Monsoon Rains: రుతుపవనాలొచ్చినా మొహం చాటేసిన వర్షాలు-ఐఎండీ తాజా అప్ డేట్.. !
దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించి నెల రోజులు గడిచిపోయింది. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి కూడా. అయితే అనుకున్న స్ధాయిలో వర్షపాతం మాత్రం నమోదు కావడం లేదు. దీంతో వర్షాల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ముఖ్యంగా రైతులు, వర్షంపైనే ఆధారపడిన వర్గాలన్నీ ఎప్పుడెప్పుడు వర్షం కురుస్తుందా అని ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐఎండీ తాజా అప్ డేట్ ఇచ్చింది.
సాధారణంగా మన దేశంలో జూన్-సెప్టెంబర్ మధ్య నైరుతి రుతుపవనాలు భారతదేశ వార్షిక వర్షపాతంలో 70 శాతం కంటే ఎక్కువ అందిస్తాయి. మే మూడవ వారంలో అండమాన్ సముద్రం మీదుగా రుతుపవనాలు దేశంలోకి ప్రవేశిస్తాయి. కేరళ ద్వారా ప్రధాన భూభాగంలోకి ప్రవేశించే వర్షాలు జూన్ 1 నాటికి దేశంలోకి విస్తరిస్తాయి. సాధారణంగా మధ్య భారతదేశం వరకు వీటి పురోగతి వేగంగా ఉంటుంది. ఆ తర్వాత అది మందగిస్తుంది. రుతుపవనాలు సాధారణంగా ఉత్తర ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, చుట్టు పక్కన ప్రాంతాలకు జూన్ చివరి నాటికి చేరుకుంటాయి. జూలై 15 నాటికి దేశం మొత్తాన్ని కవర్ చేస్తుంది.

రుతుపవనాలు ముందుగానే లేదా సకాలంలో ప్రారంభమైతే నాలుగు నెలల సీజన్‌లో దేశవ్యాప్తంగా మంచి వర్షపాతం నమోదుకు ఢోకా ఉండదు. అలాగే రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించినా మొత్తం సీజన్‌లో సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని చెప్పలేం. ఎందుకంటే జూన్ నుండి సెప్టెంబర్ వరకు దేశంలో సగటు వర్షపాతం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఈ లెక్కల ప్రకారం ఐఎండీ ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షాలే నమోదవుతాయని అంచనా వేసింది.
మే 30 కల్లా దేశంలోకి ప్రవేశించిన రుతుపవనాలు.. జూన్ 10 నాటికి అండమాన్-నికోబార్ దీవులు, కేరళ, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ, మహారాష్ట్రలోని పెద్ద ప్రాంతాలను కవర్ చేశాయి. అయితే జూన్ 11 నుండి మాత్రం రుతుపవనాలు స్తబ్దుగా ఉన్నాయి. దీంతో దక్షిణ ద్వీపకల్పంలో పొడి, వేడి పరిస్థితులు తిరిగి వచ్చేశాయి. గత వారంలో దేశవ్యాప్తంగా వర్షపాతం సగటు కంటే తక్కువగా నమోదైంది.
ఒడిశా, బెంగాల్, బీహార్, జార్ఖండ్ లో సాధారణం కేటే తక్కువ వర్షపాతం నమోదైంది. మణిపూర్, మిజోరాం, లక్షద్వీప్, నాగాలాండ్, కేరళ, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్-నికోబార్ దీవులపై పొడి పరిస్థితులు తిరిగి రావడం దేశంలో తక్కువ వర్షపాతానికి కారణమైంది. ఇప్పుడు తాజా అంచనాల ప్రకారం రుతుపవనాలు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, సిక్కిం, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్‌లో చురుకుగా ఉన్నాయి. ఈ వారం చివరి భాగంలో కొంకణ్, ఉత్తర కర్ణాటకలో ఇవి పుంజుకోనున్నాయి. కానీ దేశంలోని ఇతర ప్రాంతాలన్నీ పొడిగా ఉంటాయి.
మొత్తంమీద జూన్ లో దేశవ్యాప్త వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ముగుస్తుందని ఐఎండీ అంచనా.












Click it and Unblock the Notifications