కేరళలో "మీటూ" ప్రకంపనలు-"అమ్మ"కు మోహన్ లాల్ గుడ్ బై-సురేష్ గోపీ కీలక వ్యాఖ్యలు
మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల వివాదం అంతకంతకూ తీవ్రమవుతోంది. ఇప్పటికే చిత్ర పరిశ్రమలో అవకాశాల కోసం వచ్చే యువతులు, మహిళలను లైంగికంగా వేధించడం, అత్యాచారాలు చేయడం వంటి ఘటనలపై విమర్శల నేపథ్యంలో 2017లో నియమించిన జస్టిస్ హేమా కమిటీ తాజాగా నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో ఇండస్ట్రీకి చెందిన పలువురు పెద్దల పేర్లు బయటికి రావడం, వారు సమాధానాలు చెప్పుకోలేని పరిస్ధితుల్లో ఉండటంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది.
ఈ క్రమంలో ఇవాళ మలయాళ నటీనటుల సంఘం అమ్మ అధ్యక్ష పదవికి సీనియర్ నటుడు మోహన్ లాల్ రాజీనామా చేశారు. ఆయనతో పాటు అమ్మ కార్యవర్గ సభ్యులు కూడా రాజీనామాలు సమర్పించారు. ఇండస్ట్రీలో మీటూ వివాదానికి నైతిక బాధ్యత వహిస్తూ తమ కమిటీని స్వచ్చందంగా రద్దు చేసి రాజీనామాలు చేస్తున్నట్లు ఓ ప్రకటన వెలువడింది. రెండు నెలల్లో కొత్త కమిటీ ఏర్పాటుకు వీలుగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. జస్టిస్ హేమ కమిటీ నివేదికను గత వారం విడుదల అయిన తర్వాత మలయాళ చిత్ర పరిశ్రమలోని పలువురు సీనియర్ నటులపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఇందులో సిద్ధిక్, రంజిత్ బాలకృష్ణన్ వంటి వారు ఉన్నారు.

హేమ కమిటీ రిపోర్ట్ ప్రకంపనల నేపథ్యంలో ఈ ఆరోపణలపై విచారణ కోసం ఏడుగురు సభ్యుల సిట్ బృందాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. అయినా ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ నుండి విమర్శల దాడి మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకునే దిశగా అడుగులేస్తోంది. ఇందులో భాగంగానే అమ్మ కమిట రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు హేమ కమిటీ రిపోర్టు తర్వాత మీడియా మలయాళ చిత్ర పరిశ్రమలో మీటు వివాదంపై సంచలనాల కోసం వార్తలు ప్రచురిస్తోందని కేంద్ర మంత్రి సురేశ్ గోపీ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications