Mothers Day 2022: సృష్టికి మూలం అమ్మ; జన్మనిచ్చిన తల్లి కోసం ఇవి చెయ్యండి చాలు!!
అమ్మదనమున ఎంత కమ్మదనం ఉందిరా.. అమృతమ్ముకే ఆమె తీపి నేర్పింది రా.. అన్నారో మహాకవి. సృష్టికర్త అయిన బ్రహ్మను కూడా సృష్టించింది ఓ అమ్మేనని చెప్తారు. అటువంటి అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. మానవులకు తెలిసిన అన్ని సంబంధాలలో, అన్నిటినీ అధిగమించే ఓ గొప్ప సంబంధం తల్లీబిడ్డల సంబంధం. సృష్టిలో నిష్కల్మషమైన ప్రేమకు ప్రతిరూపం అమ్మ. అలాంటి తల్లులందరి కృషిని గుర్తు చేస్తూ, పిల్లల కోసం వారు చేసే త్యాగాలను గుర్తు చేసుకుంటూ జరుపుకునే మదర్స్ డే గురించి వన్ ఇండియా ప్రత్యేకం.

పిల్లల విజయంలో తల్లిది కీలక భూమిక
తల్లికి తన పిల్లల పట్ల ఉండే అంతులేని ప్రేమ, వారి అభ్యున్నతి కోసం ఆ తల్లి చేసే త్యాగం, పిల్లల పట్ల, కుటుంబం పట్ల తల్లికి ఉండే అంకితభావానికి కొలమానం లేదు. బిడ్డ పుట్టినప్పటి నుండి పెరిగి పెద్ద వారై, వాళ్ల బిడ్డలు పెద్దవాళ్లు అవుతున్నా కూడా తల్లికి బిడ్డల పట్ల అంతే ప్రేమ ఉంటుంది. కన్న బిడ్డలు కష్టపడుతున్నారు అంటే ముందు విలవిలలాడేది అమ్మ మాత్రమే. మదర్స్ డే అనేది తల్లులందరికీ ప్రత్యేకమైన రోజు. ప్రతి తల్లి తన పిల్లల విజయంలో లెక్కించలేని కీలక భూమిక పోషిస్తుంది. నిస్వార్థమైన సహకారాన్ని అందించేది ఒక్క అమ్మే.

మే 8 వ తేదీన మదర్స్ డే
ప్రపంచంలోని అనేక దేశాలలో మదర్స్ డే జరుపుకుంటారు. మదర్స్ డే మనల్ని కని, పెంచి, పెద్ద చేసిన తల్లికి ధన్యవాదాలు తెలిపే రోజు కూడా . భారతీయ సంస్కృతి ఎల్లప్పుడూ తల్లులకు ప్రత్యేక స్థానాన్ని నొక్కి చెబుతుంది అయితే, అన్ని దేశాల్లోనూ మదర్స్ డే ను ఒకే రోజు జరుపుకోరు. అనేక దేశాలలో, ఇది మేలో రెండవ ఆదివారం జరుపుకుంటారు. భారతదేశంలో మదర్స్ డే ప్రతి సంవత్సరం మే నెలలో రెండో ఆదివారం నాడు జరుపుకుంటారు. ఈ సంవత్సరం మదర్స్ డే మే 8వ తేదీన వచ్చింది.

1900ల ప్రారంభంలోనే మదర్స్ డే జరుపుకోవాలనే ఆలోచన
ఇక మదర్స్ డే విషయానికి వస్తే మదర్స్ డే జరుపుకోవాలనే ఆలోచన మొదట 1900 ప్రారంభంలో వచ్చింది. కొన్ని కథనాలు 1908లో అమెరికాలో అన్నా జార్విస్ అనే మహిళ మొదటగా మూడు సంవత్సరాల క్రితం మరణించిన తన తల్లి జ్ఞాపకార్థం మదర్స్ డేని జరుపుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నాయి. కొన్ని సంవత్సరాలలో, యూఎస్ లోని అనేక ప్రాంతాలు ఈ రోజును జరుపుకోవడం ప్రారంభించాయి. 1914లో అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ దీనిని జాతీయ సెలవు దినంగా ప్రకటించారు. ఇక అప్పటినుండి మదర్స్ డే ను ఘనంగా జరుపుతున్నారు.

జన్మనిచ్చిన అమ్మకు జీవితాంతం రుణపడి ఉండాలి
ప్రపంచవ్యాప్తంగా మదర్స్ డే ను ఎప్పుడు జరుపుకున్నా, అందరూ తమ తల్లిని సంతోషంగా ఉంచేందుకే ప్రయత్నిస్తారు. వారు అమ్మలను బహుమతులతో ఆశ్చర్యపరుస్తారు. తల్లి పట్ల వారికున్న ప్రేమను వ్యక్తం చేస్తారు. అమ్మ మనసు తెలుసుకుని, అమ్మకు ఇష్టమైనవి ఇచ్చి ఆమెను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తారు. అయితే ఒక్క మదర్స్ డే నాడు మాత్రమే కాకుండా ఎప్పటికీ జన్మనిచ్చిన తల్లి పట్ల కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. ఆమె పట్ల ప్రేమ కేవలం మదర్స్ డే వరకే పరిమతం కాకూడదు. అది ఎప్పటికీ ఉండాలి.

అమ్మకు చేదోడు వాదోడుగా చిన్న చిన్న పనుల్లో సహాయం చేస్తే చాలు
ఈ మదర్స్ డే నాడు మాత్రమే కాక ఎప్పటికీ అమ్మ మనసు తెలుసుకుని ప్రవర్తించండి. ఇంటి పని, వంట పనితో పాటు ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తూ మల్టీ టాస్కింగ్ చేస్తూ పిల్లల భవిష్యత్ కు బంగారు బాటలు వేసే అమ్మకు చేదోడు వాదోడుగా చిన్న చిన్న పనుల్లో సహాయం చేస్తే ఆ తల్లి ఎంతగానో మురిసిపోతుంది. కాబట్టి జన్మనిచ్చిన అమ్మను సంతోష పెట్టటం కోసం ఇక నుండి మీ వంతు సహకారం తప్పక తనకు ఇవ్వండి.. అది చాలు అమ్మకు... రెట్టించిన ఉత్సాహంతో మీ జీవితాలను తీర్చి దిద్దటానికి అమ్మ అహర్నిశలు కృషి చేస్తుంది.












Click it and Unblock the Notifications