ముంబైలో హెల్త్ ఎమర్జెన్సీ..తీవ్రంగా వెంటిలేటర్ల కొరత, ఆస్పత్రుల వెంట కరోనా బాధితుల పరుగులు!!
దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. విపరీతంగా పెరుగుతున్న కేసులతో ముంబై విలవిలలాడుతోంది. ఎక్కడ చూసినా వెంటిలేటర్ల కొరత ఆసుపత్రులలో కనిపిస్తుంది. ముంబై మరియు దాని పరిసర మునిసిపల్ కార్పొరేషన్ ప్రాంతాలు వెంటిలేటర్ల కొరతను ఎదుర్కొంటున్నాయి. అనేక ప్రభుత్వ జంబో కేంద్రాలు వెంటిలేటర్ మద్దతు అవసరమైన రోగులను ఆస్పత్రిలో చేర్చుకోవడానికి సుదీర్ఘ వెయిట్‌లిస్ట్ కలిగి ఉన్నాయి.
Recommended Video

ఐసీయూలు, వెంటిలేటర్లు కొరత
మీరా భయాందర్ మునిసిపల్ కార్పొరేషన్‌లో 40 ఐసియు పడకలు ఉన్నాయి. డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ శంభాజీ పన్‌పట్టే మాట్లాడుతూ "మా ఐసియులన్నీ నిండిపోయాయని , కొత్తగా పేషెంట్లను చేర్చుకోవడానికి వీలు లేకుండా ఉందని పేర్కొన్నారు. వాసై విరార్ మునిసిపల్ కార్పొరేషన్‌లో 17 కోవిడ్ ఆస్పత్రులు ఉన్నాయి. ఈ 17 కోవిడ్ ఆస్పత్రులలోనూ బెడ్స్ ఖాళీ లేవని అధికార యంత్రాంగం చెబుతోంది. ఆక్సిజన్ కొరత నుండి బెడ్ ల కొరత, ఐసియు కొరత వరకు కోవిడ్ చికిత్సలో అన్ని అడ్డంకులను కరోనా బాధితులు చూస్తున్నారు.

ఆస్పత్రుల్లో ఖాళీలు లేక బెడ్ల కోసం పరుగులు పెడుతున్న కోవిడ్ బాధిత కుటుంబాలు
ఈ ఆస్పత్రి అంటూ, ఆ ఆస్పత్రి అంటూ పరుగులు పెడుతున్నారు. కరోనా బాధితులు పడుతున్న అగచాట్లు అన్నీ ఇన్నీ కావు. ఆసుపత్రుల కొరతతో చాలామంది ఇళ్లలోనే తీవ్ర అస్వస్థతను ఎదుర్కొంటున్నారు. ఆస్పత్రిలో చేర్చుకునే వీలు లేక చాలా మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కోవిడ్ -19 రోగుల కోసం నగరంలో 1,444 వెంటిలేటర్లలో 17 , 2,861 ఐసియులలో 60 ఖాళీగా ఉన్నాయని బిఎంసి డాష్‌బోర్డ్ చూపించగా, అంతర్గత లైవ్ డాష్‌బోర్డ్ ఆదివారం (మధ్యాహ్నం 3) ముంబైలో కేవలం ఆరు వెంటిలేటర్లు మరియు 21 ఐసియులు ఖాళీగా ఉన్నాయని చూపించింది.

ఐసియు పడకలను పెంచినప్పటికీ ఐసియులపై ఒత్తిడి ఉందన్న ముంబై కమీషనర్
గ్రౌండ్ రియాలిటీ లో మాత్రం అన్ని ఆసుపత్రులు ఫుల్ గా ఉన్నాయి. ఏ ఆస్పత్రులలోనూ కరోనా పేషెంట్లను చేర్చుకోవడం లేదు. వెంటిలేటర్లు, ఐసీయూలు , బెడ్ లు ఏవి ఖాళీ లేని పరిస్థితి ముంబై వాసులకు తీవ్ర ఇబ్బంది కలుగజేస్తుంది.రెండవ వేవ్ సమయంలో నగరం అంతటా 1,500 నుండి 2,800 ఐసియు పడకలను పెంచినప్పటికీ ఐసియులపై ఒత్తిడి ఉందని కమిషనర్ ఐ ఎస్ చాహల్ చెప్పారు. "మేము ఈ వారం మరో 100 ఐసియులను ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నాము" అని ఆయన పేర్కొన్నారు.

ముంబైలో కేసుల తీవ్రత ... తగ్గట్టుగా లేని ఐసీయూలు , వెంటిలేటర్లు
ముంబై నగరంలో వెంటిలేటర్ల కొరత, ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందని ప్రస్తుత పరిస్థితులను బట్టి తెలుస్తుంది. ముంబై ఆక్సిజన్ తయారీ కర్మాగారం యొక్క సాంకేతిక లోపం సకాలంలో పరిష్కరించడంతో కాస్త ఆక్సిజన్ సంక్షోభం నుండి ముంబై బయట పడినప్పటికీ వైద్య సదుపాయాల కొరత ముఖ్యంగా వెంటిలేటర్ల కొరత తీర్చడం కోసం అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నా ముంబైలో కేసుల తీవ్రతకు తగ్గట్టు వసతులు లేకపోవటం ముంబైలో హెల్త్ ఎమర్జెన్సీ కి అద్దం పడుతుంది .












Click it and Unblock the Notifications