ఆరేళ్లలో బెంగళూరుకు ఇదే దారుణమైన జూలై..! ఎలాగో తెలుసా ?
కర్నాటక రాజధాని బెంగళూరులో ఈ జూలై దారుణంగా గడిచిందట. అది కూడా మామూలుగా కాదు గత ఆరేళ్లలోనే తొలిసారిగా ఇలా జరిగిందట. అసలే దేశ ఐటీ హబ్ గా పేరున్న బెంగళూరు నగరం ఇలా ఆరేళ్లలో తొలిసారి ఇలా జూలై నెలలో అల్లాడిపోయిందని నిపుణులు తాజా నివేదికలో వెల్లడించారు. దీంతో రాబోయే రోజులపై బెంగళూరు వాసులు గంపెడాశలతో ఉన్నారు.
కర్నాటకలోని బెంగళూరు అర్బన్, బెంగళూరు రూరల్ తో పాటు మరో 10 జిల్లాల్లో ఈసారి జూలైలో అత్యల్ప వర్షపాతం నమోదైందట. ప్రతీ ఏటా జూలైలో నమోదయ్యే సాధారణ వర్షపాతంతో పోలిస్తే ఏకంగా నాలుగో వంతు వర్షపాతం తగ్గిపోయిందట. వాస్తవానికి ప్రతీ ఏటా జూలైలో బెంగళూరులోని రెండు జిల్లాలతో పాటు మరో 10 జిల్లాల్లో సగటు వర్షపాతం 116.4 మిల్లీ మీటర్లు నమోదవుతుండగా.. ఈసారి మాత్రం అది ఏకంగా 87.5 మిల్లీ మీటర్లకు పడిపోయింది.

2019 తర్వాత జూలై నెలలో ఇంత తక్కువ వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. కర్నాటక రాష్ట్ర విపత్తుల పర్యవేక్షణ కేంద్రం (కేఎస్ఎన్డీఎంసీ) తాజా రిపోర్టు ఆధారంగా ఈ విషయం తెలిపారు. ఈ మేరకు జిల్లాల వారీగా విడుదల చేసిన జూలై వర్షపాతం సమాచారం ఆధారంగా దీన్ని నిర్ధారించారు. అయితే ఇలాంటి పరిస్ధితులు సాధారణమేనని వారు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం చెబుతోంది.

అయితే బెంగళూరు, ఇతర జిల్లాల్లో ఇలా జూలై నెలలో అత్యల్ప వర్షపాతం నమోదు కావడం తీవ్ర ప్రభావమే చూపుతోంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో నీటి కష్టాలు కనిపిస్తున్నాయి. అలాగే రైతులు పంటలు వేసుకునే సమయం కావడంతో దానిపైనా ప్రభావం పడుతోంది. అయితే రాబోయే రోజుల్లో సాధారణ వర్షపాతం ఉంటుందన్న వార్తలు మాత్రం వీరికి కాస్త ఊరటనిస్తున్నాయి. మారుతున్న వాతావరణ పరిస్దితుల ప్రభావం ఈసారి ఆయా జిల్లాలపై కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications