అప్పుడే కరోనా అంతం: హర్ష వర్ధన్ కీలక వ్యాఖ్యలు -కామన్వెల్త్ దేశాల ఆరోగ్య మంత్రుల 33వ భేటీలో
అడ్డూ అదుపు లేకుండా విస్తరిస్తోన్న కరోనా వైరస్ గడిచిన 14 నెలలుగా భూగోళాన్ని వణికిస్తూనే ఉన్నది. గురువారం నాటికి గ్లోబల్ గా మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 16.60కోట్లకు పెరగ్గా, మొత్తం మరణాల సంఖ్య 34.40లక్షలకు చేరింది. వైరస్ కు విరుగుడు వ్యాక్సిన్లు మాత్రమేనని దాదాపుగా రుజువు కావడంతో ధనిక దేశాలన్నీ తమకున్న వనరుల ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయగా, భారత్ లాంటి అభివృద్ధి చెందుతోన్న దేశాలు, ఇతర పేద దేశాలు వ్యాక్సిన్ల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ దశలో.
కరోనా మహమ్మారి అంతం కావాలంటే మరిన్ని కోవిడ్ వ్యాక్సిన్లను అభివృద్ధి పరచాల్సిన ఆవశ్యకత ఉందని భారత ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అభిప్రాయపడ్డారు. ఆ వ్యాక్సిన్ల సమర్థత పరీక్షించిన తర్వాత ప్రపంచం మొత్తానికి వాటిని అతి వేగంగా పంపిణీ చేయాలని పేర్కొన్నారు. గురువారం కామన్వెల్త్ దేశాల ఆరోగ్య శాఖా మంత్రుల 33 వ సమావేశాల్లోవర్చువల్ పద్ధతిలో ఆయన ప్రసంగించారు.

కరోనా అంతానికి డబ్ల్యూహెచ్‌వో సారథ్యంలో అన్ని దేశాలూ క్షేత్ర స్థాయిలో సమన్వయంతో పనిచేస్తున్నాయని, వ్యాక్సిన్ ఉత్పత్తికి, అభివృద్ధికి, అందరికీ అందుబాటులోకి రావడానికి కృషి చేస్తున్నారని హర్ష వర్ధన్ పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 2021 నాటికి 2 బిలియన్ల వ్యాక్సిన్లను ఉత్పత్తి లక్ష్యంగా 'కోవ్యాక్స్' ముందుకు సాగుతోందని తెలిపారు.

అందరికీ ఆరోగ్యం అందించాలన్న లక్ష్యంతోనే భారత్ అడుగులు వేస్తోందని, ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం కింద ఈ దిశగా వెళ్తున్నామని గుర్తుచేసిన మంత్రి హర్ష వర్ధన్.. జాతీయ టెలిమెడిసిన్ ప్లాట్‌ఫాం 'ఈ సంజీవని ఓపీడీ' కింద 14 నెలల స్వల్ప వ్యవధిలో 5 మిలియన్లకు పైగా సంప్రదింపులకు వీలు కల్పించినట్లు తెలిపారు. 'వసుదైవ కుటుంబకం' అన్న సూత్రాన్ని తాము శతధా విశ్వసిస్తున్నామని, అందుకే 'వ్యాక్సిన్ మైత్రి' కింద ఇతర దేశాలకు వ్యాక్సిన్లను పంపామని హర్షవర్ధన్ ప్రకటించారు.












Click it and Unblock the Notifications