిపి నలుగురు మంత్రులు మారారు.
విద్య, పౌర విమానయాన శాఖల్లో కూడా మారిన మంత్రులు
ఇదిలా ఉండగా.. విద్యా మంత్రిత్వ శాఖలో కూడా 2014 నుంచి స్మృతి ఇరానీ, ప్రకాష్ జవదేకర్, రమేష్ పోఖ్రియాల్ నిశాంక్, ధర్మేంద్ర ప్రధాన్‌ల రూపంలో నలుగురు మంత్రులు మారారు. ధర్మేంద్ర ప్రధాన్ జులై 2021 నుంచి నిరంతరాయంగా కొనసాగుతున్నప్పటికీ.. ఇక్కడ కూడా ఎవరూ ఐదేళ్ల పూర్తి కాల పరిమితిని అందుకోలేదు. ఇక పౌర విమానయాన శాఖ అశోక్ గజపతి రాజుతో ప్రారంభమై సురేష్ ప్రభు, హర్దీప్ సింగ్ పురి, జ్యోతిరాదిత్య సింధియా మీదుగా ప్రస్తుతం రామ్మోహన్ నాయుడు చేతికి వచ్చింది. పౌర విమానయాన, ఆహారశుద్ధి పరిశ్రమల వంటి శాఖలను మోదీ ప్రభుత్వం ఎక్కువగా ఎన్డీయే మిత్రపక్షాల నాయకులకు కేటాయించడానికి ఉపయోగించుకుంది. సంస్కృతి శాఖకు నలుగురు, పర్యాటక శాఖకు 5 సార్లు మంత్రులు మారారు. సమాచార-ప్రసార, న్యాయ, పర్యావరణ, పౌర విమానయాన, సంస్కృతి, పర్యాటక, విద్యా శాఖలలో ఏ ఒక్క మంత్రి కూడా 2014-19 లేదా 2019-24 కాలంలో పూర్తి ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకోలేదు.












Click it and Unblock the Notifications