వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

MSP: కనీస మద్ధతు ధరను చట్టబద్ధం చేస్తే ఏమవుతుంది, కేంద్ర ప్రభుత్వం ఎందుకు సిద్ధంగా లేదు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేయడం ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు

'పొట్టి రకాల సేద్యం పుట్ల కొద్దీ ధాన్యం' అనేది ముప్పై నలభై యేళ్ల కిందట చాలా పాపులర్ ప్రకటన. రేడియోలలో వినిపించడమే కాదు, పత్రికలతో పాటు, ప్రతి పల్లె గోడల మీద కనిపించిన నినాదం అది. అధిక ఉత్పత్తినిచ్చే వరి, గోధుమ పంటలను 1960 దశాబ్దం మధ్యలో ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు దేశం మొత్తంగా విత్తనాల కంపెనీలు ఈ నినాదం సృష్టించాయి.

మెక్సికో లోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ మేజ్ అండ్ వీట్ రీసెర్చ్ నుంచి తీసుకు వచ్చి, దేశీయ పంటలతో హైబ్రిడ్ చేసి ఈ పొట్టి (డ్వార్ఫ్)గోధుమ వంగడాలను సృష్టించారు. తర్వాత పొట్టి వరి వంగడాలు వచ్చాయి. ఇవి ఫిలిప్పీన్స్ మనీలాలోని ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ సెంటర్ నుంచి వచ్చాయి. ఇవి ఎరువులకు విపరీతంగా స్పందిస్తాయి. దిగుబడి ఎక్కువగా ఉంటుంది. సస్య విప్లవానికి బాట వేశాయి.

అప్పట్లో భారతదేశంలో ఎరువుల కర్మగారాలు లేకపోయినా, ఆర్థిక భారమైనా సరే దిగుమతి చేసుకుని ఈ పొట్టి పంటలను ప్రోత్సహించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో నుంచి వచ్చిందే 'పొట్టి రకాలసేద్యం, పుట్లకొద్ది ధాన్యం' అనే నినాదం. ఆ సమయంలో పుట్టిన మరొక మాట కనీస మద్దతు ధర లేదా ఎమ్ఎస్‌పీ (మినిమమ్ సపోర్ట్ ప్రైస్).

వ్యవసాయోత్పత్తుల ధరలను నిర్ణయం కోసం 1964లో భారత ప్రభుత్వం ఎల్.కె.ఝా నేతృత్వంలో ఫుడ్ గ్రెయిన్స్ ప్రైసెస్ కమిటీని నియమించింది. ఈ కమిటీ సిఫార్సులను అనుసరించే 1965లో అగ్రికల్చరల్ ప్రైసెస్ కమిషన్ (ఏపీసీ), భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)లు ఏర్పాటయ్యాయి. ఒకటి పంటల ధరను నిర్ణయించేందుకు, రెండోది పంటలను ప్రభుత్వం తరఫున సేకరించేందుకు ఉద్దేశించినవి.

అగ్రికల్చర్ ప్రైసెస్ కమిషన్ కనీస మద్ధతు ధరని 1965లో ప్రకటించింది. రైతులకు గిట్టుబాటు ధరలు తెచ్చేందుకు ఈ ఎమ్‌ఎస్‌పీ 1966-67 నుంచి అమలులోకి వచ్చింది. అది ఆహార భద్రత సాధించేందుకు భారత ప్రభుత్వం తాపత్రయపడుతున్న సమయం. అందువల్ల వరి, గోధుమ వంటి ప్రధాన ప్రంటలకు ఎమ్‌ఎస్‌పీ ప్రకటించారు. దీని ఉద్దేశం, ఆహార ధాన్యాలను పండించేందుకు రైతులను ప్రోత్సహించడం, పండిన పంటకు గిట్టుబాటు ధర వచ్చేలా చూడటం.

ధరలు పడిపోతే, రైతులు నష్టపోకుండా ఉండేందుకు, వచ్చేసారి మరొక పంట వేయకుండా ఉండేందుకు ఈ చర్య అవసరమయింది. అలా కాకుండా రైతులు మరొక పంట మరలిపోతే ఆహారోత్పత్తి తగ్గిపోతుంది. అందువల్ల రైతులను ఈ పంటలే పండించేందుకు ప్రోత్సాహకం గా ఎమ్‌ఎస్‌పీ తీసుకువచ్చారు.

దేశానికి ఆహార భద్రత తీసుకురావడమే ధ్యేయం కాబట్టి విపరీతంగా పెరిగిపోతున్న వరి, గోధుమ పంటల విస్తీర్ణం, వరి పంట వల్ల పెరుగుతున్న జల వినియోగం, నత్రజని ఎరువుల వాడకంవల్ల వచ్చే అనర్థాలను ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ అధిక దిగుబడి, దానికితోడు ఎమ్‌ఎస్‌పీ, రైతులంతా గోధుమ, వరివైపు, ముఖ్యంగా వరి వైపు పరుగు పెట్టించాయి. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

తెలంగాణ కాళేశ్వరం వంటి కొత్తప్రాజెక్టులు వచ్చి సేద్యపు నీరు అందుబాటులోకి వస్తే చాలు, రైతులు వరి పంటే వేస్తున్నారు. ఇలా కొన్నాళ్లు గడిచేసరికి ఈ భూముల్లో వరి తప్ప మరొక పంట వేయలేని పరిస్థితి వస్తున్నా ఎవరూ ఖాతరు చేయడం లేదు.

అందుకే అప్పటి నుంచి ఇప్పటి దాకా ప్రతి సంవత్సరం పంట సీజన్‌లో వినిపిస్తూ ఉద్రికత్తకు కారణమవుతున్న మూడు అక్షరాల మాటగా ఈ ఎమ్‌ఎస్‌పీ మిగిలిపోయింది. పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణం వంటి వాటిని దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులకు రెగ్యులర్‌గా డిఏ పెంచడం, జీతాలను సవరించడం జరుగుతున్నట్లే రైతుల పంటకు గిట్టుబాటు ధర నిర్ణయిస్తుంటారు.

ఎంఎస్‌పీ వల్ల కొన్ని రాష్ట్రాల రైతులే ఎక్కువ లాభపడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు

ఎలా నిర్ణయిస్తారు?

ఒక పంట చేతికొచ్చే వరకు రైతుల పొలం మీద, పంట మీద, కూలీల మీద, కుటుంబ కూలీ మీద ఎంత ఖర్చు చేస్తున్నాడనే అంశాలను తీసుకుని లేదా లెక్కించి ఈ ధరను నిర్ణయిస్తారు.

ఈ ధరని నిర్ణయించేందుకు నియమించిన అగ్రికల్చరల్‌ ప్రైసెస్ కమిషన్ తర్వాత కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ (సీఏసీపీ)గా మారింది. ఈ సీఏసీపీ సిఫార్సు చేసిన ధరను ప్రభుత్వం ఆమోదిస్తుంది. ఇలా భారతదేశంలో ఇపుడు 23 పంటలకు సీఏసీపీ కనీస మద్దతు ధరలను నిర్ణయిస్తుంది. అంటే, రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం ఈ ధరకు తక్కువ కాకుండా ఉత్పత్తులను తానే కొంటుంది.

ప్రభుత్వానికి విక్రయించడం ఇష్టం లేకపోతే, రైతులు తమకు ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముకోవచ్చు.

ఇపుడు దేశంలో ఈ కనీస మద్దతు ధర మీద ఉద్యమం సాగుతూ ఉంది. అయితే, 1966 నుంచి అమలులో ఉన్న కనీస మద్దతు ధరకు చట్టబద్ధత మాత్రం లేదు. ప్రతిసారి కమిషన్ సిఫార్సు చేస్తుంది. ప్రభుత్వం ఆమోదించి ప్రకటిస్తుంది. చట్టబద్ధత లేనందున రైతులు మార్కెట్లో విక్రయించినపుడు, ఒక బెంచ్ మార్క్‌ చట్టబద్ధ ధర లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారు.

భారత ఆహార సంస్థ సేకరణ కూడా లోపభూయిష్టంగా ఉండటం, రైతుల ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయకపోవడం వల్ల వారు ట్రేడర్లకు విక్రయించాల్సి వస్తున్నది. చాలా సందర్భాలలో ఎంఎస్‌పీ కంటే తక్కువ ధరలకు అమ్ముకోవలసి వస్తుంది. ఇది రైతుకి బాగా నష్టం తెస్తున్నది. అందువల్ల ఎంఎస్‌పీకి చట్టబద్దత ఉంటే, దాని కంటే తక్కువకు ధర ఇవ్వడం చట్ట వ్యతిరేకమవుతుంది కాబట్టి, ఎంఎస్‌పీ చట్టం తీసుకురావాలని పంజాబ్ హరియాణా రైతులు డిమాండ్ చేస్తున్నారు.

దీనికి అన్ని రాష్ట్రాల రైతుల నుంచి మద్దతు ఉంది.

ఈ కారణంతోనే కనీస మద్దతు ధరకు చట్టబద్దత తీసుకురావాలనే డిమాండ్ తో రైతుల ఉద్యమం ముందు ముందు కూడా కొనసాగుతుందని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్‌ టికైత్‌ ప్రకటించారు. ప్రధాని మోదీ ప్రభుత్వం మూడు వ్యవసాయ బిల్లులను సోమవారం నాడు ఉపసంహరించుకున్నాక కూడా తమ ఆందోళన ఆగదని ఆయన చెప్పారు.

"ఈ వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవడంతో పాటు కనీస మద్దతు ధర దేశమంతా వర్తించేలా పార్లమెంటులో చట్టం తీసుకురావాలనేది మా రెండో డిమాండ్. ఈ చట్టం వచ్చేదాకా ఉద్యమిస్తాం" అని టికైత్ అన్నారు.

ఇతర పంటలకు కనీస మద్ధతు ధర అందుబాటులో లేకపోవడంతో ఎక్కువమంది రైతులు వరి, గోధుమ వైపు మళ్లుతున్నారు.

కనీస మద్దతు ధర ఎపుడూ వివాదమే...

ఎంఎస్‌పీ కొన్ని సమస్యలు పరిష్కరించినా మరికొన్ని సమస్యలు సృష్టించిందని, ఇది లోపభూయిష్టమైన విధానమని రైతు సంఘాలు వాదిస్తున్నాయి. కనీస మద్దతు ధర నిర్ణయించేందుకు ఒక సూత్రం (A2+FL) అనుసరిస్తారు. ఇందులో A2 అంటే పంట మీద పెట్టిన అన్నిరకాల ఖర్చులు. FL అంటే కుంటుంబలోని వ్యక్తుల లేబర్ చార్జీలు. దీనికి భూమి విలువ మీద వడ్డీ, అద్దె విలువకూడా కలిపితే వచ్చే మొత్తాన్ని C2 (A2+FL+ భూమి విలువ మీద వచ్చే అద్దె, వడ్డీ ) అంటారు.

C2 మీద ఒకటిన్నరింతలు ఎక్కుగా కనీస మద్దతు ధర నిర్ణయించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎం.ఎస్.స్వామినాథన్ కమిటీ (నవంబర్ 18, 2004-అక్టోబర్ 4, 2006) కూడా ఇదే సిఫార్సు చేసింది. మొత్తం వ్యయం మీద కనీసం 50 శాతం అధికంగా ఎంఎస్‌పీ ఉండాలని డాక్టర్ స్వామినాథన్ సూచించారు. ఇపుడు ప్రకటిస్తున్న కనీస మద్దతు ధర స్వామినాథన్ కమిషన్ సిఫార్సు ప్రకారమే నని కేంద్ర ప్రభుత్వం చెబుతూ ఉంది.

అయితే, కేంద్రం ఏ సూత్రం అనుసరించి స్వామినాథన్ సిఫార్సును అమలుచేసిందనే ప్రశ్నకు సరైన జవాబు రావడంలేదు. ప్రభుత్వం లెక్కించిన విధానానికి రైతుసంఘాలు లెక్కంచిన విధానానికి తేడా వస్తున్నది. A2+FL మీద 50 శాతం పెంచి ఎంఎస్‌పీ ఖరారు చేశారా లేక C2 మీద 50 శాతం పెంచారా అనేది ఇంకా వివాదంగానే ఉంది.

మరోవైపు నీతి ఆయోగ్ జరిపిన ఒక సర్వే (2016) ప్రకారం సర్వే కోసం ఎంపిక చేసుకున్న రైతులలో 94 శాతం మంది ఎంఎస్‌పీ విధానం కావాలని కోరారు. అయితే, మరొక 79 శాతం మంది ఈ ఎంఎస్‌పీ విధానం పట్ల అసంతృప్తితో ఉన్నారు.

మరొక వివాదం ఏమిటంటే, చాలా పంటలకు ఎంఎస్‌పీ లేకపోవడమో, ఉన్నా తక్కువగా ఉండటమో జరుగుతూ ఉంది. ప్రజల నిత్య వాడకానికి ఉపయోగ పడే కొన్ని రకాల పంటలు ఎంఎస్‌పీ నుంచి పెద్దగా లబ్ది పొందడం లేదు. భారత ఆహార సంస్థ కొనుగోలు చేస్తున్న మొత్తం వ్యవసాయ పంటల్లో ఎక్కువ వరి, గోధుమలే ఉంటున్నాయి.

వీటితో పోలిస్తే, మిగతా పంటలు అంటే నూనె గింజలు, పప్పుధాన్యాల వాటా చాలా తక్కువ. వీటి ఉత్పత్తి చాలినంత లేకపోవడం వల్ల భారీగా దిగుమతి చేసుకుంటున్న వాస్తవం కళ్లెదుట ఉన్నా నూనె గింజలు, పప్పు ధాన్యాలను ప్రోత్సహించే విధంగా ఎంఎస్‌పీ లేదు. అందుకే ఆరుతడి పంటలను బాగా నిర్లక్ష్యం చేసి కేవలం గోధుమ, వరి మీద భారీగా కనీస మద్దతు ధర నిర్ణయిస్తూ ఉండటం వల్ల నూనె గింజలు, పప్పు ధాన్యాల పంట విస్తీర్ణం దేశంలో పెరగడం లేదనే విమర్శ ఉంది.

అసలు ప్రభుత్వ వ్యవసాయ విధానాలు నీటి వసతి బాగా ఉన్న ప్రాంతాలకు మాత్రమే అనుకూలంగా ఉన్నాయని, వర్షాధార ప్రాంతాలకు ఏ మాత్రం అనుకూలంగా లేవని ఈ ప్రాంతాల రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాలకు మాత్రమే దీని వల్ల ప్రయోజనం ఉండటం కనీసం మద్దతు ధర చుట్టూ ఉన్న మరొక వివాదం. ఉదాహరణకు ఇపుడు వరికి అందిస్తున్న కనీస మద్దతు ధర వల్ల ప్రధాన లబ్దిదారులు పంజాబ్ హరియాణా, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ, ఆంధ్రలే. మిగతా రాష్ట్రాలకు ప్రయోజనం పెద్దగా లేదు.

2015లో వచ్చిన శాంతకుమార్ కమిటీ నివేదిక ప్రకారం కేవలం 6శాతం రైతులు మాత్రమే ప్రభుత్వ ఏజెన్సీలకు ధాన్యం విక్రయించగలుగుతున్నారు. ఇదే విషయాన్ని 2016 నాటి నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. ఎంఎస్‌పీ వల్ల పెద్ద రైతులు ప్రధానంగా లబ్ది పొందుతున్నారని ఈ నివేదిక చెప్పింది.

ఆర్థిక కారణాల వల్ల మార్కెట్ యార్డ్ లకు రాలేకపోతున్న చిన్న, మధ్య తరహా రైతులు ఎంఎస్‌పీ కంటే తక్కువ ధరలకు ధాన్యాన్ని ట్రేడర్లకు అమ్ముకుంటున్న విషయాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. ఇంకొక వివాదం, అసలు కనీస మద్దతు ధర నిర్ణయించేందుకు తీసుకుంటున్న డేటా. ఈ డేటా పాతదని, అది పంటకాలం నాటి ధరలకంటే చాలా తక్కువగాఉంటుందని, దీని వల్ల సరైన ధర రావడం లేదని కొంతమంది విమర్శిస్తున్నారు.

మొత్తంగా కనీసం మద్దతు అమలు మీద మెట్ట ప్రాంతాలలో ఒక సమస్య, మాగాణి ప్రాంతాలలో మరొక సమస్య వస్తున్నట్లు ఈ ప్రాంతాల రైతుల వాదన వింటే అర్థమవుతుంది.

ప్రొక్యూర్‌మెంట్‌ గ్యారంటీ ఇవ్వడం వల్ల రైతులు ఇతర పంటలవైపు మళ్లే అవకాశం ఉంది

చట్టబద్ధత సరే...వర్షాధారిత ప్రాంతాల మాటేమిటి?

కనీస మద్దతు ధర విధానంలో చాలా లోపాలున్నా, దీనికి చట్టబద్ధత కల్పించడం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయని బొజ్జా వెంకటరెడ్డి అగ్రికల్చరల్ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. కనీస మద్దతు ధరతో సహా ఇపుడు అమలు చేస్తున్న వ్యవసాయ విధానాలన్నీ సమృద్ధిగా సేద్యపు నీరున్న ప్రాంతాలకే అనుకూలంగా ఉన్నాయని, దేశంలోని వర్షాధార ప్రాంతాలకు ఏ మాత్రం అనుకూలంగా లేవని ఆయన అన్నారు.

"భారత ఆహార సంస్థ ప్రొక్యూర్‌మెంట్‌ ఎవరికి ఉపయోగపడుతున్నది? కేవలం గోధుమలు, వరి పండించే వారికే కదా. మిగతా పంటలకు గిట్టుబాటు ధర వచ్చే అవకాశమే లేదు. అందుకే రైతులంతా వరివైపు వెళ్తున్నారు. నూనె గింజలను, పప్పుధాన్యాలను పూర్తిగా విస్మరించారు. ఫలితంగా ఈ రోజు ఈ రెండింటిని భారీగా దిగుమతి చేసుకుంటున్నారు. వర్షాధార ప్రాంతాల ప్రంటలకు ఎంఎస్‌పీ పెంచి, ప్రోత్సాహకాలు ప్రకటిస్తే, పంటల వైవిధ్యం పెరుగుతుంది. దిగుమతి భారం తగ్గుతుంది" అని దశరథరామిరెడ్డి అన్నారు.

కేంద్రంలోగానీ, రాష్ట్రంలోగానీ వర్షాధార ప్రాంతాల వ్యవసాయానికి ఒక విధానమంటూ లేదని చెబుతూ ఈ ప్రాంతాలకు ప్రత్యేక బడ్డెట్ ఇచ్చి సేద్యపు నీటి ప్రాంతాల నుంచి దృష్టి వెనకబడిన ప్రాంతాల మీదకు మళ్లించాల్సిన అవసరం వచ్చిందని దశరథ రామిరెడ్ది అన్నారు.

"100శాతం ప్రొక్యూర్ మెంట్ గ్యారంటీ ఇస్తే రైతులు నూనెగింజలు, పప్పుధాన్యాల వైపు మరలుతారు. అంతేకాని, బియ్యం ఎగుమతికి అనుమతించి సబ్సిడీ ఇవ్వడం పరిష్కారం కాదు" అని ఆయన అభిప్రాయపడ్డారు.

బియ్యం ఎగుమతి చేయడమంటే నీళ్లను ఎగమతి చేయడమేనని, ఇది దారుణమయిన విషయం అంటూ ఇలాంటి చర్యల వల్ల చాలా తీవ్రమైన సామాజిక ఆర్థిక పర్యవసానాలు ఉంటాయని ఆయన అన్నారు.

23 రకాల పంటలకు ప్రభుత్వం కనీస మద్దతు ధరను ప్రకటిస్తుంది

గోడౌన్లు ఖాళీ లేవనడం సరైన వాదం కాదు

దీనికి భిన్నమైన వాదనను ఆంధ్రప్రదేశ్ రైతాంగ సమాఖ్య అధ్యక్షుడు ఏర్నేని నాగేంద్ర నాథ్ వినిపించారు.

గోడౌన్లుబియ్యంతో నిండిపోయాయని, ఇక బియ్యం కొనలేమని కేంద్రం చేస్తున్న వాదన సరైంది కాదని ఆయన అన్నారు. గౌడన్లలోకి వచ్చే ధాన్యమంతా రైతులు పండించింది కాదని, పీడీఎస్‌ బియ్యం రీసైకిల్ అయి వచ్చి మళ్లీ భారత ఆహార సంస్థకే చేరుతున్నాయని, ఇదొక పెద్ద కుంభకోణమని ఆయన వ్యాఖ్యానించారు.

"కేంద్రం రాష్ట్రంలో దాదాపు కిలోకి 30 రూపాయల సబ్సిడితో బియ్యం అందిస్తున్నది. దానికి మరొక మూడు రూపాయల సబ్సిడీ ఇచ్చి రాష్ట్రాలు కిలో బియ్యం ఒక రూపాయికి ప్రజలకు అందిస్తున్నాయి. ఈ బియ్యం తింటున్నవారు చాలా తక్కువ. ఈ బియ్యమే మళ్లీ ట్రేడర్లు, మిల్లర్ల ఎఫ్‌సీఐకి చేరుతున్నాయి. దీనిని అధిక ప్రొడక్షన్ గా చెప్పుకుంటున్నారు. ఇది మోసం. గోడౌన్లు ఖాళీ కావాలంటే, ఎగుమతులకు అనుమతి ఇవ్వడం ఒక మార్గం. ఎగుమతులను అనుమతిస్తూ కేజీకి కనీసం 5 రూపాయల సబ్సీడి ఇవ్వాలి. అపుడు కొంతయినా బియ్యం ఎగుమతి జరుగుతుంది. గోడౌన్లు ఖాళీ అవుతాయి. తర్వాత ఎగుమతికి అనుకూలమయిన రకాల వరిని ప్రోత్సాహించాలి. ఇలా అంతర్జాతీయ మార్కెట్లోకి భారత బియ్యం ప్రవేశిస్తుంది" అని నాగేంద్రనాథ్ అన్నారు.

వరి నుంచి రైతులను ఇతర పంటలవైపు మళ్లించేందుకు అనువైన వాతావరణమే సృష్టించలేదని ఆయన విమర్శించారు.

"ఆంధ్రప్రదేశ్‌లోని డెల్టా ప్రాంతంలో వరి తప్ప మరొక పంట పండదు. అక్కడక్కడా మినుములు వేస్తున్నారు. తీరా చూస్తే మినుములకు విత్తనం కొరత ఉంది. సకాలంలో విత్తనం అందించే స్థితిలో కూడా ప్రభుత్వాలు లేవు. సకాలంలో విత్తనం అందకపోతే, ఈ పంటలు వేయడం కష్టం. ఇలాగే మొక్కజొన్న వేసేందుకు కూడ నాణ్యమైన విత్తనం కొరత ఉంది. పెసర, సోయా విత్తనం కొరత ఉంది. అందువల్ల వరి నుంచి ప్రత్యామ్నాయ పంటలకు రాత్రికి రాత్రి మరలడం సాధ్యంకాదు. ముందు నాణ్యమైన విత్తనాల కొరత కూడా తీర్చాలి" అని ఆయన అన్నారు.

కనీస మద్దతు ధర నిర్ణయం మీద కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఎంఎస్‌పీ గురించి ఎన్ని అభిప్రాయభేదాలున్నా, అసంతృప్తి ఉన్నా, ఎంఎస్‌పీకి చట్టబద్దత కల్పించాలన్న విషయానికి చాలా మద్దతు ఉంది. అన్ని ప్రాంతాల రైతులు ఇదే డిమాండ్ చేస్తున్నారు. నిజానికి మూడుచట్టాల గురించి పెద్దగా తెలియకపోయినా, ఎంఎస్‌పీ చట్టబద్ధత ప్రయోజనం గురించి రైతులందరికి తెలుసు.

మూడు రైతు చట్టాలను ఉపసంహరణతో రైతు ఉద్యమానికి బ్రేక్‌ పడిందని అనుకోవడానికి వీల్లేదు. ఎంఎస్‌పీ ఆందోళన ఇంకా తీవ్రంగా, విస్తృతంగా జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది.

'ఎంఎస్‌పీకి చట్టబద్ధత ప్రమాదకరం

అయితే, ఎంఎస్‌పీ కి చట్టబద్ధత కల్పించడం వల్ల వ్యవసాయం నాశనమవుతుందని హెచ్చరించే వాళ్లూ ఉన్నారు. "ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించే కార్యక్రమం లేదు కాబట్టి ఎంఎస్‌పీ ని చట్టబద్ధం చేస్తే పంటల విధానంలో ఇపుడున్న వ్యత్యాసం కొనసాగడమే కాదు, బలపడుతుంది'' అని హైదరాబాద్‌కు చెందిన వ్యవసాయనిపుణుడు, సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ బి.రామాంజనేయులు అంటున్నారు.

మాజీ ఇండియన్ రెవిన్యూ సర్వీస్ అధికారి, సామాజిక ఉద్యమకారుడు వి.ఎస్.ప్రసాద శాస్త్రి కూడా దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. "రైతు తనకిష్టమైన పంట వేసుకుని నష్టం వస్తున్నదని చెబుతూ, కనీస మద్దతు ధర కోరడం ఏ న్యాయం కిందికి వస్తుంది ?" అని ఆయన ప్రశ్నించారు.

"ప్రభుత్వాలు అనేక రాయితీలు, రైతు బంధు వంటి పథకాలు అమలు చేస్తున్నాయి. మరికొన్ని ప్రభుత్వాలు రుణ మాఫీ చేస్తున్నాయి. విత్తనాల మీద సబ్సడీలు, ఎరువుల మీద సబ్సడీలు, ఉచిత కరెంటు, పావలా వడ్డీ ఇలా రాయితీల మీద రాయితీలు తీసుకుంటూ ఇంకా ఎంఎస్‌పీ అని ఎలా అడుగుతారు? ఈ భారం ఎవరి మీద పడుతుంది" అని ఆయన ప్రశ్నించారు.

నీటి వినియోగం, ఎరువుల వినియోగం అధికంగా ఉండటం వల్ల వరి, గొధుమ పంటలు పర్యావరణానికి కూడా ప్రమాదకరంగా మారుతున్నాయి.

'పర్యావరణానికి ప్రమాదమే'

పంటల విధానాన్ని సరిచేయకుండా ఎంఎస్‌పీని చట్టబద్దం చేస్తే వరి పంట విస్తీర్ణం ఇంకా పెరిగి వాతావరణాన్ని వేడెక్కించే వాయువులు వెలువడతాయని ప్రఖ్యాత ఆగ్రోనమిస్ట్ ప్రభాకరన్ నాయర్ హెచ్చరిస్తున్నారు. "గోధుమ, వరి పంటల విస్తీర్ణం ఇంకా పెరిగితే, యూరియా వాడకం కూడా పెరుగుతుంది. యూరియా మాలిక్యూల్ భూమిలో హైడ్రాలిసిస్ కు లోనై నైట్రస్ ఆక్సైడ్ (N₂O)అనే గ్యాస్ ఏర్పడుతుంది. ఇది వాతావారణంలో కనీసం 350 సంవత్సరాలు చెక్కుచెదరకుండా ఉంటుంది. భూవాతావరణం వేడెక్కేందుకు దోహదపడుతున్న వాయువులో దీని వాటా 35శాతం" అని ఆయన అన్నారు. ఈ విషయాన్ని తన పుస్తకం 'కంబాటింగ్ గ్లోబల్ వార్మింగ్: ది రోల్ ఆఫ్ క్రాప్ వైల్డ్ రిలెటివ్స్ ఫర్ ఫుడ్ సెక్యూరిటీ' లో చాలా వివరంగా రాశారు.

అడ్డు అదుపు లేకుండా గోధుమ, వరి పంటలకు సాగుతున్న యూరియా వాడకాన్ని నిలిపివేయాలని, ఈ రెండు పంటలకు ఇపుడిస్తున్న ప్రోత్సాహకాలను తగ్గించి, మంచి పోషక విలువలున్న రాగి,మొక్కజొన్న, సజ్జలు, జొన్నవంటి పంటలకు మళ్లించాలని ప్రభాకరన్‌ అంటున్నారు. ఇది చాలా ప్రాంతాల వరి, గోధుమ రైతులకు నచ్చకపోవచ్చు. ఈ నేపథ్యంలో భారతదేశానికి ఒక పంటల పత్యామ్నాయ వ్యూహం ఎంత అత్యవసరమో అర్థం చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
MSP: What happens if the minimum support price is legalized, why is the central government not ready
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X