రాజకీయ కుస్తీపోటీలకు వేదిక కాదు: డిగ్గీకి కోర్టు చురక
జబల్‌పూర్: ‘రాజకీయ పార్టీల కుస్తీ పోటీలకు న్యాయస్థానాలు వేదికలు కాదు' అని మధ్యప్రదేశ్ హైకోర్టు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్‌కు చురకలు వేసింది. మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డు (ఎంపిపిఇబి) కుంభకోణంపై సిబిఐ విచారణ కోరుతూ దిగ్విజయ్ సింగ్ దాఖలు చేసిన లేఖపై న్యాయస్థానం పై విధంగా స్పందించింది.
దిగ్విజయ్ లేఖ పిటిషన్‌ను తోసిపుచ్చుతూ సరైన పిటిషన్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. విచారణ కోరుతూ లేఖ రాయడం మంచి సంప్రదాయం కాదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎఎం ఖన్వికర్, జస్టిస్ అలోక్ ఆర్ధేతో కూడిన డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది.

ఎంపిపిఇబి కుంభకోణంపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను సవాల్ చేస్తూ దిగ్విజయ్ సింగ్ హైకోర్టుకు లేఖ రాశారు. సిబిఐ విచారణ జరపాలని ఆయన ఆ లేఖలో కోరారు. తన లేఖను పిటిషన్‌గా పరిగణించాలని దిగ్విజయ్ కోర్టును అభ్యర్థించారు. కుంభకోణంలో సూత్రధారులైన ఆర్‌ఎస్‌ఎస్ నేతలను వదిలేసి విద్యార్థులు, వారి తల్లిదండ్రులను అరెస్టు చేశారని ఆరోపించారు.
పరస్పర విరుద్ధమైన అంశాలు ఇందులో ఉన్నాయని అన్నారు. అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పుర్షేంద్ర కౌరవ్ పాత్రను ఆయన లేఖలో వివరించారు. కౌరవ్ న్యాయవాదిగా ప్రైవేటు మెడికల్ కళాశాల ప్రవేశంపై ఎబివిపి నేత వి.డి.శర్మ తరఫున కోర్టులో పిటిషన్ వేశారని, ఇప్పుడు ఆయనే ప్రభుత్వం తరఫున వకల్తా పుచ్చుకున్నారని దిగ్విజయ్ ఆరోపించారు.












Click it and Unblock the Notifications