మేం అడిగిన ఆ 20 కోట్లు ఇవ్వకపోతే..: ముఖేష్ అంబానీకి డెత్ మెయిల్
ముంబై: దేశీయ పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి డెత్ మెయిల్ అందింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆయనకు ఈ మెయిల్ పంపించారు. షూట్ చేసి చంపుతామంటూ బెదిరించారు. ఈ ఘటనపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ అజ్ఞాత వ్యక్తుల కోసం అన్వేషణ మొదలు పెట్టారు.
రిలయన్స్ ఫౌండేషన్ ఆధీనంలో నడుస్తోన్న ఆసుపత్రికి బెదిరింపు ఫోన్ కాల్ అందిన కొద్దిరోజుల్లోనే ముఖేష్ అంబానీకి డెత్ మెయిల్ రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ రెండు ఘటనలు ముంబైలో కలకలం రేపాయి. పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆయన నివాసానికి అదనపు భద్రతను కల్పించారు.

ఇదివరకూ ముఖేష్ అంబానీకి బెదిరింపులు అందిన విషయం తెలిసిందే. 2021లో ఆయన నివాసం అంటాలియాకు అత్యంత సమీపంలో కారును పార్క్ చేసిన ఉదంతం అనేక మలుపులు తిరిగింది. ఆ కారులో 20 జిలెటిన్ స్టిక్స్ లభించాయి. ఇది కేవలం గ్లింప్సెస్ మాత్రమే అనే బెదిరింపు లేఖనూ పోలీసులు ఆ కారు నుంచి స్వాధీనం చేసుకున్నారు.
ఇప్పుడు తాజాగా మళ్లీ ఆయనకు బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపింది. తాము అడిగిన 20 కోట్ల రూపాయలను ఇవ్వకపోతే షూట్ చేసి చంపుతామంటూ అజ్ఞాత వ్యక్తులు ముఖేష్ అంబానీకి ఇ-మెయిల్ పంపించారు. ఈ నెల 27వ తేదీన ఈ ఈ-మెయిల్ ఆయనకు వచ్చింది.
దీనిపై రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గమ్‌దేవి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఐపీసీలోని సెక్షన్ 387, 506 (2) కింద కేసు నమోదు చేసినట్లు ముంబై పోలీస్ కమిషనర్ తెలిపారు. దీనిపై దర్యాప్తు మొదలుపెట్టామని, త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని అన్నారు.












Click it and Unblock the Notifications