WPL విజేతగా ముంబై ఇండియన్స్: ఫైనల్‌లో ఢిల్లీ కేపిటల్స్‌పై విజయం
న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. డబ్ల్యూపీఎల్‌లో తొలి విజేతగా నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్‌పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఢిల్లీ కాపిటల్స్‌తో జరిగిన ఫైనల్లో ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
132 పరుగుల లక్ష్యాన్ని ముంబై 19.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. కెప్టెన్ మెగ్ లానింగ్ (35, 29 బంతుల్లో), షిఖా పాండే (27*,17 బంతుల్లో ), రాధా యాదవ్ (27*, 12 బంతుల్లో) మినహా ఢిల్లీ బ్యాటర్లెవరూ అంతగా రాణించలేదు.

ముంబై బౌలర్లలో వాంగ్, హెయిలీ మాథ్యూస్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అమీలా కెర్ కు రెండు వికెట్లు దక్కాయి. ఒకానొక దశలో ఢిల్లీ స్కోరు 100 పరుగులు దాటుతుందా అనుకున్నా.. షిఖా పాండే, రాధా యాదవ్ కీలక ఇన్నింగ్స్ ఆడటంతో ఢిల్లీ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఢిల్లీకి ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది.
ఓపెనర్ షఫాలీ వర్మ (11) తక్కువ స్కోరుకే ఔట్ అయింది. తర్వాత వచ్చిన క్యాప్సీ (0) పరుగులేమీ చేయకుడానే వెనుదిరిగింది. దీంతో మరో ఓపెనర్ లానింగ్.. రోడ్రిగ్స్‌తో కలిసి ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేసింది. కానీ, 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోడ్రిగ్స్ ఔట్ అయింది.
అనంతరం జట్టు స్కోరు 73 పరుగుల వద్ద మరిజన్నె కప్ (18), మెగ్‌లానింగ్ ఔట్ అవడంతో ఢిల్లీ కష్టాల్లో పడింది. తనియా భాటియా, అరుంధతి రెడ్డి కూడా డకౌటయ్యారు. జోనా సేన్ (2), మిన్ను మని (1) పరుగులు చేశారు. చివర్లో షిఖా పాండే, రాధా యాదవ్ రాణించడంతో ఢిల్లీ 131 పరుగులు చేసింది.
ఇక 132 పరుగుల లక్ష్యంతోతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్..19.3 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి 134 పరుగులు సాధించింది. ఓపెనర్లు మాథ్యూస్ , యషికా బాటియా త్వరగానే ఔటైనా.. నట్ స్కీవర్ బ్రుంట్ 55 బంతుల్లో 60 పరుగులతో జట్టును గెలిపించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 37 పరుగులు, అమెల్లా కెర్ 14 పరుగులు చేసి జట్టు గెలుపులో కీలకంగా నిలిచారు. ఢిల్లీ బౌలర్లలో రాధా యాదవ్, జెస్ జానాస్సెన్ చెరో వికెట్ పడగొట్టారు.












Click it and Unblock the Notifications