ఇదేం శిక్ష?: విద్యార్థుల పట్ల పాఠశాల యాజమాన్యం అమానవీయ చర్య
ముంబయిలోని విక్రోలీ ప్రాంతంలో ఉన్న ఓ పాఠశాల యాజమాన్యం తమ పాఠశాల విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించింది. విద్యార్థుల తలపై అక్కడక్కడా జుట్టు తీసేసి ఇష్టమొచ్చినట్లు కటింగ్ చేసిపారేసింది.
ముంబై: ఎక్కడైనా చదవకపోతే, రాయకపోతే, హోం వర్క్ చేసుకురాకపోతే శిక్షిస్తారు. కానీ ముంబైలోని ఈ పాఠశాల యాజమాన్యం చేసిన పని చూస్తే మీరు విస్తుపోతారు. తమ పాఠశాలలో చదివే కొంతమంది విద్యార్థులు జుత్తు సరిగా కత్తిరించుకోలేదని భావించిన యాజమాన్యం వారి పట్ల అమానవీయంగా ప్రవర్తించింది.
ఏం చేసిందో తెలుసా? ఆ విద్యార్థుల తలపై అక్కడక్కడా జుట్టు తీసేసి ఇష్టమొచ్చినట్లు కటింగ్ చేసిపారేసింది. ముంబయిలోని విక్రోలీ ప్రాంతంలో ఉన్న ఓ పాఠశాలలో ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..

విక్రోలీ ప్రాంతంలోని ఓఇంగ్లీష్ మీడియా పాఠశాలలో గత గురువారం స్కూల్ డైరెక్టర్ తరగతి గదులను తనిఖీ చేశారు. ఆ సమయంలో డైరెక్టర్ మాట్లాడుతూ.. తాను మళ్లీ తనిఖీకి వచ్చే సరికి బాలురందరూ తమ జుట్టును తగ్గించుకుని రావాలని సూచించారు.
అయితే ఈలోగానే డైరెక్టర్ కొడుకు, పీఈటీ, సహాయక సిబ్బంది కలిసి విద్యార్థుల పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. జుట్టు ఎక్కువగా ఉన్న 25 మంది విద్యార్థులను తరగతి గదుల్లోంచి బయటికి తీసుకొచ్చి.. వారి జుట్టును అక్కడక్కడా కత్తిరించారు. ఇష్టం వచ్చినట్లు గాట్లు పెట్టారు. పిల్లలు ఏడుస్తున్నా పట్టించుకోకుండా శిక్షను అమలుచేశారు.
పాఠశాల నుంచి ఏడుస్తూ ఇంటికొచ్చి పిల్లలను చూసి వారి తల్లిదండ్రులు అడగగా.. అసలు విషయం బయటపడింది. దీంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు సదరు పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నించారు.
పాఠశాల సిబ్బంది సరిగా స్పందించక, దురుసుగా సమాధానాలు ఇవ్వడంతో వారు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ అమానవీయ ఘటనకు పాల్పడిన పీఈటీ, సహాయక సిబ్బందిని అరెస్టు చేశారు. ఈ ఘటనకు బాధ్యుడైన పాఠశాల డైరెక్టర్ కొడుకు పరారీలో ఉండగా.. అతడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications