ఎన్టీఆర్ పేరు పెట్టాల్సింది కాదు, గొడవలొద్దు: మోడీ
న్యూఢిల్లీ: హైదరాబాదులోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం దేశీయ టెర్మినల్‌కు ఎన్టీ రామారావు పేరు పెట్టి ఉండాల్సింది కాదని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. బుధవారం తనను కలిసిన తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్లమెంటు సభ్యులు కలిసినప్పుడు ఆయన ఆ విధంగా అన్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ పేరుపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అభివృద్ది చెందాలంటే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గొడవలు పెట్టుకోకుండా కలిసిమెలిసి పని చేసుకోవాలని ఆయన అభిప్రాయపడినట్లు తెలిసింది.
తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్) పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె.కేశవరావు నాయకత్వంలో ఆ పార్టీకి చెందిన మొత్తం పదకొండు మంది ఎంపీలు బుధవారం పార్లమెంటు ఆవరణలో ప్రధాని మోడీని కలిసి విభజన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించారు. జితేందర్ రెడ్డి, వినోద్‌కుమార్, కడియం శ్రీహరి, నరసయ్య గౌడ్, పాటిల్, సీతారాం నాయక్, సుమన్, కవిత, కొత్త ప్రభాకర్ రెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి ప్రధానిని కలిశారు.రాష్ట్ర విభజన జరిగి ఆరు నెలలు పూర్తి కావస్తున్నా ఉద్యోగుల విభజన జరగలేదని వారు ప్రధానికి ఫిర్యాదు చేశారు.

రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తమకు సమస్యలు సృష్టిస్తున్నారని వారు మోడీతో చెప్పారు. చంద్రబాబు తెలుగు ప్రజల మధ్య విభేదాలు రెచ్చగొడుతున్నారని, రాజకీయ ప్రయోజనాల కోసం చిచ్చు పెడుతున్నారని వారు ఆరోపించారు. రాష్ట్ర విభజన జరిగిజన అనంతరం తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం దేశీయ టెర్మినల్‌కు రామారావు పేరు ఎలా పెడతారని వారు ప్రశ్నించారు. ఎన్టీఆర్ పేరు పెట్టేముందు తెలంగాణ ప్రభుత్వంతో చర్చించవలసిన బాధ్యత అశోక్ గజపతిరాజుకు లేదా అని టిఆర్‌ఎస్ ఎంపీలు నరేంద్ర మోదీని అడిగారు. ఆ బాధ కూడా చెప్పకోకూడదా అని వారు ప్రశ్నించారు.
నరేంద్ర మోడీ ఇదంతా విన్న తరువాత ఇలా జరిగి ఉండాల్సింది కాదని అన్నారు. ఉద్యోగుల విభజన వీలున్నంత త్వరగా పూర్తి చేస్తామని మోడీ వారికి హామీ ఇచ్చారు. విద్యుత్, సాగునీటి విషయంలో కూడా చంద్రబాబు సమస్యలు సృష్టిస్తున్నారని టిఆర్‌ఎస్ ఎంపీలు ప్రధానికి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి ప్రత్యేక ఆర్థిక సహాయం చేయాలని వారు ప్రధానికి విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications