వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాంటిస్సోరి స్కూల్: గాంధీ మెచ్చారు.. ఠాగూర్ స్కూళ్లు పెట్టారు - పిల్లలకు ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన విద్యా విధానం ఇదేనా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

ధనవంతులు, ప్రసిద్ధుల విజయ రహస్యాలు ఏమిటనేది చూడటం ఎప్పుడూ ఉత్సాహంగానే ఉంటుంది.

సుప్రసిద్ధ నవలా రచయిత గాబ్రియేల్ గార్సియా మార్క్వెజ్, సింగర్ టేలర్ స్విఫ్ట్, గూగుల్ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్‌లకు ఉన్న ఉమ్మడి లక్షణం ఏంటి?

సమాధానం ఏంటంటే వారందరూ చిన్నపిల్లలుగా ఉన్నపుడు మాంటిస్సోరి పాఠశాలల్లో చదివారు.

భారత స్వాతంత్ర్యోద్యమ నాయకుడు మహాత్మా గాంధీ ఈ విద్యా విధానానికి అభిమాని. "వారు ఆడుకున్నట్లే నేర్చుకుంటారు. అందుకే ఆ ప్రక్రియలో వారిపై ఎటువంటి భారం పడదు" అని మాంటిస్సోరి విధానంలో బోధన గురించి గాంధీ వివరించారు.

రవీంద్రనాథ్ ఠాగూర్, నోబెల్ బహుమతి పొందిన రచయిత. పిల్లల సృజనాత్మక వ్యక్తీకరణను బయటికి తీసుకురావడానికి మాంటిస్సోరి పాఠశాలల వ్యవస్థను స్థాపించారు.

ఇటాలియన్ వైద్యురాలు, విద్యావేత్త అయిన మరియా మాంటిస్సోరి తన ప్రసిద్ధ సూత్రాలతో దీనిని రూపొందించారు. ఇది ఒక శతాబ్దానికి పైగా కొనసాగుతోంది.

మాంటిస్సోరీ పిల్లలను స్వయంప్రతిపత్తిని అభివృద్ధి చేయడానికి ప్రోత్సహించారు. ఆమె తన కలల సాధనలో ఫాసిస్ట్ పాలనను ధిక్కరించిన తొలి స్త్రీవాది. ఆమె కథ స్ఫూర్తిదాయకం.

ప్రపంచవ్యాప్తంగా మాంటిస్సోరి పద్ధతిని ఉపయోగిస్తున్న పాఠశాలలు ఇప్పుడు కనీసం 60,000 వరకు ఉన్నాయి.

అయితే మాంటిస్సోరి విద్యా విధానం ద్వారా లభించే ప్రయోజనాల గురించి ఎల్లప్పుడూ చర్చ జరుగుతూనే ఉంది. తరగతి గదిలో సైంటిఫిక్ రీసెర్చ్ నిర్వహించడంలో ఎదురయ్యే ఇబ్బందులు ఇందుకు కొంత కారణం. దీనివల్ల ఈ విద్యా విధానాన్ని కొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

ఇటీవలే పరిశోధకులు ఈ సమస్యల్లో కొన్నింటిని పరిష్కరించగలిగారు. వారి సూత్రీకరణలు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు అందరికీ ఆసక్తి కలిగిస్తాయి.

మాంటిస్సోరి

ఈ పాఠశాల ఐడియా ఎలా వచ్చింది?

మాంటిస్సోరి 1870లో చియారవల్లె‌ ఇటాలియన్ మునిసిపాలిటీలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు ప్రగతిశీలవాదులు. దేశంలోని ప్రముఖ మేధావులు, పండితులను తరచుగా కలుస్తూ ఉండేవారు.

ఇలాంటి కుటుంబ వాతావరణం మాంటిస్సోరీకి ఆ కాలంలో ఇతర యువతుల కంటే అనేక ప్రయోజనాలను అందించింది.

"ఆమె ప్రాథమిక విద్య తర్వాత టెక్నికల్ స్కూల్‌లో చేర్పించడంలో ఆమె తల్లి మద్దతు చాలా ముఖ్యమైంది" అని ఇటలీలోని రోమ్‌లో ఒపెరా నేజనాలే మాంటిస్సోరి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యుడు ఎలిడే తవియాని తెలిపారు.

మాంటిస్సోరి తన విద్యా పద్ధతుల మీద పరిశోధించడానికి, వాటిని ప్రోత్సహించడానికి స్వయంగా ఈ సంస్థను స్థాపించారు.

అప్పటికి పూర్తిగా పురుషుల ఆధిపత్యంలో ఉన్న మెడిసిన్ చదవాలనే ఆమె నిర్ణయానికి ఆమె తల్లిదండ్రులు మద్దతు ఇచ్చారు.

''మరియా మాంటిస్సోరి కుటుంబం.. స్త్రీ విముక్తి కోసం పోరాటం సహా అనేక సామాజిక సమస్యల పట్ల సున్నితంగా ఉండేది. మాంటిస్సోరి పెద్దయ్యాక ఈ పోరాటాన్ని కొనసాగించారు’’ అని తవియాని చెప్పారు.

మాంటిస్సోరి గ్రాడ్యుయేట్ అయిన వెంటనే 1896లో రోమ్ విశ్వవిద్యాలయంలోని మానసిక రోగులకు చికిత్స అందించే క్లినిక్‌లో స్వచ్ఛంద సహాయకురాలిగా చేరారు.

అక్కడ ఆమె నేర్చుకోవడంలో ఇబ్బందులు పడుతున్న పిల్లలను చూసుకునేవారు. అక్కడ గదులు ఖాళీగా ఉండేవి. కొన్ని కుర్చీలు, బల్లలు తప్ప ఏమీ ఉండేవి కాదు.

ఒక రోజు పిల్లలు నేలపై పడిపోయిన బ్రెడ్‌క్రంబ్స్‌తో ఉత్సాహంగా ఆడుతుండగా మాంటిస్సోరి గమనించారని కేథరీన్ ఎల్ ఎక్యూయర్ తెలిపారు.

స్పెయిన్‌లోని నవర్రా విశ్వవిద్యాలయంలో సైకాలజీలో పరిశోధకురాలు కేథరీన్ ఎల్ ఎక్యూయర్. ది వండర్ అప్రోచ్ రచయిత కూడా .

"పిల్లల్లో మేథో సంపత్తి లేకపోవడానికి వారి పేదరికం కూడా కారణం కావచ్చునని ఆమె భావించారు. సరైన నేర్పించే మెటీరియల్ ఉంటే పిల్లలు, యువత తెలివితేటల్ని పెంచొచ్చని మాంటిస్సోరికి అర్థమైంది" అని కేథరీన్ అన్నారు.

ఇది కొత్త మాంటిస్సోరీ విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయడానికి దారి తీసింది. బాల్యంలోని పిల్లలకు కావాలసిన ఉత్తేజం అందించడానికి ఏర్పడింది.

మొదటి మాంటిస్సోరి పాఠశాల ఎక్కడ ఏర్పాటు చేశారు?

అన్ని శిక్షణ పరికరాలన్నీ పిల్లలకు తగిన సైజులో ఉండాలని, అన్ని ఇంద్రియాలను ఆకర్షించేలా రూపొందించాలని మాంటిస్సోరి ముఖ్య ఉద్ధేశం.

ప్రతి విద్యార్థి స్వేచ్ఛగా వ్యవహరించడానికి అనుమతి ఉండాలి. వారి సృజనాత్మకత, సమస్య పరిష్కార నైపుణ్యాలను ఉపయోగించేలా ఉండాలి.

ఉపాధ్యాయులు గైడ్‌ల పాత్రను పోషించాలి. పిల్లలను బలవంతపెట్టకూడదు.

మాంటిస్సోరి 1907లో తన మొదటి "కాసా డీ బాంబినీ" (చిల్డ్రన్స్ హౌస్) తెరిచారు. తర్వాత అలాంటివి చాలా ప్రారంభమయ్యాయి.

కాలక్రమేణా ఆమె గాంధీతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దార్శనికులతో కూడా సంబంధాలను ఏర్పరచుకున్నారు.

1922లో ఇటలీలో ఫాసిస్టులు మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు మాంటిస్సోరి ఉద్యమాన్ని స్వాగతించారు. కానీ అనతి కాలంలోనే వారు.. పిల్లల భావ ప్రకటనా స్వేచ్ఛను వ్యతిరేకించారు.

''మాంటిస్సోరి విలువలు పిల్లలు, మహిళల హక్కులు, గౌరవంతో ముడిపడి ఉండేవి. అయితే ఫాసిస్టులు ఆమె పనిని, కీర్తిని ఉపయోగించుకోవాలని అనుకున్నారు" అని తవియాని అభిప్రాయపడ్డారు.

ఫాసిస్ట్ పాలన‌ పాఠశాలల విద్యా వ్యవస్థను ప్రభావితం చేయడానికి ప్రయత్నించింది. దీంతో 1934లో మాంటిస్సోరి, ఆమె కుమారుడు ఇటలీ విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు.

ఆమె 1947లో మాత్రమే తన స్వదేశానికి తిరిగి వచ్చారు. 1952లో (81 సంవత్సరాల వయస్సు) ఆమె మరణించే వరకు మాంటిస్సోరి పద్ధతి, అభివృద్ధి గురించి రాస్తూనే ఉన్నారు.

మాంటిస్సోరి స్కూల్

ఇప్పుడున్న పాఠశాలలన్నీ వారివేనా?

నేడు అనేక రకాల మాంటిస్సోరి పాఠశాలలు ఉన్నాయి. ఇవన్నీ ఒపెరా మాంటిస్సోరి గుర్తింపు పొందినవి కావు. కానీ వీటిలో కొన్ని ప్రాథమిక సూత్రాలు అలాగే ఉన్నాయి.

అందులో ఒకటి.. ఉపాధ్యాయులు సున్నితమైన మార్గదర్శకులుగా ఉండటం. పెద్దల జోక్యం వీలైనంత తక్కువగా ఉంటూ, సొంతంగా వర్క్ పూర్తి చేసేలా పిల్లలను ప్రోత్సహించడం.

"మా పాఠశాల పిల్లలు సొంతంగా నేర్చుకుంటారు" అని సిసిలీలోని పలెర్మోలోని ఎకోస్క్యూలా మాంటిస్సోరి ప్రధాన ఉపాధ్యాయుడు మిరియం ఫెర్రో అంటున్నారు.

పిల్లలను ఆరేళ్ల వరకు అలా చేసేలా ప్రోత్సహిస్తారు. ఎకోస్క్యూలాలోని కొన్ని సబ్జెక్టులు ఇతర ప్రీ-స్కూల్‌లలోని గణితం, సంగీతం లాంటి వాటిని పోలి ఉంటాయి.

ఇందులో "ప్రాక్టికల్ లైఫ్" అని పిలిచే ఒక విభాగం కూడా ఉంది. ఇది మాంటిస్సోరి పిల్లల స్వయంప్రతిపత్తిని ప్రోత్సహిస్తుంది.

వీటిలో వారి సహ విద్యార్థులకు పానీయాలు అందించడం వంటి నిజ-జీవిత ఆచరణాత్మక పనులు కూడా ఉంటాయి.

భద్రత దృష్ట్యా టీచర్స్ నీటిని మరిగించే బాధ్యతను తీసుకుంటారు. పిల్లలు మాత్రం తరగతి గదుల ఉపరితలాన్ని శుభ్రపరచడం, పానీయాలను ఇతరులకు అందించడంలో క్రియాశీల పాత్రలు పోషిస్తారు.

"అల్పాహారం, మధ్యాహ్న భోజనం సమయంలో పిల్లలు సొంతంగానే పనులు చేసుకుంటారు. టేబుల్ వేసుకుంటారు, వారి క్లాస్‌మేట్‌లకు వడ్డిస్తారు" అని ఫెర్రో అంటున్నారు.

మాంటిస్సోరి

మాంటిస్సోరి ప్రత్యేకత ఏంటి?

మాంటిస్సోరి వ్యవస్థ.. పిల్లలకు స్వాతంత్రంగా వ్యవహరించటంతో పాటు సాయం చేయడాన్నీ ప్రోత్సహిస్తుంది. వివిధ వయస్సుల పిల్లలు ఒకే తరగతిలో చదువుకుంటారు.

ఉదాహరణకు ఆరు సంవత్సరాల పిల్లలు మూడేళ్ల పిల్లలకు సాయం చేయవచ్చు.

విద్యార్థుల మధ్య పోటీ నివారించడానికి పరీక్షలు, గ్రేడ్‌లు ఇవ్వరు. ప్రతి సెషన్ 3 గంటల నిడివితో ఉంటుంది. పిల్లలు తాము చేస్తున్న పనిలో మునిగిపోయేలా ఇది ఉంటుంది.

పిల్లలు తమ వేలితో గుర్తించగలిగే ఇసుక అట్టతో తయారు చేసిన అక్షరాలు, సంఖ్యలు వంటివి దీనిలో ఉంటాయి. వీటిని పిల్లలు నేర్చుకునేలా శిక్షణ మెటిరీయల్ రూపొందించారు.

మాంటిస్సోరి విద్య ఎంత ఉల్లాసంగా, తెలివిగా అనిపించినా సాధారణ తరగతి గదిలో కనిపించే వాటి కంటే స్పష్టమైన ప్రయోజనాలను ఇస్తుందా?

ఇది సింఫుల్ క్వశ్చన్‌లా అనిపించవచ్చు, కానీ సమాధానం చెప్పడం చాలా కష్టం.

మాంటిస్సోరి విద్యతో నిర్దిష్ట అంశాలలో ప్రయోజనాలు ఉండవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే.. ఏదైనా ఒకటి పని చేస్తుందో లేదో తెలుసుకోవడానికి ఉపయోగించే ప్రామాణిక శాస్త్రీయ ప్రక్రియను తరగతి గదికి వర్తింపజేయడం కష్టం.

ఏంజెలిన్ లిల్లార్డ్ చార్లెట్స్‌విల్లేలోని వర్జీనియా విశ్వవిద్యాలయంలో సైకాలజీ ప్రొఫెసర్. అమెరికాలోని మిల్‌వాకీలోని ఒక మాంటిస్సోరి స్కూల్‌ను ఏంజెలిన్ పరిశీలించారు.

అక్కడి పాఠశాలకు దరఖాస్తు చేసుకున్న పిల్లలను లాటరీ విధానంలో ఎంపిక చేశారు.

అక్షరాస్యత, నైపుణ్యాలలో విద్యార్థుల ముందంజ

ఐదేళ్ల వయస్సులో వారి పురోగతిని విశ్లేషిస్తూ ఇతర పాఠశాలల పిల్లలతో పోలిస్తే మాంటిస్సోరి పాఠశాలకు వెళ్లిన పిల్లలు మెరుగైన అక్షరాస్యత, సంఖ్యాశాస్త్రం, కార్యనిర్వాహక పనితీరు, సామాజిక నైపుణ్యాలను కలిగి ఉన్నారని లిల్లార్డ్ కనుగొన్నారు.

12 సంవత్సరాల వయస్సులో వారు మెరుగైన కథలు చెప్పే సామర్ధ్యం కలిగి ఉన్నారని తెలుసుకున్నారు.

ఈ ఫలితాలు సానుకూలంగా ఉన్నప్పటికీ ఇది కొద్దిమంది విద్యార్థుల ఆధారంగా విశ్లేషించిందని గుర్తుంచుకోవాలి.

యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ లండన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లోని క్లో మార్షల్ మాట్లాడుతూ.. లిల్లార్డ్ ఫలితాలు ఇంకా అత్యంత కఠినమైన పరీక్షను అందించాయన్నారు.

అయితే.. పిల్లలకు కొంత సమయాన్ని అందించడం, పెద్దల నుంచి ఎక్కువ జోక్యం లేకుండా వారి సొంత కార్యకలాపాలను కొనసాగించేలా చేయడం లాంటివి మితిమీరిన స్వాతంత్య్రానికి దారితీస్తుందని ఇటీవల కొన్ని ఆధారాలు ఉన్నాయి.

కానీ ఈ విధానం మాంటిస్సోరి పద్ధతికి గుండె లాంటిది.

మాంటిస్సోరి విద్యా వస్తువులను మాత్రమే ఉపయోగించే తరగతి గదులలోని పిల్లలు ఇతర రకాల విద్యా వస్తువులతో కూడిన తరగతి గదుల పిల్లల కంటే మెరుగ్గా పని చేస్తారనడానికి కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి.

మాంటిస్సోరి ప్రత్యేకమైన డిజైన్ పిల్లలకు ప్రారంభంలో నేర్చుకోవడానికి ప్రయోజనంగా ఉంటుందని సూచిస్తోంది.

స్విట్జర్లాండ్‌లోని సెంటర్ హాస్పిటలియర్ యూనివర్సిటైర్ వాడోయిస్‌లో న్యూరో సైంటిస్ట్, మాజీ మాంటిస్సోరి టీచర్ అయిన సోలాంజ్ డెనర్‌వాడ్ కూడా ఈ విషయంలో సానుకూలంగా ఉన్నారు.

ఇటీవలి అధ్యయనంలో మాంటిస్సోరి పాఠశాలలకు హాజరయ్యే పిల్లలు ఎక్కువ సృజనాత్మకతను కలిగి ఉంటారని సోలాంజ్ కనుగొన్నారు. ఇది మెరుగైన విద్యా ఫలితాలతో ముడిపడి ఉన్నట్లు అనిపించిందని తెలిపారు.

మాంటిస్సోరి

మాంటిస్సోరి బ్రాండ్‌ను విస్తరిస్తున్న వారసులు

పిల్లలకు చిన్న వయస్సు నుంచే వారి అభ్యాస కార్యకలాపాలు చూసుకునే అనుభవం ద్వారా సమస్యలకు వారి సొంత పరిష్కారాలను కనుగొనడం, వారి తప్పుల నుంచి నేర్చుకునే అవకాశం పెరగడం వల్ల ప్రయోజనాలు లభిస్తాయని డెనర్వాడ్ భావించారు.

ఇవన్నీ మరింత సరళమైన ఆలోచనలను ప్రోత్సహించనున్నాయి.

"ప్రయత్నం చేయడానికైనా తప్పులు చేయడానికైనా ఇది సురక్షితమైన ప్రదేశం" అని డెనర్‌వాడ్ భావిస్తున్నారు .

మాంటిస్సోరి పూర్వ విద్యార్థుల విజయాలు దీనిని ప్రతిబింబిస్తుందా? అంటే దీర్ఘ-కాల ప్రయోజనాలపై నమ్మదగిన సాక్ష్యం లేనందున, మేం ఎటువంటి జడ్జిమెంట్‌కు రావడం లేదని మార్షల్ అంటున్నారు.

అయితే డెనర్వాడ్ మరింత సానుకూలంగా ఉన్నారు. ఫలితాల ఆధారంగా సృజనాత్మక ఇండస్ట్రీలలో ప్రజలు దూసుకెళడానికి మాంటిస్సోరి విద్య సాయపడుతుందని డెనర్వాడ్ నమ్ముతున్నారు.

"పాఠశాలలో ఉన్నప్పుడే మీరు మైండ్ ఆర్కిటెక్చర్ నిర్మించుకుంటారు" అని ఆమె చెబుతున్నారు.

చిన్న వయస్సులో స్వయంగా చేసుకోవడం, సహకరించడం నేర్చుకున్న వ్యక్తులు తరువాత జీవితంలో ప్రయోజనం పొందుతారని డెనర్వాడ్ అభిప్రాయం వ్యక్తంచేశారు.

మాంటిస్సోరి పద్ధతి నిజమైన ప్రయోజనాలు ఏమైనప్పటికీ దాని ఆలోచన ఖచ్చితంగా ఆకర్షణీయంగా ఉంటుంది.

వారు మాత్రం సంప్రదాయ విద్య నుంచి విముక్తి కల్పించేలా మాంటిస్సోరిని మార్కెటింగ్ చేయడంలో విజయాన్ని సాధించారు.

మరియా మాంటిస్సోరి తన పద్ధతిని ప్రచారం చేయడంలో అలసిపోలేదు. ఆమె వారసులు కూడా దాన్ని ప్రపంచానికి విస్తరిస్తూనే ఉన్నారు.

"ఇది అయితే ప్రమాదవశాత్తు కాదు. ఒక 'బ్రాండ్'గా మారింది" అని పలెర్మో విశ్వవిద్యాలయంలో సంకేతాలు, చిహ్నాల అధ్యయనానికి సంబంధించిన సెమియోటిక్స్ ప్రొఫెసర్ జియాన్‌ఫ్రాంకో మర్రోన్ అభివర్ణించారు.

ఆయన 1980ల నుంచి మాంటిస్సోరి బ్రాండ్లు, మార్కెటింగ్ పెరుగుదలను చూపిస్తూ అది విద్యా సంస్థల విస్తరణకు ఎలా ఉపయోగపడ్డాయో నొక్కి చెబుతున్నారు.

మాంటిస్సోరి అనే పేరు ఇప్పుడు అధిక నాణ్యత గల విద్యతో ముడిపడి ఉంది. అంతేకాదు చాలా మంది తల్లిదండ్రులను ఆకర్షించిన లైఫ్ ఫిలాసఫీతో కూడా ముడిపడి ఉంది.

పేరుకు మాత్రమే మాంటిస్సోరి..

అయితే నేడు చాలా పాఠశాలలు మరియా మాంటిస్సోరి పేరుతో ఉన్నాయి. అది ట్రేడ్ మార్కు కానందున మరియా పద్ధతులకు మాత్రమే పాఠశాలలు కట్టుబడి ఉన్నాయి.

ఉపాధ్యాయ శిక్షణ, గుర్తింపును అందించే అధికారిక మాంటిస్సోరి సంస్థలు వివిధ దేశాల్లో ఉన్నప్పటికీ పాఠశాలలు తమ ప్రకటనలలో ఈ పదాన్ని ఉపయోగించాల్సిన అవసరం లేదు.

"ప్రామాణికమైన మాంటిస్సోరి విద్యను కనిపెట్టడం చాలా కష్టం" అని ఎల్ క్యూయర్ అంటున్నారు.

కొన్ని పాఠశాలలు పిల్లల స్వయం ప్రతిపత్తి లేదా లెర్నింగ్ సెషన్‌లకు సంబంధించిన సూత్రాలను పట్టించుకోకుండా కేవలం ట్రెండ్‌ను మాత్రమే ఫాలో అవుతున్నాయని ఆందోళన చెందుతున్నారు.

ఇవి ముఖ్యమైన ఫలితాలను ప్రభావితం చేస్తాయి. ఈ సిస్టం వర్తింపజేయడంలో స్థిరత్వం లేకపోవడం వల్ల మాంటిస్సోరి ప్రయోజనాలలో వైవిధ్యం ఎందుకు ఉందో వివరించవచ్చు.

ఇతర విద్యా వ్యవస్థల పద్దతుల్లో ప్రయోజనాలను గమనించడంలోనూ కొన్ని వైఫల్యాలు కూడా ఉన్నాయి.

మార్షల్ ఈ మార్పులపై మరింత చిత్తశుద్ధితో ఉన్నారు.

విభిన్న విధానాలు కొన్నిసార్లు మాంటిస్సోరి పద్ధతి అంచనాలను వక్రీకరించగలవని మార్షల్ అంగీకరిస్తున్నారు.

ఇది సామాజిక, సాంకేతిక మార్పులకు అనుగుణంగా కూడా ఉండవచ్చని ఆమె గుర్తించారు.

ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకోండి, విద్యలో వాటి ఉపయోగాలను తెలుసుకోండి లాంటివి ఆమె రాసినవి కావు.

మాంటిస్సోరి తన మొదటి పాఠశాలను ప్రారంభించి 100 సంవత్సరాలకు పైగా గడిచినా విద్యావేత్తలు ఇప్పటికీ ఆమె సిద్ధాంతాలతో కుస్తీ పడుతున్నారు.

మాంటిస్సోరి పనికి ఇది నిదర్శనం. ఇటీవలి ఫలితాలను చూస్తే మరో శతాబ్దం పాటు ఇదే ధోరణి కొనసాగవచ్చు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Montessori School: Gandhi praised.. Tagore established Schools - Is this the most effective education system in the world for children?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X