మోడీ: మూడుసార్లు కేబినెట్ పునర్వవ్యస్థీకరణ, టార్గెట్ 2019 ఎన్నికలు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి మోడీ మూడోసారి తన మంత్రివర్గాన్ని పునర్వవ్యస్థీకరించారు. 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మోడీ తన టీమ్‌ను ఎంపిక చేసుకొన్నారు. పనితీరులో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన నలుగురు సహయ మంత్రులకు కేబినెట్ మంత్రులుగా ప్రమోషన్ కల్పించారు. రక్షణశాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్‌కు అరుదైన అవకాశం కల్పించారు.
2019 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా మంత్రివర్గంలోకి మోడీ కొత్తగా 9 మందికి స్థానం కల్పించారు.. మరో నలుగురు సీనియర్ మంత్రులకు ప్రమోషన్ ఇచ్చారు. పనితీరు బాగాలేని మంత్రులను రాజీనామా చేయమని కోరడంతో.. ఏడుగురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు.
అశ్వినికుమార్ చౌబే, గజేంద్ర సింగ్ షెకావత్, శివప్రతాప్ శుక్లా, హర్దీప్‌సింగ్‌పూరి, సత్యపాల్‌సింగ్, రాజ్‌కుమార్‌సింగ్, అల్ఫోన్స్ కన్నన్‌థనం, వీరేంద్రకుమార్, అనంత్‌కుమార్ హెగ్డే కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ఇప్పటికే కేంద్ర సహాయ మంత్రులుగా ఉన్న నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్, పీయూష్ గోయల్, ముక్తార్ అబ్బాస్ నఖ్విలకు కేబినెట్ హోదా కల్పించారు.

భారత 15వ ప్రధానిగా నరేంద్రమోదీ 26 మే 2014లో బాధ్యతలు చేపట్టారు. అనంతరం తన మంత్రివర్గాన్ని విస్తరించారు. మంత్రివర్గంలోకి 45 మందిని తీసుకున్నారు. వీరిలో 23 మందికి కేబినెట్.. 10 మందికి స్వతంత్ర హోదా కల్పించారు. 12 మందికి సహాయ మంత్రి పదవులు దక్కాయి. అయితే 2014 నవంబర్14న మంత్రివర్గాన్ని మోడీ విస్తరించారు.21 మంది కొత్త మంత్రులను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. నలుగురికి కేబినెట్ హోదా కల్పించగా.. ముగ్గురిని స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సహాయ మంత్రులుగా నియమించారు. మిగతా 14 మంది సహాయ మంత్రులుగా నియమించారు. తొలి విస్తరణలో 45 ఉన్న మంత్రుల సంఖ్య రెండో విస్తరణతో 66కి చేరింది.
2016 జూలైలో ప్రధానమంత్రి మోడీ రెండో దఫా తన మంత్రివర్గాన్ని పునర్వవ్యవస్థీకరించారు. అయితే పలు కారణాలతో ఐదుగురిని మంత్రివర్గం నుండి తప్పించారు. ఇద్దరు మంత్రుల హోదాను తగ్గించారు. కొత్తగా 19 మందికి చోటు కల్పించారు.
తాజాగా 2017 సెప్టెంబర్3న, మోడీ తన మంత్రివర్గాన్ని పునర్వవ్యవస్థీకరించారు. పనితీరు సరిగా లేని కారణంతో పాటు, పార్టీ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఏడుగురు మంత్రులకు మోడీ ఉద్వాసన పలికారు. 9 మందిని మంత్రివర్గంలోకి తీసుకొన్నారు. దీంతో మోదీ మంత్రివర్గం సంఖ్య 75కు చేరింది. మంత్రివర్గంలో గరిష్ఠంగా 81 మందికి అవకాశం ఉంది. అయితే మంత్రివర్గంలోకి మరో ఆరుమందికి చాన్స్ దక్కే అవకాశం కూడ ఉంది. అయితే కొత్తగా చేరే మిత్రులతో ఈ ఖాళీలను మోడీ భర్తీ చేసే అవకాశం ఉందని సమాచారం.












Click it and Unblock the Notifications