Video: ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నీళ్లు.. బావిలో వింత ఘటన
ఒక్కసారిగా బావిలోని నీరు సముద్రంలో అలల్లాగా ఉవ్వెత్తున ఎగిసిపడుతూ, వింతగా అలజడి సృష్టిస్తే ఎవరికైనా ఒళ్ళు జలదరిస్తుంది. గుజరాత్‌లోని మోర్బీ తాలూకా వీర్‌పర్డ గ్రామంలో సరిగ్గా అలాంటి అరుదైన ఘటనే చోటుచేసుకుంది. స్థానిక రైతు ప్రాంజీవన్‌భాయ్ సర్దియా అనే వ్యక్తి తన పొలంలో కొత్తగా తవ్వించిన బావిలో నీరు అకస్మాత్తుగా కలవరపడుతూ కిందకీ పైకీ కదలడం ప్రారంభించింది.
ఈ వింత దృశ్యం ఆది, సోమవారాల్లో కనిపించి, మంగళవారానికి ప్రశాంతంగా మారినా.. బుధవారం సాయంత్రం మళ్లీ మొదలైంది. దీంతో గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల ఊళ్ల ప్రజలు కూడా భయంతో దెయ్యాలు, చేతబడులు లేదా ఏదో అదృశ్య శక్తి హస్తం ఉందని భావించి అక్కడికి తండోపతండాలుగా తరలివచ్చారు.

అసలు నిజం తేల్చిన నిపుణులు
బావిలో ఉప్పొంగుతున్న నీటి వెనుక ఏ మూఢనమ్మకాలు లేవని, దాని వెనుక పక్కా శాస్త్రీయ కారణం ఉందని భూగర్భ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. జిల్లా మైనింగ్, జియాలజీ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమికంగా పరిశోధనలు జరిపింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల భూగర్భ జలాలు ఊహించని స్థాయిలో రీఛార్జ్ అయ్యాయని అధికారులు వెల్లడించారు. నీటి ప్రవాహం వేగంగా బావిలోకి వస్తున్న సమయంలో లోపల చిక్కుకుపోయిన గాలి బయటకు రావడానికి ప్రయత్నించడం వల్లే నీటిలో ఈ విధమైన ప్రకంపనలు, అలజడి కనిపిస్తున్నాయని నిపుణుడు జగదీష్ వాధేర్ వివరించారు.
భూకంపాలు కావు.. భయపడాల్సిన పనిలేదు!
ఈ వింతను చూసి చాలామంది పరిసర ప్రాంతాల్లో భూకంపం ఏమైనా వస్తుందా అని తీవ్ర ఆందోళన చెందారు. అయితే సీస్మోలాజికల్ పరిశోధనా సంస్థతో సంప్రదింపులు జరిపిన అనంతరం, ఆ ప్రాంతంలో ఎలాంటి భూకంప కదలికలు గానీ, భూమి లోపల ఫాల్ట్ లైన్స్ గానీ లేవని అధికారులు తేల్చిచెప్పారు. ఇది కేవలం గాలి మరియు భూగర్భ నీటి ఒత్తిడి వల్ల జరుగుతున్న సహజ సిద్ధమైన ప్రక్రియేనని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు.
కట్టుకథలను నమ్మవద్దని కలెక్టర్ పిలుపు
ఈ ఘటనపై మోర్బీ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ ఖరే స్పందిస్తూ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను, దెయ్యాల కథనాలను ఎవరూ నమ్మవద్దని కోరారు. బావి లోపల ఏర్పడిన వాయు ఒత్తిడే ఈ మార్పుకు కారణమని కలెక్టరేట్ వెల్లడించింది. త్వరలోనే భూగర్భ జలాల ప్రత్యేక పరిశోధనా బృందం అక్కడికి వచ్చి పూర్తి నివేదిక ఇస్తుందని తెలిపారు. అనవసరంగా భయాందోళనలు వ్యాప్తి చేసే వారిపై చట్టపరంగా చర్యలు ఉంటాయని, ప్రజలు ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.




Click it and Unblock the Notifications