కమలంతో సెల్ఫీ: మోడీకి చిక్కు, ప్రార్థించి ఓటేసిన భార్య
గాంధీ నగర్: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ చిక్కుల్లో పడ్డారు. గుజరాత్‌లో ఆయన ఉదయం ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన అక్కడ తన సెల్ ఫోనుతో సెల్ఫీ (సొంతగా ఫోటో) తీసుకున్నారు. అంతేకాదు ఆయన కమలం పువ్వుతో వచ్చారు.
ఇది ఆయనకు చిక్కులు తెచ్చింది. దీనిపై కాంగ్రెసు పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఓటు హక్కు వినియోగించుకన్న తర్వాత పార్టీ గుర్తు చూపిస్తా.. మోడీ మాట్లాడారని కాంగ్రెసు పార్టీ ఈసికి పంపిన లేఖలో పేర్కొంది.

మోడీ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేసింది. మోడీని అనర్హుడిగా ప్రకటించాలని కోరింది. వివిధ టీవీ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈఘటనను వీక్షించామని ఏఐసిసి అధికారి కెసి మిట్టల్ చెప్పారు. మోడీ మాట్లాడిన అంశానికి సంబంధించిన వీడియోను పంపించాలని బిజెపిని ఈసి ఆదేశించింది.
ఓటు వేసిన అనంతరం మోడీ సెల్ఫీ తీసుకున్నారు. ఇంక్‌తో కూడిన తన వేలి ఉంగరాన్ని, తాను తెచ్చిన కమలంతో కలిసి సెల్ఫీ తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తల్లీ కొడుకుల ప్రభుత్వాన్ని ఇంకెవరూ కాపాడలేరని చెప్పారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గల్లంతవుతుందని, బలమైన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. కాగా, బిజెపి అగ్రనేత అద్వానీ నియోజకవర్గంలో ఓటు వేసినందుకు చాలా గర్వంగా ఉందని మోడీ ట్వీట్ చేశారు.
ఆటోలో వెళ్లి ఓటేసిన మోడీ తల్లి
మోడీ తల్లి హీరాబెన్ గుజరాత్‌లోని గాంధీనగర్ నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆటోలో పోలింగ్ కేంద్రానికి వెళ్లిన హీరాబెన్ సిబ్బంది సహాయంతో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆమె గాంధీ నగర్ లోకసభ నియోజకవర్గం సెక్టర్ 22లోని పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. మరోవైపు మోడీ సతీమణి జశోదాబెన్ మెహ్సానా నియోజకవర్గంలో ఓటు వేశారు. ఓటు వేయడానికి ముందు ఆమె దేవాలయానికి వెళ్లి మోడీ విజయం కాంక్షిస్తూ ప్రార్థించి.. ఆ తర్వాత ఓటు వేసేందుకు వెళ్లారు.












Click it and Unblock the Notifications