భారత్*చైనా సంబంధాలు క్లిష్ట పరిస్థితుల్లో, గాల్వన్ ఘటనతో సెంటిమెంట్ మారింది: జైశంకర్
న్యూఢిల్లీ: భారత్, చైనా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. సరిహద్దులో శాంతిని నెలకొల్పే లక్ష్యంతో కుదిరిన ఒప్పందాలను చైనా ఉల్లంఘిస్తోందని అన్నారు. ఇరు దేశాల సంబంధాలు క్లిష్ట దశను ఎదుర్కొంటున్నాయని వెల్లడించారు. బుధవారం ఆస్ట్రేలియాకు చెందిన లోఈ ఇనిస్టిట్యూట్ నిర్వహించిన ఆన్‌లైన్ సమావేశం జైశంకర్ పాల్గొని మాట్లాడారు.
Recommended Video
భారత్-చైనా మధ్య కుదిరిన ఒప్పందాలను డ్రాగన్ దేశం ఉల్లంఘిస్తోందని జైశంకర్ మండిపడ్డారు. చైనా సరిహద్దు వెంబడి వేల సంఖ్యలో సైన్యాన్ని మోహరించడంపై ఆ దేశం ఐదు పొంతనలేని సమాధానాలు ఇచ్చిందని తెలిపారు. ఈ వైఖరి రెండు దేశాల సంబంధాలు తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయన్నారు.

గత 30-40 ఏళ్లకంటే ప్రస్తుతం చైనాతో సంబంధాల విషయంలో క్లిష్టమైన దశలో ఉన్నామనుకుంటున్నట్లు జైశంకర్ తెలిపారు. ఇరు దేశాల సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, వాటిని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడం అతిపెద్ద విషయమని చెప్పారు. విభేదాలున్నప్పటికీ ఇంతకాలం సరిహద్దులో మాత్రం ప్రశాంతతను కొనసాగించామన్నారు. చైనా.. మనదేశానికి రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించిందని గుర్తు చేశారు.
గాల్వాన్ ఘటనలో భారత్ వైపు 20 మంది సైనికులు అమరులైన విషయం తెలిసిందే. చైనా కుట్రపూరితంగా దాడి చేసి భారత జవాన్లను బలితీసుకుంది. 1975 తర్వాత నుంచి వాస్తవాధీన రేఖ వద్ద ఈ స్థాయిలో స్థానికులు మరణించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గాల్వన్ ఘటనతో చైనాపై వ్యతిరేకత కూడా బాగా పెరిగింది. గాల్వాన్ దాడి ఘటన దేశ ప్రజల భావోద్వేగంలో మార్పుకు కారణమైందని కేంద్రమంత్రి జైశంకర్ తెలిపారు. కాగా, సరిహద్దు ఉద్రిక్తల కారణంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధంలో ప్రమాదంలో పడ్డాయని గత సెప్టెంబర్ నెలలో జైశంకర్ చైనా విధేశంగా మంత్రికి స్పష్టం చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications