కొత్త ఏడాది సెలబ్రేషన్స్ వేళ.. పరుగులు పెట్టించిన ఫోన్ కాల్: సిటీ అంతటా హైఅలర్ట్
New Year 2024: దేశం మొత్తం కొత్త ఏడాది 2024కు స్వాగతం పలకడానికి జనం సన్నద్ధమౌతోన్న వేళ.. ముంబై పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. నగరంలో హైఅలర్ట్ ప్రకటించింది. విస్తృతంగా వాహనాల తనిఖీలను చేపట్టింది. అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోన్నారు పోలీసులు.
దీనికంతటికా కారణం- ఒకే ఒక్క ఫోన్ కాల్. ఈ తెల్లవారు జామున 6 గంటల సమయంలో కంట్రోల్ రూమ్‌కు అందిన ఫోన్ కాల్.. ముంబై పోలీసులను ఉలిక్కిపడేలా చేసింది. కొత్త సంవత్సరం వేడుకల సమయంలో ముంబైలో వరుస బాంబు పేలుళ్లు సంభవించబోతోన్నాయంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

దీనితో పోలీసులు అప్రమత్తం అయ్యారు. నగరం మొత్తం హైఅలర్ట్‌ను ప్రకటించారు. విస్తృత తనిఖీలను చేపట్టారు. ఫేక్ ఫోన్ కాల్ అయి ఉండొచ్చనే అంచనాలు ఉన్నప్పటికీ.. పోలీసులు మాత్రం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు చోటివ్వదలచుకోలేదు. డాగ్ స్క్వాడ్, బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌ను సిద్ధంగా ఉంచారు.

సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో కార్డన్ అండ్ సెర్చ్ చేపట్టారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేశారు. ఈ ఫోన్ కాల్ వ్యవహారంపై ముంబై పోలీస్ విభాగం ఉన్నతాధికారులు స్పందించారు. కొత్త సంవత్సరం వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండటానికి ముందుజాగ్రత్త చర్యలను తీసుకున్నామని, సమస్యాత్మక ప్రాంతాల్లో బందోబస్తును ఏర్పాటు చేస్తామని అన్నిరు.
వరుస బాంబు పేలుళ్ల జరగబోతోన్నాయంటూ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసిన వ్యక్తి గురించి ఆరా తీస్తోన్నామని, దీనికోసం ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. బాంబులు అమర్చినట్లు ఇప్పటివరకు సరైన ఆధారాలు ఏవీ లభించలేదని, అయినప్పటికీ- మరో 24 గంటల పాటు నగరంలో హైఅలర్ట్ కొనసాగిస్తామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications