కర్మభూమి: వడొదర నుంచి నరేంద్ర మోడీ నామినేషన్
వడొదర: గుజరాత్ రాష్ట్రంలోని వడొదర తన కర్మ భూమి అని భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బుధవారం ఆయన వడొదర లోకసభ నియోజక వర్గం నుంచి లోకసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వడొదరను తన కాలంలోనే అభివృద్ధి చేసిన మహారాజ శాయజీరావు గైక్వాడ్ ఆదర్శంగా నిలిచారని అన్నారు. అతని అభివృద్ధి మార్గంలోనే ముందుకు వెళతామని చెప్పారు.
తన ముందుచూపుతో వడొదర రాష్ట్ర ప్రజలకు మంచి పాలన అందించారని శాయజీరావును మోడీ కొనియాడారు. శాయజీరావు చేసిన అభివృద్ధి ఫలాలను వడొదర రాష్ట్రంలోని వద్నానగర్‌లో జన్మించిన తాను కూడా అనుభవించానని మోడీ తెలిపారు. తాను చిన్నతనం అంతా వడొదరలోనే కొనసాగిందని, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆరెస్సెస్) ప్రచారక్‌గా గతంలో కొనసాగినట్లు తెలిపారు.

శాయాజీరావు ముఖ్యంగా మూడు అంశాలపై దృష్టి సారించారని, అవి బాలికల చదువు, నీటి సరఫరా, గ్రంథాలయాలు అని మోడీ వివరించారు. అతని మంచి పాలన వల్ల తాను ప్రాథమిక విద్య పూర్తి చేసినట్లు మోడీ తెలిపారు. ఇంతటి మహొన్నత చరిత్ర గల వడొదర నుంచి తనకు టికెట్ కేటాయించిన పార్టీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శాయాజీరావు మనవడైన రంజిత్‌సింహ్ భార్య శుభాంగినిరాజే మోడీని వడొదర నుంచి పోటీ చేయాలని కోరడం గమనార్హం.
కాగా, మోడీ నామినేషన్ ర్యాలీలో భారీ ఎత్తున బిజెపి కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. బిజెపికి మద్దతిస్తే సుపరిపాలన అందిస్తామని మోడీ అన్నారు. వడొదర ప్రజలంతా తనకు మద్దతిస్తారన్న విశ్వాసం ఉందని ఆయన అన్నారు. ఎన్నికలను ఒక పండగలా జరుపుకోవాలని, అత్యధిక మెజార్టీతో బిజెపిని గెలిపించాలని మోడీ ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications