ఢిల్లీ దడదడ: మరో పాజిటివ్ కేసు: ట్రావెల్ హిస్టరీ లేకపోయినా: బ్యాచిలర్ పార్టీలో
న్యూఢిల్లీ: దేశంలో ప్రమాదకరమైన మంకీపాక్స్ పాజిటివ్ కేసులు చాపకింద నీరులా విస్తరించడం మొదలు పెట్టినట్టే కనిపిస్తోంది. ఈ మహమ్మారి తొలి కేసు కేరళలో వెలుగులోకి వచ్చింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి నుంచి తిరువనంతపురానికి చేరుకున్న 35 సంవత్సరాల వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. ఆ వ్యక్తి నమూనాలను పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించగా- పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీని తరువాత మరో పాజిటివ్ కేసు కూడా అక్కడే రికార్డయింది.

ఢిల్లీలో తొలి పాజిటివ్ కేసు..
కేరళకే పరిమితమైందనుకున్న మంకీపాక్స్ పాజిటివ్ కేసులు ఇప్పుడు దేశ రాజధాని వరకూ పాకాయి. ఢిల్లీలో తొలి కేసు నమోదైంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. 31 సంవత్సరాల వయస్సున్న వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. శరీరంపై దుద్దుర్లు ఏర్పడటంతో ఆ వ్యక్తి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. మంకీపాక్స్ లక్షణాలు కనిపించడంతో వైద్య సిబ్బంది అతని నమూనాలను సేకరించి పుణెలోని వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌కు పంపించగా.. పాజిటివ్‌గా తేలింది.

ట్రావెల్ హిస్టరీ లేకపోయినా..
దీనితో ఇప్పటివరకు దేశంలో నమోదైన మంకీపాక్స్ పాజిటివ్ కేసుల సంఖ్య నాలుగుకు చేరింది. ప్రస్తుతం బాధితుడు మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీలో అడ్మిట్ అయ్యాడు. చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. అతనికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సాధారణంగా విదేశాల నుంచి వచ్చిన వారికే ఇప్పటివరకు మంకీపాక్స్ సోకింది. కేరళకు చెందిన ఇద్దరు కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వచ్చిన వారే.

బ్యాచిలర్ పార్టీ..
ఢిల్లీ పశ్చిమ ప్రాంతంలో నివసించే ఆ 31 సంవత్సరాల వ్యక్తికి విదేశాలకు వెళ్లొచ్చిన హిస్టరీ లేదు. హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీలో నిర్వహించిన ఓ బ్యాచిలర్ పార్టీకి హాజరయ్యాడని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. అతని ప్రైమరీ, సెకెండరీ కాంట్రాక్ట్‌లను కనుగొనే ప్రయత్నం చేస్తోన్నామని పేర్కొన్నారు. మనాలీలో అతను ఎవరినెవరిని కలుసుకున్నాడనే విషయంపై ఆరా తీస్తోన్నామని చెప్పారు. అతని కుటుంబ సభ్యుల నమూనాలను సేకరిస్తోన్నామని అన్నారు.

14,000కు పైగా..
కాగా మంకీపాక్స్ పాజిటివ్ కేసులు విస్తరిస్తోన్న వేగాన్ని, దాని తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ శనివారమే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 14,000కు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అమెరికాలో ఓ చిన్నారి సైతం దీని బారిన పడ్డారు. ఈ పరిస్థితుల మధ్య డబ్ల్యూహెచ్ఓ.. హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది.

గైడ్‌లైన్స్..
దేశంలో మంకీపాక్స్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ఉద్దేశించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం ఇదివరకే విడుదల చేసింది. ప్రత్యేకించి- విమాన ప్రయాణికులపై ఆంక్షలను విధించింది. ఒక చోటి నుంచి మరో చోటికి ప్రయాణం చేసే వారు- అనారోగ్యానికి గురైన వారిని, శరీరంపై గాయాలు ఉన్న వారిని కలుసుకోకూడదని సూచించింది. అటవీ జంతువులతో పాటు ఎలుకలు, ఉడతలు, కోతుల జీవించి ఉన్నా లేదా మరణించినా ఆ పరిసరాల్లో ఉండకూడదని పేర్కొంది.

తగ్గని కోవిడ్..
ఇప్పటికే ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి పూర్తిగా నిర్మూలన కావట్లేదు. రోజువారీ కొత్త కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు ఈ ఉదయం జారీ చేసిన బులెటిన్ ప్రకారం.. 24 గంటల వ్యవధిలో కొత్తగా నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 20,279గా నమోదైంది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,52,200కు చేరింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 5,26,033గా నమోదైంది.












Click it and Unblock the Notifications